Thursday, December 26, 2024

…మౌన వ్యాఖ్యానం!

ఉన్నది ఒకటే.. అదే రెండుగా విభజితమైంది. రెండు అనంతంగా విస్తరించాయి. ఆ విస్తరణయే ”సృష్టి”. దానినే జగత్తుగా చెపుతూ.. జగత్తు అంతా… అనంతకోటి సూర్యులతోకూడిన బ్రహ్మాండముల సముదాయంగా చెప్పారు. ఆ అనంతత్త్వం తిరిగి ఏకత్వం కావడమే ”లయం”. అందుకే నిరంతర గమనశీల మైనది జగత్తని ఉపనిషత్తులు చెపుతున్నాయి. జగత్తు అంటే.. ”జాయతే గచ్ఛతీతి జగత్‌” అని పెద్దలు నిర్వచించారు. సాధారణంగా చెప్పుకుంటే ”రాకపోకలకు” ఆవాసమైనది జగత్తు అనవచ్చు.
జగత్తులో దేనికి ”ఆకృతి” ఉంటుందో అది లయమౌతుంది. సృష్టి పరిణామక్రమంలో జఢత్వం నుండి పశుత్వ స్థితికి, పశుత్వ స్థితినుండి మానవ స్థితికి, మానవ స్థితినుండి దైవత్వానికి జాత్యంతరీకరణ చెందడం వల్ల ఏకత్వాన్ని సాధిస్తాము. ఏకత్వాన్ని భగవంతుడుగా చెప్పుకుంటే.. మనిషి ప్రయాణం భగవంతుని నుండి ఆవిష్కృతమై తిరిగి భగవంతునిలో లయం కావడంతో ముగియాలి. ఆ పరిణామంలో ”మహత్తు”.. అంటే మాయ, ”అహంకారం”.. అంటే ”నేను” అనే భావనలు అడ్డుతెరలుగా అడ్డుకుంటాయి. వాటిని అధిగమించి ”స్వస్థానాన్ని” చేరే ప్రయత్నమే సాధనగా పెద్దలు చెపుతారు. ఆ మార్గంలో సాగే వారిని సాధకులుగా చెపుతారు.
ఆ క్రమంలో మనిషి జీవితంలో ”మౌనం” ప్రముఖ పాత్రను పోషిస్తుంది. నిజానికి దానినొక ధ్యానవేదిక అనాలి. అత్యంత వేగంగా పరిగెత్తే ”రాకెట్‌” లాంటి చంచలమైన మనస్సును ”జ్ఞాన”మనే మార్గంలో భగవంతుడనే గమ్యం వైపు త్రిప్పాలి. అయితే మనస్సనే రాకెట్‌ గమించాలి అంటే ”ఇంధనం” కావాలి. ఆ ఇంధనాన్నే ”ధ్యానము” అంటారు. ఆ ఇంధన సహాయంతో మనసు… జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యాలి. నిజానికి మౌనం వహించిన మనస్సు కంటే సాధించాల్సిన తాత్త్వికత మరేదీలేదు. అయితే మనిషిగా ఆవిర్భవించాక.. నేను మౌనంగానే తపోనిష్ఠలో ఉంటాను.. జగత్తుతో పనిలేదు అనుకుంటే.. ప్రయోజనం సిద్ధించడం కష్టసాధ్యం. సాధకుడు కర్మమార్గంలో భౌతిక జీవనంలో అభ్యుద్యాన్ని సాధిస్తూ.. జ్ఞానాన్ని ఆశ్రయించి ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించాలని వేదవాక్కు.
సాధకుని ఒక పక్షిగా భావిస్తే.. పక్షికి ఉండే రెండు ఱక్కలలో ఒకటి ”జ్ఞానం” కాగా రెండవది ”కర్మ”.. జ్ఞానాన్ని ఆదరించాలి, ఆర్జించాలి.. కర్మను ఆచరించాలి. అప్పుడే అది మోక్షమార్గంలో ఎగిరిపోనిస్తుంది. అయితే జ్ఞానార్జనలో ముఖ్య భూమికను పోషించేది ధ్యానం. ధ్యానం అంటే ”నిశ్శబ్దం”. నిశ్శబ్దం అంటేనే భౌతిక ఆంతరంగిక మౌన సాధన. అదే ఆధ్యాత్మిక పరిణతిలో వినదగిన శబ్దాలను వినిపిస్తుంది.. అవసరమైన సూచనలను సూచిస్తుంది. జ్ఞానమనే జ్యోతి వెలగాలి అంటే ధ్యానమనే తైలము కావలసిందే. ఆ ధ్యానమే యోగాన్ని అనుగ్ర#హస్తుంది. యోగమే పొందదగినది… అదే భగవంతుని అనుగ్రహం.
నిజానికి చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా వ్యక్తి సారం మౌనంలో వ్యక్తమౌతుంది. తెలియని మార్గంలో ప్రయాణించే సమయంలో తెలిసిన వ్యక్తుల మార్గదర్శన ఉపకరిస్తుంది. అలా మార్గదర్శన చేసే వారినే గురువులుగానూ, మార్గదర్శన పొందేవారిని శిష్యులుగానూ చెప్పారు. మౌనవ్యాఖ్యానమే గురుశిష్యుల మధ్య జ్ఞాన ప్రవాహానికి దారి చూపుతుంది. ”గురో: మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయ:” అన్నారు కదా. అలాంటి ఉత్తమ తాత్త్విక చింతనను అందించిన ఋషులకు నమస్కరిస్తూ..

  • పాలకుర్తి రామమూర్తి
Advertisement

తాజా వార్తలు

Advertisement