Saturday, November 16, 2024

గంధర్వులపై ఘన విజయం

భరతుని మేనమామ యుధాజిత్తు గార్గ్య మహర్షి ద్వారా శ్రీరామునికి సందేశం పంపాడు. గార్గ్య మహర్షి రాక వార్త విని శ్రీరాముడు సోదరసమేతుడై ఒక క్రోసు దూరం ఎదురేగి, సముచిత గౌరవంతో అయోధ్యకు కొనివచ్చి పూజించి గౌరవించాడు. గార్గ్య మహర్షి యుధాజిత్తు సందేశాన్ని ఇలా తెలి పాడు. ”రామా, కేకయరాజ్య సమీపంలో శైలూషుడనే గంధర్వ రాజు వంశీయులు గంధర్వ దేశాన్ని పాలిస్తున్నారు. వారు మహాబల పరాక్రమ సంపన్నులు. వారు మాకు సంకటంగా తయారయ్యారు. నీవు వెంటనే గంధర్వ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొనడం మేలు!” అనే యుధాజిత్తు సందేశాన్ని గౌరవించి రాముడు ఇలా అన్నాడు.
”భరతుడు సేనాసమేతుడై వెళ్ళి గంధర్వ ప్రభువులను జయింపగలడు. భరతుని కొడుకులు తక్షుడు, పుష్కలుడు మా మామ యుధాజిత్తు సహాయ సహకారాల ప్రాపుతో ఆ రాజ్యాలను సుభిక్షంగా పాలింపగలరు!” అని రాముడు యుధాజిత్తునకు ప్రతి సందేశం పంపాడు. పిమ్మట భరతుడు రామాజ్ఞను అనుసరించి, గంధర్వులపై దాడి చేశాడు. వారి మధ్య ఏడు రోజులు సంగ్రామం జరిగింది. విజయం భరతుని వరించింది. భరతుడు తక్షశిల, పుష్కలావతరం అనే రెండు నగరాలను నిర్మించాడు. తక్షశిలకు
తక్షుని, పుష్కలావత రాజ్యానికి పుష్కలుని పట్టాభిషక్తులను చేశాడు.
పిమ్మట శ్రీరాముడు లక్ష్మణుని కుమారులు అంగదుడు, చంద్ర కేతువులకు రెండు రాజ్యాలను అప్పగించ తలచాడు. తగిన నగరాలను సూచింపుమని లక్ష్మణుని అడిగాడు. అంగదుని కొరకు కారుపథ దేశంలో ఒక నగరాన్ని, చంద్ర కేతువులకు రెండు రాజ్యా లను అప్పగించదలచాడు. తగిన నగరాలను సూచింపుమని లక్ష్మ ణుని అడిగాడు. అంగదుని కొరకు కారుపథ దేశంలో ఒక నగరాన్ని, చంద్ర కేతువు కొరకు చంద్ర కాంత పురాన్ని నిర్మిద్దాం అన్నాడు లక్ష్మ ణుడు. అంగదుని అంగదీయ పురానికి, చంద్ర కేతువును చంద్ర కాంత పురానికి అభిషక్తులను గావించాడు. భరత లక్ష్మణులు రాముని సేవిస్తూ సుఖంగా జీవించారు.
రాముడు లక్ష్మణుని పరిత్యజించుట
బ్రహ్మ శ్రీరామునికి కాలుని ద్వారా సందేశం పంపాడు. కాలు డు తాపసి రూపంలో వచ్చాడు. తన రాకను గూర్చి రామునికి తెలుపుమని లక్ష్మణునికి చెప్పాడు. లక్ష్మణుడు రాముని అనుమతి పొంది, తాపసిని రామమందిరంలో ప్రవేశ పెట్టాడు. రాముడు తాపసిని సముచితంగా ఆదరించి అతనికి ఆసనమిచ్చి, ”తమ రాకకు కారణమేమి?” అని అడిగాడు. ప్రభూ నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి. మనం మాట్లాడు తుండగా ఎవ్వరు మందిరంలో ప్రవేశింపరాదు. మనల్ని చూడరా దు. మన మాటల్ని వినరాదు. షరతును అతిక్రమించిన వానిని నీవే వధించాలి” అన్నాడు. శ్రీరాముడు తాపసి షరతును తెలిపాడు. ”దీనిని అతిక్రమిస్తే, నా చేత వారు హతులవుతారు. జాగ్రత్త సుమా!” అని హెచ్చరించాడు లక్ష్మణుడు ద్వారం వద్ద నిలిచాడు.
తాపసి ”రామా! నేను బ్రహ్మదేవుని దూతగా వచ్చాను. నేను కాల పురుషుడను. బ్రహ్మను సృష్టించినప్పుడే నీ మాయ ద్వారా పుట్టిన నీ కుమారుడను. బ్రహ్మ సందేశం చెబుతాను వినుము. నీ అవతార ప్రయోజనం నెరవేరింది. నీవు కృతకృత్యుడవు అయ్యావు. ఇక నీవు నీ పరంధామమునకు చేరాల్సిన సమయం ఆసన్నమైంది” అని తెలిపాడు.
రాముడు బ్రహ్మ సందేశాన్ని విని, ”కాలుడా! నీ రాక శుభప్ర దం! బ్రహ్మ సందేశం సముచితమైనది. ఇక నేను వైకుంఠానికి చేరా లని నిశ్చయించాను. సమయోచితంగా బ్రహ్మ సందేశం పంపాడు. అట్లే చేయగలను” అన్నాడు.
శ్రీరాముడు, కాలుడు మాట్లాడుచుండగా దుర్వాస మహర్షి రాజమందిర ద్వారం వద్దకు వచ్చాడు. వెంటనే రాముని దర్శించా లని పట్టుపట్టాడు. తాపసి షరతును స్మరించి లక్ష్మణుడు దిక్కు తోచక, దుర్వాసుని సమాధానపరచడానికి ప్రయత్నించాడు. ”మహాత్మా రాముడు అత్యవసర సమావేశమునందు ఉన్నాడు. తమ వాంఛ తెలుపుడు” అని లక్ష్మణుడు అడిగాడు.
లక్ష్మణుని మాటలు దుర్వాసుడు కోపావేశపూరితుడై ఊగిపో తూ, ”వెంటనే రామ దర్శనం లభించకపోతే, కోసల రాజ్యం అయో ధ్యానగరం, రామ భరతులు, నీవు భస్మం అవుతారు” అని హుంక రించాడు. రామమందిరంలో ప్రవేశిస్తే నాకు చావు తథ్యం! ముని కోరిక తీర్చకపోతే వంశమూ దేశమూ సర్వనాశనమవుతుంది. దేశం, వంశం నాశనం కావడం కంటే నేను మాత్రమే చావడం మేలు! నిర్ణయించుకుని లక్ష్మణుడు, శ్రీరాముడు, కాలుడు మాట్లాడు తుండగా లోపల ప్రవేశించాడు. రాముడు కాలుని పంపివేశాడు. ద్వారం వద్ద వేచి ఉన్న దుర్వాసుని వద్దకు వచ్చాడు. చేతులు జోడిం చి, ”మహాత్మా! నా కర్తవ్యం ఏమి?” అని అడిగాడు.
”రామా! నేను నిరాహరుడనై, వేయి సంవత్సరాలు తప్పు చేశా ను. నా వ్రత నిష్ట ముగిసింది. నేను ఆకలితో దహించుకునిపోతు న్నాను. నాకు సిద్దాన్నాన్ని పెట్టించు”మన్నాడు దుర్వాసుడు. శ్రీరాముడు అన్నం పెట్టించాడు. దుర్వాసుడు సంతృప్తుడై వెళ్ళిపోయాడు. రాముడు కాలుడు విధించిన షరతును స్మరించి, విషణ్ణ వదనుడయ్యాడు. లక్ష్మణుడు రాముని మనోవ్యథను గ్రహిం చాడు. ”ఎవరైనా ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. నీవు చింతింప వద్దు. నీ కర్తవ్యాన్ని నిర్వహింపు” అని లక్ష్మణుడు కోరాడు.
లక్ష్మణుని మాటలను విని రాముడు చలించిపోయాడు. రాముడు పురోహితులతో మంత్రులతో సంప్రదించాడు. ”నన్ను తండ్రి వలె భావించి, సేవించిన సోదరుని ఎలా వధింపగలను?” అన్నాడు. ”త్యజించడం అంటే వధించడమే! కావున రామా! లక్ష్మ ణుని పరిత్యజింపు”మన్నాడు వసిష్ఠుడు. రాముడు నిండు సభలో ”లక్ష్మణా! నిన్ను నేను త్యజిస్తున్నాను” అన్నాడు. లక్ష్మణుడు తన ఇంటికి కూడ పోకుండ, సరయూ నది చేరాడు. ఆచమనం చేశాడు. చేతులు జోడించాడు. ఇంద్రియ నిగ్రహంతో ప్రాణ నిరోధం చేశాడు. లక్ష్మణుడు అదృశ్యమయ్యాడు. శ్రీ మహా విష్ణువు నాల్గవ భాగం వైకుంఠం చేరింది.

– కె. ఓబులేశు , 9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement