Friday, October 18, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

‘యద్విశ్రాణనతాచ్ఛీల్యం ఔదార్యం తన్నిగద్యతే’ అంటుంది అలంకారశాస్త్రము. అన్ని శాస్త్రాలు ఔదార్యమునకు ఈ అర్థమునే బోధిస్తున్నాయి. విశ్రాణన అనగా అర్పించుట, పంచుట, అందించుట. శ్రాణనము అనగా పంచుట. తనది అనుకున్నది పదిమందికి పంచుట. ఇది విశ్రాణన అనగా విశేషముగా పంచుట. ఇచట విశేషము రెండు విధములు. తనను తనకు కూడా చూడకుండా ఉన్నదంతా అందించుట, దానము చేయుట, అర్పణము చేయుట పంచుట. ఇది ఒకటి.
ఇక రెండవది అడిగినవారికి అందరికీ ఇచ్చుచున్నా వారి అవసరమెంత అని కాక వారికి యోగ్యత ఎంత అని చూచి యోగ్యతానుగుణముగా అందించుట. పసిపిల్లవాడు కత్తి అడిగితే తల్లి ఇస్తుందా? జబ్బొచ్చినవానికి ఆ పిల్లవాడు వద్దంటున్నా తల్లి వైద్యుని ద్వారా మందులను ఇప్పిస్తుంది. నేనడిగింది ఈయలేదు అని చాలామంది ఆగ్రహిస్తారు. వారు కోరినది వారికి ప్రమోదాన్నిస్తుందా, ప్రమాదాన్నిస్తుందా ఆలోచించి తెలిసి ఈయాలి. అలా అపుడు కొంత బాధ కలిగినా తరువాత ఆనందాన్నిచ్చేదాన్ని ఇవ్వడమే విశ్రాణనము. అపుడు సంతోషాన్ని కలిగించి తరువాత అంతులేని దుఃఖాన్ని కలిగించే దాన్ని ఇచ్చేవాడు దాత కాదు. అలా కోరినవాడు వివేకి కాడు. ఎవరిని ప్రేమిస్తున్నారో వారికి హితమును కలిగించాలి. హితమునకు భంగము కలుగని ప్రియమును కలిగించాలి. మనం ఈనాటి సమాజాన్ని చూస్తున్నాము. 7వ తరగతి, 8వ తరగతి చదువుచున్న పిల్లలకు తల్లిదండ్రులు తమ స్టేటస్‌కు తగ్గట్టుండాలి అని వేలకు వేలు పాకెట్‌ మనీ ఇస్తున్నారు. వారు ఆ డబ్బుతో తాగి తందనాలాడుతున్నారు. కొంతకాలం ఇచ్చి మధ్యలో ఆపేస్తే వారు దొంగలు, హంతకులౌతున్నారు. అంత చిన్నవయసునుండి త్రాగుడు, దొంగతనాలు, శ్రుతి మించితే హత్యలు ఇవన్నీ అలవాటు చేయటానికి కారణమైన వేలకు వేలు ఈయటం విశ్రాణనము కాదు. 7వ తరగతివాడు పరీక్షలు వ్రాయకుండా ప్రేమలేఖలు వ్రాస్తున్నాడు. ఇవన్నీ తల్లిదండ్రులే పరోక్షంగా, ప్రత్యక్షంగా నేర్పుతున్నారు. స్కూలుకు వెళ్ళే పిల్లవానికి టిఫిన్‌ బాక్స్‌, పుస్తకాల బ్యాగు ఈయాలి కాని క్యాష్‌బ్యాగ్‌ కాదు. దాని ఫలితం ఏమౌతున్నదో నేటి సమాజమే చెపుతున్నది. అది ప్రేమ కాదు, కానుక కాదు, దానము కాదు, అర్పణము కాదు. అసలు విషయానికొస్తే ఔదార్యము అసలే కాదు. నిజమైన ఔదార్యము కలవాడు భగవంతుడే. బుద్ధిమంతులకు కానుకలను ఇచ్చుట ఎంత ఔదార్యమో, తప్పు చేసినవానికి శిక్షను ఇచ్చుట కూడా ఔదార్యమంటాడు. తననుండి పొందినదానితో అలా పొందినవాడిని బాగుచేయగలిగేది ఔదార్యము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement