Sunday, November 24, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 24

24. నిన్ను నమ్మిన రీతి నమ్మ నొరులన్ నీ కన్న నా కెన్న లే
రన్నల్దమ్ములు తల్లి దండ్రులుగురుండాపత్సహాయుండు, నా
యన్నా! యెన్నడు నన్ను సంసృతివిషాదాంభోధి దాటించి య
చ్ఛిన్నానందసుఖాబ్ధిదేల్చెదొకదే

శ్రీకాళహస్తీశ్వరా !
ప్రతిపదార్థం: నా – అన్నా – నా తండ్రీ! శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను – నిన్ను, నమ్మిన – నమ్ముకున్న, రీతిన్ – విధముగా, ఒరులన్ – ఇతరులను, నమ్మను – విశ్వసించను. ఎన్నన్ – పరికించి చూసినట్టయితే, నాకు – నాకు అన్నల్ – అన్నలు, అగ్రజులు, తమ్ముల్ – తమ్ముళ్లు, అనుజులు, తల్లి – తండ్రులు – జననీ జనకులు, గురుండు -మార్గదర్శకుడైన గురువు, ఆపత్ – సహాయుండు – ఆపదలలో సహాయం చేసేవాడు, (ఆదుకున్నవాడు), నీకన్నన్ – నీ కంటె/ నీవు కాక మఱెవ్వరు, లేరు – లేరు. నన్ను-నన్ను, సంసృతి్స సంసారం అనే, విషాద – అంభోధిన్ -విషాదసముద్రాన్ని, దాటించి -తరింప చేసి, అచ్ఛిన్న- ఆనంద-పరిపూర్ణమైన, నాశము కాని, శాశ్వతమైన ఆనందం అనే, సుఖ- అబ్ధిన్ -సుఖసాగరంలో, ఎన్నడు -ఎప్పుడు, తేల్చెదు- ఓ – కదే – ఓలలాడిస్తావో కదా! (దాని కోసం ఎదురుచూస్తున్నానని భావం).

తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను నమ్మినట్లు నే నితరులనెవ్వరిని నమ్మను. నీవే తప్ప నాకు అన్నలు, తమ్ములు, తల్లితండ్రులు, గురువులు, ఆపదలో ఆదుకొనే ఆప్తులు మఱెవ్వరూ లేరు. నన్ను ఈ సంసార మనే విషాదసముద్రాన్నిదాటించి, చెక్కుచెదరని ఆనందం అనే సుఖసముద్రంలో ఎప్పుడు ఓలలాడిస్తావో కదా! (దాని కోసం ఎదురు చూస్తున్నానని భావం).

విశేషం: ఈ పద్యంలో పరిపూర్ణ శరణాగతి, ఏకాంతభక్తి దర్శన మిస్తాయి. “నీవే తప్ప నితఃపరంబెరుగ ” నని చెప్పిన శరణాగతి. లోకం లోని సమస్త సంబంధాలు తనకు భగవంతుడితో తప్ప మఱెవ్వరితోను లేవట! ఉన్నదల్లా తాను, తన దైవం అనేదే ఏకాంత భక్తి. సృష్టిలోని సమస్తం పరమాత్మయే. సమస్తమైన చుట్టరికాలు కూడ పరమాత్మయే. సర్వం శివమయం. ఇట్టి తనకు మొక్కవోని తరగని ఆనందంలో తేలియాడే అర్హత ఉందనే సూచన ఉంది. కాని, అది ఎప్పుడన్నది పరమేశ్వరుడి కరుణ పై ఆధారపడి ఉంది.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇది కూడా చ‌ద‌వండి :శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 23

Advertisement

తాజా వార్తలు

Advertisement