Thursday, October 3, 2024

ఘనసారపు ఘనత!

”శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజ తాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహనీ శుభాకారత” కల్గిన శ్రీ సరస్వతీదేవి ధావ ళ్యానికి (తెలుపు తనానికి) ఉపమానాలుగా పోతన కవి వాడిన ప్రశస్తమైన తెల్లని వస్తువుల జాబితాలో చేరినట్టిది ఘనసారం అంటే కర్పూరం. తెల్లని, చల్లని వెన్నెలకు సౌరభము, అంటే సువాసన, గనుక అబ్బితే అప్పుడది కర్పూరానికి సాటి రాగల దని తన కవితా గుణాలను వివరించే సందర్భంలో పింగళి సూరన కవి ప్రశంసించిన అద్భుతమైన పూజాద్రవ్యం కర్పూ రం. తాంబూలంలో పచ్చ కర్పూరపు మేళవింపు తనకు కవితా ప్రేరకమన్నాడు అల్లసాని పెద్దన ”నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము…” అనే పద్యంలో. ”కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంబరా!” అంటూ పచ్చకర్పూ రముతో కూడిన తాంబూలపు పరిమళాలతో దశదిక్కులనూ రంజింపచేయునదిగా లలితసహస్రనామ స్తోత్రంలో శ్రీ లలి తాదేవి కీర్తింపబడి ఉంది కదా! కర్పూరము, ఉప్పు చూడడాని కి ఒకేలా ఉన్నా పుణ్యపురుషుల వంటిది కర్పూరం కాగా, సా మాన్యులవంటిది ఉప్పు అంటూ కర్పూరానికి గల విశి ష్టతను కీర్తించాడు వేమన కవి తన ”ఉప్పు కప్పురంబు..” పద్యంలో.
తెల్లదనానికి, చల్లదనానికి, సువాసనకు మాత్రమేగాక, ఆధ్యాత్మికతకు, ఔషధ గుణాలకు కూడా పేరెన్నిక గన్నది కర్పూరం. ఇది చైనా, జపాన్‌లలో విరివిగా పెరిగే ‘కాంఫర్‌ లారె ల్‌’ లేదా ‘సిన్న మొమం కామ్‌ ఫోరా’ అనే చెట్ల నుండి లభ్యమ య్యే అద్భుత ద్రవ్యం. మన దేశంలో కూడా మైసూర్‌, మలబా ర్‌ ప్రాంతాలలో కర్పూరం చెట్లు కన్పిస్తాయి. ‘లారేసీ’ కుటుం బానికి చెందిన ఆ చెట్ల ఆకులు, కొమ్మలు, మట్టల నుండి కొన్ని రకాల తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారుచే స్తారు. కర్పూర వృక్షాల కాండాల మీద గాట్లు పెట్టి, ఆ గాట్లలో నుంచి వచ్చే పాలతో కర్పూరాన్ని తయారు చేస్తారు. వివిధ రూపాలలో, సైజులలో కర్పూ రపు బిళ్ళలు మార్కెట్లో లభిస్తున్నాయి.
వంటకాలలో, కాటుక తయారీలో వాడే కర్పూరాన్ని పచ్చ కర్పూరమనీ, పూజా సమ యాలలో నీరాజనానికి ఉపయోగించే కర్పూ రాన్ని హారతి కర్పూరమనీ, ఔషధాల తయారీ లో వాడే కర్పూరాన్ని భీమసేన కర్పూరమనీ, రస కర్పూరమని అంటారు. ఇంకా చాలా రకా ల కర్పూరాలున్నా మనం ఎక్కువగా వాడేవి పైన చెప్పిన కర్పూర రకాలు మాత్రమే.
నిత్య పూజలు, విశేష పూజలు, యజ్ఞయా గాది క్రతువులలో కర్పూర నీరాజనానికి ఎంతో ప్రాధాన్యత ఉం ది. విద్యుద్దీపాలు లేని రోజులలో ఆలయంలోని గర్భగుడిలో మూల విగ్రహాన్ని ఆ పాద మస్తకం భక్తులు చూచి తరించే అవ కాశం లభించేది కర్పూర హారతి వెలుగుల వేళలోనే. కర్పూరా న్ని మండించినప్పుడు వెలువడే వాయువు ఆ పరిసరాలలోని వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. కర్పూర హారతిని కళ్ళకు అద్దుకోవడం వల్ల నేత్ర దోషాలు తొలగిపోతాయంటారు. ఆ కర్పూరపు గాలిని పీల్చిన భక్తుల శ్వాసావయవాలు శుద్ధి పొం దుతాయి. అందుకే పూజా సమయంలో హారతిని రెండు మార్లు (పూర్వ నీరాజనం, ఉత్తర నీరాజనం) ఇస్తారు.
అధికస్య అధికం ఫలం అన్నారు కదా పెద్దలు. నూనెతో లేదా నెయ్యితో తడిపిన వత్తులతో కూడా హారతి చేసే సంప్రదా యం ఉన్నా, భగవంతునికి కర్పూర హారతి మిక్కిలి ప్రీతికర మని భావిస్తారు.
”కర్పూరం చంద్ర సంకాశం జ్యోతి స్సూర్యమివోచితం/ భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివం.” చంద్రునిలా ప్రకాశాన్నీ, సూర్యునివలె వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే కర్పూర హారతిని మిక్కిలి భక్తితో నీకు ఇస్తున్నా దేవదేవా! అం టూ పరవశించిపోతారు భక్తులు. కర్పూరం మనకు మ#హత్తర సందేశమిస్తుంది. తాను కరిగిపోతున్నా పదిమందికీ జ్ఞాన పరిమళాలను, ఆధ్యా త్మిక తేజస్సునూ పంచాలని చెబుతుందది.
చురుకైన మేధస్సు కలవారిని కర్పూ రంతో పోలుస్తారు. జ్ఞానులకు, యోగులకు కర్పూరం వంటి #హృదయము ఉంటుంద ట. ”కప్పురంబు మనసు కాంక్షించు యోగి కి/జ్ఞాన దీప శిఖయుతా నటించు/ కానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్ఛ/ విశ్వదా భిరామ! వినుర వేమ!” కర్పూరం వంటి నిర్మలమైన మనస్సును అలవరచుకొన్న మ#హనీయు లకు జ్ఞాన జ్యోతి వెలిగి ఆత్మ సాక్షాత్కార సిద్ధి లభిస్తుందనీ, వారు జీవన్ముక్తులవుతా రనీ వేమనగారి భావం.
శుభకార్యాలలో, యజ్ఞ యాగాది క్రతువుల సమయంలో అగ్నిని ఏర్పరచడానికి కర్పూరం వినియోగిస్తారు. జన బా#హు ళ్యం వలన సంక్రమించే అనేక వ్యాధులను నివారించడం కోసం కర్పూర హారాలను కర్తలకు, వధూవరులకు ధరింపజేస్తారు. ఆయుర్వేద చికిత్సలలో కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఉంది. కర్పూరాన్ని జేబులో ఉంచుకొంటే దాని ప్రభావం వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ ఇబ్బందులు రావట! జలుబును, క ఫాన్ని తగ్గించడానికి, పలు రకాల చర్మవ్యాధుల నివారణకు, ఆర్థరైటి స్‌ వంటి నొప్పుల ఉపశమనానికి, కీటక నాశినిగాను ఇలా ఎన్నో విధాలుగా కర్పూరంవాడడం అనాదిగాఉంది. ఇలాంటి అద్భు తమైన, అద్వితీయమైన, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే పవిత్రమైన ద్రవ్యము నభూతో న భవిష్యతి.——

Advertisement

తాజా వార్తలు

Advertisement