అట్లే అరణ్యకాండలో పంచవటిలో ఉన్న రాముని వద్దకు ‘రాక్షసీ కాచిదా జగామ యదృచ్ఛయా’ అంటాడు వాల్మీకి. శూర్పణఖ అను రాక్షసి దైవసంకల్పముతో పంచవటిని రామాశ్రమమునకు వచ్చినది. అపుడు రాకుంటే 13 యేండ్లు గడిపిన రాముడు ఆ పర్ణశాలలోనే ఇంకొక యేడు గడిప అయోధ్యకు వెళ్ళి పట్టాభషేకం చేసుకుంటాడు. అపుడు అరణ్యకాండతోనే రామాయణం ముగుస్తుంది. ఈ పనిని ఇతరులెవ్వరూ చేయలేరు. ఒక్క భగవానుడు తప్ప. అందుకే దైవసంకల్పముతో శూర్పణఖ అచటకు వచ్చినది అన్నారు వాల్మీకి. పదమును ఇంతటి అర్థవంతముగా ప్రయోగిస్తారు ఋషులు. మన వలె ఇంకా చెప్పాలంటే ఇప్పటి కాలములోని మానవులవలె అనాలోచితముగా ఆవేశముగా మాటను తూలగూడదు అంటారు ఋషులు. అనవసరముగా మాట్లాడటం కూడా పాపమే. అనకూడని మాటను అనటం కూడా పాపమే. మాటలతో ఎదుటివారి మనసును హింసించుట పాపము కదా. మాటలచే ఎదుటివారి మనసును ఆనందింపచేయుట పుణ్యము. వాక్కుతో దూషించుట, కొండెములు చెప్పుట అకార్యములయందు అనగా చేయకూడని వాటియందు ఎదుటివారిని ప్రేరేపించుట, ఎదుటివారు పరుషముగా, కఠినముగా, అపహాస్యముగా మాటలాడుతుంటే అభినందించుట ఇవన్నీ పాపకార్యములే. పరులను ఏ రూపములో బాధించిననూ పాపమే. ఏ రూపములో సంతోషింపచేసిననూ పుణ్యమే.
(సశేషం)