తాను శ్రీరాముడి దూతననే విషయాన్ని ధృవీకరించడానికి, సీతాదేవి కోరినట్లే శ్రీరాముడి గుణగణాలను వర్ణించాడు హనుమంతుడు. మొదట శ్రీరాముడి ఆత్మగుణాలను వర్ణించి, తర్వాత దేహగుణాలను వర్ణిస్తాడు. హనుమంతుడు రాముడు గురించి చాలా నిగూఢంగా చెప్పడంతో సీతకు విశ్వాసపాత్రుడై నాడు. ఇక అక్కడి నుంచి సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఎక్క డెక్కడ తిరిగి కిష్కింధకు చేరుకున్నదీ వివరించాడు. ”సీత కొరకై వెతుకుతున్న శ్రీరామలక్ష్మణులు మేముండే చోటు కు వచ్చారు. అన్న రాజ్యంలోంచి వెళ్లగొట్టబడి, ఋష్యమూకాద్రి మీద నివసిస్తున్న సుగ్రీవుడు, నార చీరెలు, చేతుల్లో బాణాలతో వస్తు న్న వారిని చూశాడు. వారెవరో తెలుసుకొని రమ్మని నన్ను పంపా డు. నా కంటికి వారు మహాత్ముల్లాగా కనపడినందున వినయంగా, చేతులు జోడించి, వారి దగ్గరకుపోయాను. నన్నాదరించి, గౌరవిం చిన వారిద్దరినీ తీసుకునివచ్చి, సుగ్రీవుడి ఎదుట నిలిపాను. కలిసిన రామ, సుగ్రీవులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు నమ్మారు. ఒకరి దు:ఖం ఇంకొకరికి చెప్పుకొని సమా ధానపర్చుకున్నారు. తన భార్యను అపహరించాలనుకున్న అన్న వాలి, సుగ్రీవుడిని వెళ్లగొట్టాడు. వాలి, సుగ్రీవుల కలహకారణం ఇదే. నీ ఎడబాటుతో దు:ఖిస్తున్న శ్రీరాముడి చరిత్రను లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. గతంలో రావణాసురుడు ఆకాశ మార్గాన నిన్ను ఎత్తుకొని వెళ్తున్నప్పుడు, నువ్వు, భూమి మీద పడేసిన ఆభర ణాలను సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపాడు. నీ జాడ మాత్రం చెప్పలేకపోయాం. నీ ఎడబాటుతో శ్రీరాముడు ఎల్ల ప్పుడు లోలోన కుములుతుంటే, అగ్నిని కలిగిన అగ్నిపర్వతం లాగా కనిపించాడు.”
”రావణుడిని, అతని కొడుకులను, స్నేహితులను, యుద్ధంలో చంపి, నీ భర్త, నిన్ను త్వరలోనే తీసుకెళ్తాడు. వాలిని చంపుతానని రాముడు, నిన్ను వెతికించి నీవార్త తెప్పిస్తానని సుగ్రీవుడు ప్రమా ణం చేసారు. సుగ్రీవుడితో కిష్కింధకు వెళ్ళి, వాలిని చంపి, సుగ్రీ వుడిని రాజుగా చేసాడు రాముడు. ఇలా వారిద్దరికీ స్నేహం కుదిరింది. నేను వారి దూతను, నిన్ను వెతుక్కుంటూ సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు రాజై, తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి, నిన్ను వెతికేందుకు వాన రులను పది దిక్కులకు పంపాడు. నిన్ను మేము వెతుకుతూ కన పడక బాధపడ్తుంటే, జటాయువు సోదరుడు సంపాతి కనబడి నీ జాడ చెప్పి, నువ్వు లంకలో వున్నావని అన్నాడు. ఆయన మాట ప్రకారం, నూరామడల సముద్రాన్ని దాటి, రావణుడి నగరం లంక ప్రవేశించి, రాత్రి సమయంలో రావణుడినీ, నిన్నూ చూశాను. భయం లేకుండా, ధైర్యంగా నాతో మాట్లాడు. నన్ను నమ్ము. రామ కార్యార్థం వచ్చాను. వానర రాజు మంత్రిని, వాయుదేవుడి కొడుకు ను, సూర్య వంశం రాజు రామచంద్రమూర్తి దూతను.”
ఇంతవరకు తాను రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన హనుమంతుడు, తన జన్మ వృత్తాంతాన్ని కూడా సీతాదేవితో చెప్పాడు. ”మాల్యవంతమనే పెద్ద పర్వతముంది. అక్కడ నాతండ్రి కేసరి అనే వానర రాజున్నాడు. దేవ ఋషుల ఆజ్ఞానుసారం, గోకర్ణ మనే పర్వతానికి వెళ్ళి, శంభసాధనుడనే దైత్యుడిని చంపాడొకసారి. ఇట్లా మాతండ్రి కాలం నుండే, రాక్షసులకు, మాకూ విరోధముంది. ఆయన భార్యకు, వాయుదేవుడికీ, నేను జన్మించాను. నా స్వశక్తితో, స్వకార్యంతో, హనుమంతుడన్న పేరు తెచ్చుకున్నాను. నీ నమ్మకం కొరకు నీ భర్త గుణగణాలన్నీ చెప్పాను.”
సీతమ్మ హనుమంతుడిని తన జన్మ వృత్తాంతం చెప్పమని అడగలేదు. రాముడి రూప విశేషాలను మాత్రమే అడిగింది. దాని తోపాటు తన జన్మ వృత్తాంతాన్ని హనుమంతుడు చెప్పాడు. అడగ నిదే చెప్పడం దేనికి? అని అనిపించవచ్చు. కానీ #హనుమంతుడు ఆంజనేయుడు కదా! అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యర్థం గా ఏదీ మాట్లాడడు. అసలు కారణమేమిటంటే, తాను రామదూత ను అనీ, సామాన్యమైన సగటువాడిని కాదనీ, సమర్ధుడననీ సీతమ్మ ను నమ్మించడం. నమ్మదగిన వాడినీ, విశ్వాసపాత్రుడినీ అని సీత మ్మకు రూఢి చేయాలని భావించి తన వైనం చెప్పాడు. ఇన్ని విధాలుగా చెప్పిన తర్వాత హనుమంతుడు, రామచంద్రమూర్తి దూతన్న విషయం నమ్మింది సీతాదేవి. హనుమంతుడు శ్రీ రాముడి పేరు చెక్కిన ఉంగరాన్ని చూపిస్తాడు. దానిని రామ చంద్రు డు, సీతకు ఇమ్మని చెప్పాడనీ, అది చూసిన ఆమెకు తన మీద నమ్మకం కుదురుతుందన్నాడనీ చెబుతాడు హనుమంతుడు. ఆ ఉంగరాన్ని చూసిన సీతకు మనోవ్యాకులత కూడా తీరుతుందని రాముడు చెప్పినట్లు తెలియచేస్తాడు. హనుమంతుడిచ్చిన ఉంగ రాన్ని సంతోషంగా తీసుకుంటుంది సీత. ఇదొక అద్భుతమైన ఉంగ రం. ఇందులో మూడు మణులుంటాయి. అందులో ఒక మణిలో రాజైనవానికి పితృపితామహంగా వచ్చే సూర్యవంశపు శక్తిని ఆవహింప చేస్తారట. ఇది శ్రీరాముడి రాజ్యాధికార ముద్ర. దానిపై రాము డి పేరు కూడా చెక్కబడి ఉందని పెద్దలంటారు. అలాంటి రాజ ముద్రను ఇవ్వడమంటే రాజ్యాన్నే ఇచ్చి వేయడమని అర్థంకద! సీతమ్మ కంటే రాజ్యం గొప్పది కాబోదు అని రాముడి భావన అనేది స్పష్టమవుతున్నది.
తన భర్త శ్రీహస్తాన్ని అలరించే ఆ ఉంగరాన్ని చూసిన సీతకు తన భర్తే ఎదురుగా వచ్చినంత సంతోషం కలిగింది. ఆ ఉంగరాన్ని తాకుతూ అనుకుంటుంది సీత: ”పాణిగ్రహ సమయంలో మొదటి సారి తన చేతిని రామచంద్రమూర్తి పట్టుకున్నప్పుడు, తనను తగి లిన ప్రధమాభరణం ఇదేకదా! తనకు ప్రణయ కోపం వస్తే, శాం తింప చేయటానికి, భర్త తన గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతుంటే, తాకేదీ ఉంగరమే కదా! ఇరువురికీ మాటలు లేనప్పుడు, మాట్లాడే నెపంతో, నేల మీద ఉంగరం పడేస్తే, తీసు కొమ్మని మాట్లాడే అవ కాశం ఇచ్చింది ఈ ఉం గరమే కదా! అరణ్యా లకు వెళుతున్నప్పు డు, సర్వాభరణాలూ తీసేసి నా, తనతో పాటు వెంట తెచ్చుకున్నదీ ఈ ఉంగరమే కదా!” ఇలా అనేక విధాలుగా ఆలో చిస్తున్న సీతకు, సాక్షా త్తూ శ్రీరామచంద్రుడే ఎదురుగా వచ్చి నిల్చు న్నట్లు, భావనాతిశయ బలంవల్ల ఆయన ఆకారం స్పష్టంగా కనిపిం చింది. సీతాదేవి తన పతి క్షేమం తెలిపిన ఆంజనేయుడిని, అభినం దన పురస్సరంగా స్తోత్రం చేసింది. హనుమంతుడిని ప్రశంసించి శ్రీరామాదుల కుశలం అడిగింది. రామచంద్రమూర్తి తనను తప్ప మరేదీ తల్చుకోవడం లేదని ఆంజనేయుడు చెప్పడంతో, సీతకు అమృతం తాగినంత సంతోషం కలిగింది. అయితే ఆయన అమితం గా దు:ఖ పడుతున్నాడని కూడా చెప్పినందువల్ల విషం తాగినట్లని పించింది. ”విషం కలిపిన అమృతాన్నిచ్చినట్లున్నాయి నీ మాట లు” అంటుం ది సీతాదేవి హనుమంతుడితో.
”ఓ మారుతీ! రామచంద్రమూర్తి సూర్య వంశానికే అలంకార ప్రాయమైనవాడే! ఆయన ఈ వ్యధా సముద్రంలో మునగకుండా, తీరానికి ఎప్పుడు చేరుతాడయ్యా? ఎప్పుడు రావణుడిని చంపు తాడో? ఎప్పుడొస్తాడయ్యా రామచంద్రుడు? ఎప్పుడు చీలుస్తాడ య్యా రాక్షస మూకను? ఎప్పుడు నన్నాయన చూస్తాడు? ఆంజనే యా! రావణుడు నాకొక్క సంవత్సరం గడువిచ్చాడు. అది ఇంక కొన్ని రోజులే వుంది. అది ముగిసే వరకే నేను బ్రతికుంటాను. కాబట్టి రామచంద్రమూర్తిని ఈ లోపలే వచ్చేటట్లు తొందరపెట్టు. ఆ తర్వాత వచ్చినా ఫలితం వుండదు” ఇలా కళ్లనిండా నీళ్లు వుంచుకుని మాట్లాడుతున్న సీతాదేవిని చూసి హనుమంతుడు శోకించవద్దని ప్రార్ధిస్తూ, ఇలా అన్నాడు. ”నామాటలు విన్న శ్రీరాముడు సేనతో, వెంటనే ఇక్కడకు వస్తా డు. అంతవరకు దు:ఖమెట్లా ఆపుకోవాలంటే, దానికో మార్గముం ది. నా వీపుపైనెక్కు, రామచంద్రమూర్తి వున్నచోటుకి నిన్ను తీసు కునిపోతాను. నేను దూతను. నీ శీలానికి ఏ హానీలేదు. నిన్ను శ్రీరాము డి దగ్గరకు ఇప్పుడే చేరుస్తాను. శ్రీరాముడు తమ్ముడితో కూడి రావ ణాదులను చంపే ప్రయత్నాన్ని నీ కళ్లతో నువ్వే చూడగలవు. నా వీపు పైకెక్కు. నామాట నమ్ము. ఆకాశంలో సూర్యచంద్రులతో ముచ్చ టిస్తూ, సముద్రాన్ని, ఆకాశాన్ని అవలీలగా నా వీపు మీద కూర్చొని దాటు. రాముడివద్దకు పోయేంతవరకూ నిన్ను దించను” అన్న ఆంజనేయుడి మాటలకు, భక్తికి, సంతోషించిన సీత-
”ఆంజనేయా! నేను సొమ్ముల మూటవేసిన స్థలం నాకు గుర్తుంది. అక్కడికి, ఇక్కడికి చాలా దూరం. ఇంతదూరం నన్ను ఎట్లా మోసుకుని పోతావు? నీ మాటలు వినడానికే వింతగా వున్నా యి. ఇంతవరకు నీవు నిజంగా కోతివో, కాదో అన్న అనుమానం, సందేహం వుండేవి. ఇప్పుడు నీ బుద్ధిని పట్టి చూస్తే నీవు నిజంగా కోతివేనని, నిశ్చయించుకుంటున్నాను. ఈడ్చి కొలిస్తే నువ్వు జానెడు కూడా లేవు. నీవు నన్నెట్లా మోసుకుపోతావు” అంది. ఆమె మాటలకు హనుమంతుడు విచారపడ్డాడు. వెంటనే మేరుపర్వతంతో సమానమైన ఆకారంతో, ఎర్రటి ముఖంతో, వజ్రా యుధంలాంటి గోళ్లతో, కోరలతో, సీతాదేవి ముందర నిలబడ్డాడు. ”మాతా! ఈ లంకను, కొండలతో, వనాలతో, బురుజులతో, ప్రాకారాలతో, తోరణాలతో, రావణాసురుడితో సహా పెల్లగించి, అత్యంత వేగంగా తీసుకునిపోయే శక్తి నాకుంది. నేను చిన్న వాడి నన్న అభిప్రాయం మానుకో. ఆలస్యం చేయకుండా రాముడి దగ్గర కు తీసుకువెళతాను రా!” అంటాడు. హనుమంతుడలా అనగానే, ఆశ్చర్యం, భయం కలిగించే అత డి ఆకారాన్ని చూసిిన సీతాదేవి ”కపీశ్వరా! నీ బల గర్వం, వాయు వేగం, కార్చిచ్చులాంటి నీ శరీరం, ఎలాంటిదో తెలుసుకున్నాను. నీవు సామాన్య కోతివి కావు. ఇంత గొప్పవాడివి కాకపోతే నువ్వెట్లా సముద్రాన్ని దాటి, ర#హస్యంగా లంక ప్రవేశించి, నన్ను వెతకగలిగే సమర్ధుడవవుతావు? ఇంతపని మామూలు వాళ్లకు సాధ్యమవు తుందా? నన్ను రామచంద్రమూర్తి దగ్గరకు తీసుకుపోగలవని నమ్ముతున్నాను. నీపై నాకెంత విశ్వాసమున్నా నీ వెంట రాకూడదు. నీ వెంట రాకపోటానికి, మరో ముఖ్య కారణముంది. నా భర్తపై నా కున్న భక్తి, నా భర్తను తప్ప మరెవ్వరినీ తాకను. అలా చేయటానికి నా మనస్సు ఒప్పుకోదు. ఈ వాస్తవాన్ని ముందే చెప్పితే, నీవేమను కుంటావోనని, చివరకు చెప్తున్నానుసస. ”రామచంద్రమూర్తి వచ్చేవరకు ఆగలేను. రాలేను. రాముడు, రావణుడిని యుద్ధంలో, ఈ లంకలోనే చంపి నన్ను తీసుకోపోవాలి. అదే ఆయన యోగ్యతకు తగిన పని. ఆయన నన్ను రక్షించలేడన్న సందేహం వుంటే కదా, నేను నీవెంట రావాల్సింది. శ్రీరాముడి యో గ్యతకు తగనిదీ, ఆయనకు కష్టసాధ్యమైనదీ, సందిగ్ధమైంది, నేను కోరడం లేదు. ఎలాంటి విరోధులనైనా చంపే శక్తి, దండించే పరా క్రమం, ఆయన శక్తి నాకు తెల్సు. ఆ సమర్ధుడి ఎదుట యుద్ధభూమి లో నిల్చే శక్తి ఇంద్రాది దేవతలకు కానీ, దేవదానవ రాక్షస సమూహా లకు కానీ లేదు. నీవు త్వరగా లక్ష్మణ, సుగ్రీవులతో కూడిన రామ చంద్రమూర్తినే లంకకు తీసుకొచ్చి, రావణుడిని చంపి, నన్ను తీసు కుపొమ్మని ఆయనతో చెప్పు. ఆయన కొరకు తీవ్ర దు:ఖంతో వున్న నన్ను కృతార్ధురాలిని చేయి. నీకు పుణ్యముంటుంది” అంది,
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
– వనం జ్వాలా నరసింహారావు
8008137012