Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 23

23. తరగల్పిప్పలపత్రముల్, మెఱుగుటద్దంబుల్మరుద్దీపముల్
కరికర్ణాంతములెండమావులతతుల్ఖద్యోతకీటప్రభల్
సురవీధీలిఖితాక్షరంబులసువుల్జ్యోత్స్నాపయఃపిండముల్
సిరులందేలమదాంధులౌదురుజనుల్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!సిరులు – సంపదలు, తరగల్ – కెరటాలు/ అలలు, పిప్పలపత్రముల్ – రావిఆకులు, మెఱుగు – అద్దముల్ – మెరిసే, కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్దాలు, మరుత్ – దీపముల్ – గాలిలో పెట్టిన దీపాలు, కరి – ఏనుగ యొక్క, కర్ణ – అంతముల్ – చెవుల కొసలు, ఎండమావుల – మరీచికల యొక్క, తతుల్ – సముదాయములు, ఖద్యోత – కీట – మిణుగురు పురుగుల, ప్రభల్ – కాంతులు,సురవీధీ – ఆకాశ వీధిలో, లిఖిత – రచించబడిన, అక్షరంబుల్ – అక్షరాలు, అసువుల్ – ప్రాణములు, జ్యోత్స్నా – పయః – పిండముల్ – వెన్నెల అనే పాలతో చేసిన ముద్దలు, అందు – అటువంటి సిరులందు, జనులు – మానవులు, ఏల – ఎందువలన, మద – అంధులు – పొగరెక్కికన్నుకాననివారు, ఔదురు – అవుతారు? ( అర్థం కావటం లేదు అని భావం)
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!సిరులునీటికెరటాల వలె, మెరిసే అద్దాల వలె, గాలిలో పెట్టిన దీపాల వలె, ఏనుగుచెవులకొసల వలె, ఎండమావుల వలె, మిణుగురు పురుగుల కాంతుల వలె, ఆకాశంలో ( గాలిలో) రాసిన అక్షరాల వలె, జీవులలోని ప్రాణాల వలె చాల చంచలాలు, ఆశాశ్వతాలు. అటువంటి ఆశాశ్వతాలైన ఐశ్వర్యాలను చూచి, మదించి, గ్రుడ్డివారి వలె, కన్నుమిన్నుకానక ప్రవర్తిస్తారు మనుషులు. అందుకు కారణం తెలియదు. ( అజ్ఞానమై ఉండ వచ్చు)

విశేషం:
అశాశ్వతాలు, చంచలాలు అయిన వస్తువుల నన్నింటిని సంపదలకు ఉపమానంగా చెప్పాడు ధూర్జటి. వాటిలో ప్రాణాలు కూడా ఉన్నాయి. సంపదల ప్రయోజనం ప్రాణాలు ఉంటేనే కదా! ప్రాణాలే అశాశ్వతం అయినప్పుడు సంపదలను అనుభవించటం ఇంకెంత అశాశ్వతమో! ఎఱిగి మానవుడు శాశ్వతమైన దాని కొఱకు, అంటే, భగవంతుడి కొఱకు ప్రయత్నం చేయాలని తెలుసుకోని మానవుల అజ్ఞానానికి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు ధూర్జటి.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి


ఇది కూడా చ‌ద‌వండి :శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 22

Advertisement

తాజా వార్తలు

Advertisement