Friday, November 22, 2024

పాపపు మాటలు పుట్టె… లక్ష్మణా!

తే.గీ|| కీడు గాంచి మనలనాడెడు వారల
నోళులుడుపఁగా మనోముదంబు
నొందుఁ గాన దీననొండెగ్గు లేదని
తఱిమియడుగుటయునువెఱపుఁ బాసి.
(నిర్వచనోత్తర రామాయణము, అష్టమాశ్వాసం, 103)
‘లేని చెడును ఊహంచి, చేయని తప్పులను ఆపాదించి నలుగురిలో మనలను అప్ర తిష్ట పాలుజేసే వాళ్ళ నోళ్ళను మూయించడంలో మనకు కూడా మనస్సు ఆనందపడడం జరుగుతుంది కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. ఇది జరగవలసిన పనే కాని వేరుకాదు’ అని శ్రీరాముడు బలవంతం చేసి అడుగగా, సంకోచం పోయినవాడై- అన్నది ఈ పద్యంలో భావం. దీనికి ముందు విషయం ఏమిటనేది విచారిస్తే…
భద్రుడనేవాడు శ్రీరాముని నర్మసచివులలో ఒకడు. ఒకనాడు రాజ్యంలో తన పాలనను గురించి పౌరులు ఏమిఅనుకుంటున్నారో తెలుసుకుని వచ్చినది చెప్పమని శ్రీరాముడు ఇతడిని ఏకాంతంలో అడుగుతాడు. ‘ఇందులో వేరే చెప్పడానికేముంది? విన్నంతలో అంతా చాలా గొప్పగా అనుకుంటున్నారు స్వామీ!’ అని చెబుతాడు భద్రుడు. అయినా శ్రీరాముడికి అతడి మాటలలో ఏదో దాస్తున్న భావం కలుగగా…
తే.గీ|| తొలుత రాజ్యంబుసేయంగదొడఁగి మనము
వివిధ వర్ణాశ్రమంబుల వృత్త మరసి
యలవరించుచోఁగొందఱకహతమగుటఁ
గొన్ని మాటలు పుట్టక యున్నెయనిన. (నిర్వచనోత్తర రామాయణము, అష్టమాశ్వాసం, 97)
‘కొత్తగా రాజ్యాధికారం చేపట్టి పరిపాలించడం మొదలుపెట్టిన తొలిరోజులలో సహ జంగానే కొంతమందికి అందులో కొన్ని విషయాలు నచ్చకపోవడం అనేది జరుగుతుం టుంది. అలాంటి విమర్శకు సంబంధించి మాటలు ఏమీ చెవిన పడలేదా?’ అని అడుగు తాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆ మాటలకు ‘అలాంటి అనుమానం మీకెందుకు కలిగింది స్వామీ!’ అంటాడు భద్రుడు. అప్పటికీ వినడు శ్రీరాముడు.
చం|| … మదీయ సంస్తుతులు నన్నియుఁజెప్పితి కీడుమాటసె
ప్పనగునొకాదొ నాక ననుబాపముసుట్టకయుండనేమి గ
ల్గినఁగలయంతవట్టునునకల్బిషమానస చెప్పు మేర్పడన్‌.
(నిర్వచనోత్తర రామాయణము, అష్టమాశ్వాసం, 99 పద్యభాగం)
‘పొగడ్తలన్నీ చెప్పావు. విమర్శలు చెప్పవచ్చో లేదో అని శంకిస్తున్నట్లుగా ఉంది నీ వైఖరి చూస్తూవుంటే. అవి దాచిన పాపం నీకు అంటకుండా, నీవు ఏమి వింటే అది విన్నది విన్నట్లుగానే నాకు చెప్పు’ అని అంటాడు శ్రీరాముడు. ఈ సందర్భంగా ‘కలయంతవట్టు ను’ అనే ఒక అందమైన మాటను మనముందుంచాడు తిక్కన. ‘ఉన్నది ఉన్నట్లుగా’ అని ఇప్పటి మాటల్లో ఆ పదబంధానికి అర్ధం. అప్పటికీ భద్రుడు బయటపడడు. అయితే శ్రీ రాముడు కూడా ‘ఏమీ లేదు కాబోలు!’ అని సమాధానపడి అక్కడితో ఆగిపోడు.
కం|| లోకుల మాటలు సెప్పిన,
నా కెగ్గగునే ప్రియం బొనర్పుహతుఁడ వై
నీకింతవెఱవ నేటికి,
నేకాంతంబయిన చోట నే నడుగంగన్‌. (నిర్వచనోత్తర రామాయణము, అష్టమాశ్వాసం)
”ఎవరో పరాయివాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పినంత మాత్రాన నాకు ఏదో అయి పోతుందని ఎందుకు అనుకుంటావు. నాకు ఇష్టమైనవాడవు, నా హతం కోరేవాడవైన ను వ్వు ఇప్పుడెందుకు భయపడుతున్నావు? మనం ఇరువురమే ఉన్న ఈఏకాంతంలోనే కదా నేను నిన్ను అడుగుతున్నాను” అని భద్రుడికి భరోసా కల్పిస్తూ, అతడికి మరింతగా తన కోరికలోని ఆంతర్యాన్ని తెలియపరిచేవిధంగా,ఈ వ్యాసం మొదలులో చెప్పిన పద్యంలో ని మాటలంటాడు శ్రీరాముడు.”నిజానిజాలను తెలుసుకోకుండా, అనవసరంగా మనల ను అప్రతిష్ట పాలుచేసే వారి నోళ్ళను మూయించడంలో ఆనందం ఉంటుంది కదా! ఆ ఆనందం నేను పొందడం కోసమైనా, అదేమిటో చెప్పు భద్రా!” అన్న శ్రీరాముని మాటల కు ముందు, ఇరువురి నడుమ ఇంత సంభాషణ నడిచింది. ప్రభువు ఇంతగా అడిగిన మీదట, ఇక చెప్పక తప్పదన్నట్లుగా ‘కలయంతవట్టునే’ భద్రుడు చెప్పిన సంగతి విని శ్రీ రాముడు చలించిపోతాడు. తన బాధనంతా తమ్ముడైన లక్ష్మణునితో బేలగా వెళ్ళబోసు కోవడం మనసును కలచివేసే సన్నివేశంగా వర్ణించాడు తిక్కన ఈ క్రింది పద్యంలో –
ఉ|| రావణునింటనుండఁగధరాసుత నే మరలంగఁదెచ్చి సం
భావన సేఁత కష్టమని పల్కిరి చూచితె లక్ష్మణా మహా
దేవుఁడు బ్రహ్మయున్‌ మునులు దేవగణంబులు మెచ్చ నయ్యెడం
బావకుఁడిచ్చె నాకు సతిఁబాపపు మాటలు వుట్టెనియ్యెడన్‌.
(నిర్వచనోత్తర రామాయణం, అష్టమాశ్వాసం, 116)
”రావణుడి ఇంట్లో అన్నినాళ్ళున్న భూపుత్రి సీతను నేను మరలా నాతో తెచ్చుకుని ప్రేమగా చూసుకోవడం వారికి కష్టం కలిగించిందని అంటున్నారు, ఎంత అన్యాయమో చూశావా లక్ష్మణా!” అంటున్న శ్రీరాముని మాటలలో ఎంత దైన్యం వినబడు తోందో వేరే చెప్పనక్కర లేదు కదా! ”బ్రహ్మ, విష్ణు, మహశ్వరులతో పాటుగా సకల దేవ తలు, మునిగణం సాక్షిగా అగ్నిదేవుడు నా చేతికిచ్చిన ఆమెను గురించి పాపపు మాటలు పుడుతున్నాయి ఇక్కడ (నేను ఏం చెయ్యను చెప్పు)” అని మనసు విరిగిన నిర్వేదంలో బాధ పడుతుండడం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది ఆ తరువాతి మాటలలో. రావణ సంహారం తరువాత శ్రీరాముడు మాయామానుష వేషమైన నరత్వాన్ని పక్కకు పెట్టి నారాయణత్వంలోనే ఎక్కువగా ఉన్నారని చెబుతారు. అయినప్పటికీ, మంచిచెడు విచ క్షణను కోల్పోయిన మూర్ఖుడొకడు అనాలోచితంగా మోపిన అపవాదు ఆయనలోని నారాయణత్వాన్ని సైతం ఎంతగా బాధించిందో పై పద్యంలోని తిక్కన మాటలు స్పష్టం చేస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement