తనకు స్వార్థము పడగలు విప్పి బుసలు కొడుతుంటే దాన్ని సాధించుకోవటానికి ఇటువంటి చర్యలు చేస్తాము. స్వార్థము పెరుగటానికి, ఎదుటివారిని హింసించే ప్రవృత్తి కలగటానికి కారణము మనము తీసుకొనే ఆహారమే. ఇచట ఆహారము అనగా కావలసిన ఇంద్రియములకు కావలసినదానిని అందించుట. కన్నుకు సౌందర్యాన్ని అందించుట ఆహారమే, చెవులకు సంగీతాన్ని నాసికకు గంధాన్ని అందించుట ఆహారమే. త్వగింద్రియమునకు స్పర్శ ఆహారము, నాలుకకు రుచి ఆహారము. మనసునకు అనుకొన్నదానిని నెరవేర్చుట ఆహారము. ఇవన్నీ ధర్మబద్ధము కావాలంటే మనసును వశములో పెట్టుకోవాలి. అంటే మన మనసు తయారయ్యేది మనము చేసే భోజనము వలననే. భగవంతుని ఆజ్ఞ ప్రకారము శాస్త్రము బోధించిన ఆహారమును శాస్త్రము బోధించినరీతిలో భుజించిననాడు ధర్మప్రవృత్తి జరుగుతుంది. అంతా పుణ్యమే మరి.
ఇట్లు మనము సహజముగా అనుకొను రీతిలో తాటక, మందర, కైక, శూర్పణఖ రామకార్యము కొరకు అవతరించినారు. అందుకే వ్యాసభగవానుడు ఒక మాట ఉపదేశిస్తారు. ‘ధర్మం సంచరతో లోకే తిర్యం చోపి సహాయతాం, అపంధానంతు గచ్ఛంతం సోదరోపి విముంచతి’ అని.అనగా ధర్మమార్గమును అనుసరించువారికి పశుపక్షిజాతి కూడా సహకరించును. రామునికి వానరులు కూడా సాయపడ్డారు. జటాయువు, కబంధుడు, గరుడుడు సహాయపడ్డారు. చెడుదారిలో నడుచువానికి తోడబుట్టినవాడు కూడా విడిచిపెట్తాడు. రావణుని విభీషణుడు, వాలిని సుగ్రీవుడు విడిచారు కదా. తాను చేసిన అధర్మమే తనవారికి నచ్చక వారి శత్రువులను ఆశ్రయించి, రహస్యములు చెప్పి వధింపచేస్తారు. అందుకే ఎవరో హాని చేయరు. మనము ఆచరించిన పాపమే అనగా అధర్మమే మనకే శిక్ష వేస్తుంది. మనము చేసిన పుణ్యమే అంటే ధర్మమే మనను కాపాడుతుంది. విభీషణుని, సుగ్రీవుని కాపాడి రాజులను చేసింది. ధర్మము భగవానుని ఆజ్ఞ. దాన్ని పాటించుట పుణ్యము. ఉల్లంఘించుట పాపము. ఇది రామాయణము చక్కగా నిరూపించినది.
(సమాప్తం)