13. ఏ వేదంబుపఠించెలూత?భుజగంబే శాస్త్రము ల్సూచె? దా
నే విద్యాభ్యసనంబొనర్చె( గరి? చెంచే మంత్ర మూహించె? బో
ధావిర్భావనిదానముల్చదువులయ్యా? కావు నీపాదసం
సేవనాసక్తియె కాక జంతు తతికిన్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!లూత- సాలె పురుగు,ఏ వేదంబు – ఏ వేదాన్ని,పఠించె – చదివెను?, భుజంగంబు – పాము, ఏ శాస్త్రముల్ – శాస్త్ర గ్రంథాలు వేటిని,చూచెన్ – పరిశీలించింది? కరి – ఏనుగ, తాను – స్వయంగా, ఏ విద్య – అభ్యసనంబు – ఒనర్చెన్ – ఏ విద్యలు చదివింది?, చెంచు – బోయవాడు( తిన్నడు), ఏ మంత్రము – ఏ మంత్రాన్ని, ఊహించెన్ – తలచాడు? ధ్యానం చేశాడు?, జంతుతతికిన్ – ప్రాణికోటికి, నీ పాద – సంసేవన – ఆసక్తియె – నీ పాదాలను ఇష్టంతో సేవించటం పట్ల ఉన్న కుతూహలం ఒక్కటియె, కాక – తప్ప, చదువులు – మామూలుగా అందరు చదువుకునే చదువులు, బోధ – జ్ఞానం, ఆవిర్భావ – కలగటానికి, నిధానముల్ – కారణములా? అయ్యా – స్వామీ, కావు – కావు.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!ప్రాణికోటులకు బోధ (జ్ఞానం) కలగటానికి మూలాలు లౌకికవిద్యలు కావు. అవిద్య తొలగటానికి నీ పాదసేవాసక్తిఒక్కటియే మూలము. దానికి నిదర్శనం నిన్ను సేవించి మోక్షం పొందిన జీవులే. నీ దయ చేత మోక్షం పొందిన సాలెపురుగు ఏ వేదం చదివింది? (చదువ లేదు కదా). పాము ఏ శాస్త్రాలు పఠించింది?(లేదు కదా). ఏనుగ ఏ విద్యలు నేర్చింది? (లేదే). చెంచు (తిన్నడు) ఏ మంత్రాన్ని ధ్యానం చేశాడు?వారందఱకు ముక్తి కారకమైన జ్ఞానం నీ పదసంసేవనం వలన మాత్రమే లభించింది.
విశేషం:
శ్రీకాళహస్తికి సంబంధించిన స్థలపురాణమంతా ఈ పద్యంలో ఉన్నది. పురుగు అయిన సాలీడు, సరీసృపం అయిన పాము, జంతువు అయిన ఏనుగ కూడా శివుణ్ణి తమకు చేతనైన రీతిలో పూజించి, ముక్తిని పొంది, ఈశ్వరుడి నామంలోను,తీర్థనామంలోను స్థానాన్ని సముపార్జించుకున్నాయి. వేటాడటం తప్ప,మఱొక్కటి తెలియని తిన్నడు ఎటువంటి విద్యాభ్యాసం, మంత్రోపదేశం మొదలైనవి లేకుండానే ముక్తిని పొందాడు. దానికి కారణం అతడు తిన్నడు( తిన్నగా, చక్కగా, సరళంగా, వక్రం కాకుండా ఉన్న ప్రవర్తన కలవాడుఅనగా సత్ప్రవర్తన కలవాడు) కావటమే. ఋజువర్తనం కలవారిని భోలాశంకరుడు భక్తి నొసగి, కరుణిస్తాడు. అటువంటి దానికి పెద్ద పెద్ద చదువుల అవసరం లేదు. చదివిన చదువు ప్రవర్తనని సరిదిద్ది మెఱుగుపెట్టేది అయితేనే తప్ప వృథ. భక్తి మానవుడి ప్రవర్తనని ఋజుమార్గంలో పెడుతుంది. కనుక అది ఒక్కటియే నిజమైన విద్య. మానవుడు పురుగులు, పాములు,ఏనుగలు, బోయలు మొదలైన వాటి పాటి కూడా చేయక అధోగతి పాలవుతున్నాడని ధూర్జటి ఆవేదన.
ఇదికూడా చదవండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 12