ఒక్క రోజు ఆరాధనతో ఏడాది ఫలం
శివరాత్రి
శివరాత్ర మహోరాత్రం నిరాహారో జితేన్ద్రియ:
అర్చయేద్వా యథాన్యాయం తథాబలమ వంచక:
యత్ఫలం మమపూజాయాం వర్షమేకం నిరంతరమ్
తత్ఫలం లభతే సత్యం శివరాత్రే మదర్చనాత్
శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం ఉండి, ఇంద్రియాలను నియంత్రించి, త్రికరణ శుద్ధిగా శివార్చన చేసిన వారికి సంవత్సరమంతా శివుని ఆరాధించిన ఫలం లభిస్తుందని శంకరుడు బ్రహ్మకు చెప్పినట్లు పురాణ కథనం. ‘శం’ సుఖం పరమానందం. ‘ఇ’ కార: పురుషస్మృతమ్
‘వ’కారం శక్తిరమృతం ‘శివ’ ఇత్యుచ్యతే బుధ:
శివనామంలో మూడు వర్ణాలున్నాయి. అవి ‘శ, ఇ, వ’ అని విజ్ఞులు విభజించారు. వీటిలో శ కారం సుఖాన్ని, పరమానందాన్ని, ఇ కారం పరమ పురుషత్వాన్ని, వ కారం అమృత శక్తిని ప్రసాదిస్తుందని ఈ శ్లోకానికి అర్థం.
పరమ శివుని ఆరాధించేందుకు ప్రతి సోమవారం, ప్రతి ఆర్ద్ర నక్షత్రం, సంవత్సరంలోని కృష్ణ చతుర్దశి తిథులు (మాస శివరాత్రులు), ముఖ్యంగా మాఘ బహుళ చతుర్దశి (మహా శివరాత్రి) శ్రేష్ఠ మని పేర్కొంటారు.
శ్రీమదప్పయ్య దీక్షితులవారు తమ ‘శివ కర్ణామృతం’లో శివుడు ఓంకార స్వరూపుడని అంటూ
ఆదిస్వరం తృతీయేన సహితం బిందు సంయుతం
ధ్యాయామి హృదయే యోగి ధ్యేయం కామిత మోక్షదమ్
అని పేర్కొన్నారు. అంటే ఉకారం (మూడవ స్వరం )తో, బిందువు(మ్)తో కలిసిన అకారాన్ని (ఆది స్వరాన్ని) ధ్యానిస్తున్నానని భావం. అనగా ఆ ఉ మ్ కలిస్తే ఓం. ఇది యోగులచే ధ్యానింపబడి మోక్షాన్ని ఇస్తున్నది. ఇదే శివ స్వరూపం.
శివరాత్రికి సంబంధించిన పలు కథలు పురాణాల్లో ఉన్నాయి. అందులో ఒక దాని ప్రకారం బ్రహ్మాది దేవతలతో సృష్టి సమస్తం ప్రళయంలో లయమైంది. జగన్మాత కాత్యాయిని సమస్త సృష్టి బీజాలను ఒక మహాపద్మంలో పదిలపరచి, చేతితో పట్టుకుని పరమాత్మ ధ్యానంలో మునిగిపోయింది. ప్రళయాంతంలో తిరిగి పున:సృష్టి చేయాల్సిందిగా పరాశక్తి పరమ శివుణ్ణి ప్రార్థించింది. పరమాత్మ ప్రసన్నుడై ఆమె ముందు సాక్షాత్కరించాడు. పరాశక్తి ప్రసన్న వదనంతో ‘పరమ శివా! ఈ రోజు మాఘ కృష్ణ చతుర్దశి. ప్రకాశమానంగా అర్ధరాత్రి సాక్షాత్కరించిన ఈ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందుగాక! ఈ రోజంతా శివుని జపిస్తూ, ఉపవాసం ఉండి, అర్ధరాత్రి శివుడు సాక్షాత్కారం అయిన సమయం వరకూ జాగరణ చేసిన వారు ఇహపర సౌఖ్యాలు అనుభవిస్తారని అన్నది. పరమ శివుడు ‘తథాస్తు’ అన్నాడు.
మరొక కథ ఎక్కువగా ప్రచారంలో ఉన్నదే. దీని ప్ర కారం ఒక సారి బ్రహ్మ విష్ణ ువుల మధ్య ఎవరు అధికులమన్న వివాదం మొదలై యుద్ధం వరకూ వచ్చింది. బ్రహ్మ బ్రహ్మాస్త్రాన్ని, విష్ణ ువు నారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికి ఉద్యుక్తులయ్యారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఇద్ద్దరి మధ్య జ్వాలాస్తంభ రూపంలో నిలిచాడు. అది మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయం. ఈ పురాణ కథ అం దరికీ తెలిసిందే. అలా సాక్షాత్కరించిన అగ్నిలింగ స్వరూపమే అరుణాచలం. అదే పంచ భూత లింగాలలో ఒకటి. ఆ లింగం మహోగ్ర తేజాన్ని భరించలేక బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా, పార్థివ లింగంగా ఆవిర్భవించి ‘అరుణాచలేశ్వరునిగా’ పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు.
శ్రీవ్యాసభగవాన్ విరచితమైన శివపురాణంలో శివలింగావిర్భావం, స్వరూపం, శివనామ మహిమ, శివతత్త్వం, పూజా విధానం ఇత్యాదిగా ఎన్నో వివరణలు ఉన్నాయి. నిరాకార, నిరామయ, సృష్ట ్యన్ముఖ శివ త త్త్వమే లింగ రూపం. శివుడు నిరాకార (నిష్కల), సాకార (సకల) రూపంలోనూ దర్శనమిస్తాడు.
నిష్కలంగా లింగ రూపి – ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలు, పంచారామాలలో వెలసిన లింగాలు, ఇంకా దేశమంతటా స్వయంభువులుగా ఉన్నవి, ప్రతిష్ఠి ంచినవి, ఈ కోవలోనివి.
సకలంగా గంగాధర, చంద్రశేఖర, త్రిశూలధారి ఇత్యాది విగ్రహ రూపాలను చెప్పవచ్చును.
ఈశ్వరుడు అనేది శివునికి గల మరో పేరు. జగత్తును పాలించేవాడు, శాసించేవాడని అర్థం. అయితే ఐశ్వర్యం కలవాడు, ఇచ్చేవాడు అనే అర్థం జన సామాన్యానికి దగ్గరైంది. అందుకే ‘ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి’ అనే సామెత పుట్టింది. ఐశ్వర్యమంటే సిరిసంపదలు, ఆయురారోగ్యాలు. మోక్ష ప్రాప్తి కూడా ఐశ్వర్యమే. పరమ శివుని ప్రార్థిస్తే ఆయనిచ్చేది ఐశ్వర్యం స్వపర భోగ్యంగా భాసిల్లుతుంది.
ఈ జగత్త్తంతా శివ మయం. పంచ భూతాలు, సూర్యచంద్రులు ఇలా మనలను పెంచి పోషించేవన్నీ ఈశ్వరుని ఐశ్వర్యమే. ‘అన్నానాం పతయే నమ:’, పుష్టానాం పతయేనమ:’ అని ఈశ్వరుని వేదాలు కీర్తించాయి. రుద్ర నమక మంత్రాలు, సహస్ర నామాలు ఈ భావాన్ని మరింతగా చెప్పాయి. ఈశ్వరుడు సర్వ దేవతా స్వరూపుడు. అష్ట సిద్ధులూ, నవ నిధులూ ఈశ్వరుని చెంతనే ఉన్నాయి. అందుకే ఆయన ఐశ్వర్యేశ్వరుడు. ఈశ్వరుని విభూతులే లోకమంతా నిండి ఉన్నాయి. ‘విష్ణోశ్చ హృదయం శివ:’ అని ఆర్ష వాక్కు. సంపత్కారిణి అయిన లక్ష్మి కూడా విష్ణ ు హృదయమే. అలా ల క్ష్మికి కూడా లక్ష్మీ అష్టోత్తర నామాలలో ‘విభూతిం’, శివాం, శివకరీం అని. సహస్ర నామాలలో ‘అఘోర రుద్ర రూపిణీ, ‘శుద్ధ స్ఫటిక సన్నిభా’, ‘సదాశివా’ ఇత్యాది పరమైన నామాలున్నాయి. ఇవి శివ లక్ష్ముల అభేదాన్ని తెలియజేస్తాయి.
ఈశ్వరుడు దిగంబరుడై రుద్ర భూమిలో సంచరించినా, అన్నపూర్ణను భవతీ భిక్షాందేహి అని ప్రార్థించినా ఆయన యందు అష్టె ౖశ్వర్యాలు ఉన్నాయి. లక్ష్మి ఆదిగా దేవతలందరూ తమ తమ సంపదల శక్తిని ఈశ్వరుని వల్ల పొందారని పురాణాలు సవివరంగా చెప్పాయి.
మహాకవి కాళిదాసు కుమారసంభవంలో ఈశ్వరుని ఇలా వర్ణించాడు. ‘ఏమీ సంపద లేని వాడైనా సంపదలనిచ్చేవాడు, స్మశాన వాసియైనా త్రిలోక నాథుడు. భయంకర రూపం కలవాడైనా శివుడు మంగళకరుడుగా చెప్పబడుతున్నాడు. శివుని యదార్థ స్వరూపం అతని అర్ధాంగికి కూడా తెలియదేమో!
‘శివం సుఖం రాతీతి శివరాత్రి’ అని వ్యుత్పత్తి.
మాఘ కృష్ణ చతుర్దశి శివరాత్రి పర్వదినాన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి శివాలయంలో శివుని అభిషేకించి, అర్చిస్తే అభీష్ట సిద్ధులు కలుగుతాయి. రోజంతా ఉపవాసం ఉండి, శివనామ స్మరణతో గడిపి, రాత్రంతా జాగరణం చేసి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవాన్ని దర్శిస్తే ఈశ్వరుని అనుగ్రహం పొంది ఇహ పర సౌఖ్యాలు తప్పక పొందుతారు.
ఏ.సీతారామారావు