- అమ్మా! యయ్య!యటంచునెవ్వరిని నే నన్నన్ శివా! నిన్నునే
సుమ్మీ! నీ మది( దల్లిదండ్రులనటంచుంజూడగా( బోకు, నా
కిమ్మై( దల్లియు( దండ్రియున్ గురుడు నీవే కానసంసారపుం
జిమ్మంజీకిటి కప్ప కుండం గనుమా ! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! శివా – శుభప్రదుడవైన శివా! నేను – నేను, అమ్మా -తల్లీ! అయ్యా – నాన్నా!, అటంచు – అంటూ, ఎవరిని -ఎవరిని, అన్నన్ – పిలిచినా, నిన్నునే – నిన్నే, సుమ్మీ – సుమా!, తల్లి తండ్రులన్ – జననీ జనకులని, అటంచున్ -పిలుచుచున్నానని, మదిన్ – మనస్సులో, చూడంగాన్ – పోకు – తలచ వద్దు, నాకు – నాకు, ఈ -మైన్ – ఈ శరీరానికి, తల్లియున్ – తల్లియు, తండ్రియున్ – తండ్రియు, గురుడున్ – గురువును, నీవు – ఏ – నువ్వు మాత్రమే, కాన – అందువలన, సంసారము – చిమ్మచీకటి – సంసారం అనే దట్టమైన చీకటి, కప్ప కుండన్ – అవరించ కుండా, కనుమా – చూడవలసినది , కాపాడవలసినది.
తాత్పర్యం:
శుభప్రదుడవైనశ్రీకాళహస్తీశ్వరా! అమ్మా!, నాన్నా! అని నేను ఎవరినైనా పిలిచినా ఆ పిలిచినది నిన్నే సుమా! పిలిచినది జన్మ నిచ్చినతల్లితండ్రులనిఅని భావించ వద్దు. ఎందుకంటేశరీరధారినైన నాకు ఈ జన్మలో తల్లి, తండ్రి, గురువు నీవే. నమ్మిన నన్ను జననమరణ రూపమైన అంధకారం కప్పివేయకుండకాపాడుము.
విశేషం:
ధూర్జటి అనన్యభక్తి, శరణాగతి, ప్రస్ఫుటంగా కనపడతాయి ఈ పద్యంలో. 24, 26 పద్యాలలో చెప్పిన భావాలనే ఈ పద్యంలో నొక్కివక్కాణించాడు. ఎవరిని ఏ చుట్టరికంతో సంబోధించినా అది శివుణ్ణి పిలిచినట్లే అనటం సమస్తంలోనూ సర్వాంతర్యామి అయిన శివుణ్ణే ధూర్జటి దర్శించి, అనుభూతి చెందటానికి నిదర్శనం.
ఇది కూడా చదవండి :శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 26