- గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహముంబేర్కొనునుత్తమోత్తములబాధంబెట్టగానోపునే?
దహనుంగప్పగ( జాలునే శలభ సంతానంబు? నీ సేవ( జే
సి హతక్లేశులు గారు గాక మనుజుల్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! నీ – కల్యాణ – నామంబు – నీ శుభప్రదమైన పేరును, ప్రతి – అహమున్ – ప్రతిరోజు, అనునిత్యము, పేర్కొను – జపిస్తూ ఉండే, ఉత్తమ – ఉత్తములన్ – శ్రేష్ఠులలో శ్రేష్ఠులైనవారిని, గ్రహదోషంబులు – గ్రహస్థితుల వల్ల కలిగే దుష్ఫలితాలు గాని, దుః – నిమిత్తములున్ – అపశకునములు గాని, బాధన్ – పెట్టన్ – కాన్ – బాధించటానికి, ఓపును – ఏ – సమర్థములా? శలభసంతానంబు – మిడుతలదండు, దహనున్ – అగ్నిని, కప్పగన్ – చాలునే -మూసివేయగలవా? మనుజుల్ – మనుష్యులు, నీ సేవన్ – చేసి – నిన్ను సేవించి, హతక్లేశులు – కష్టాలు లేనివారు, కారు – కాక – కాక పోవుచున్నారు.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! అనునిత్యం నీ శుభనామాన్ని జపించే సత్పురుషులను, గ్రహస్థితులు సరిగా లేకపోవటం వలన కలిగే దుష్ఫలితాలు గాని, అపశకునాలు మొదలైనవి గాని బాధించ లేవు -మిడుతలదండు అగ్నిని కప్పలేనట్టుగానేమానవులు నిన్ను కొలిచి కష్టాలని జయించినవారు కాకపోవుచున్నారే! ఎంత అమాయకులు!
విశేషం:
‘శివ’శబ్దానికి శుభప్రదుడని అర్థం. అటువంటి శివనామాన్ని జపిస్తే అశుభాలుండవు. శివుడు గ్రహాలన్నింటిపై పెత్తనం కలవాడు. అతడి కరుణే ఉంటే గ్రహాలు, వాటి వలన కలిగే దుష్ఫలితాలు ఏం చేయగలవు? ఏదైనా చేయబోతే అగ్నిని కప్పబోయినమిడుతలదండుచందమవుతుంది. మిడుతలదండు అగ్నిని కప్పలేకపోగా తానే కాలి బూడిదై నశిస్తుంది. శివభక్తులకు అపకారం చేయబోతే, సఫలం కాకపోగా గ్రహాలకే దుర్గతులు కలగవచ్చు.
చక్కని అర్థాంతరన్యాసాలంకారం.
ఇదికూడా చదవండి :శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 28