అయోధ్యలో రామచంద్రుని పట్టాభిషేకము నిశ్చయించబడినది. దశరథ మహారాజు స్వయముగా ఆజ్ఞాపించాడు. వసష్ఠ మహర్షి ఆమోదించారు. రాజులకు, రారాజులకు ఆహ్వానము వెళ్ళినది. అన్ని యేర్పాట్లు చకచకా జరుగుచున్నవి. ఇపుడు దీనిని మానవమాత్రులు ఆపలేరు. అందుకే మందరను ప్రవేశపెట్టారు. మందర పైన అంతఃపురములో ఉంటుంది. కైక అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటుంది. అంతఃపురములో కైక వద్ద ఉన్న మందర అనుకోకుండా ఆ భవనపు బాల్కనీలోనికి వచ్చింది. ఇక్కడ వాల్మీకి అంటాడు.
‘జ్ఞాతిదాసీ యతోజాతా
కైకేయాస్తు సహోషితా
ప్రాసాదం చంద్ర సంకాశం
ఆరురోహ యదృచ్ఛయా.’
అంటాడు వాల్మీకి. కైక వంశమునకు దాసీగా ఉండునది. కైక పుట్టింటిలో పుట్టనది. కైకతో కలిసి ఉండునది. చంద్రునివలె తెల్లని చల్లని భవనము పైభాగమునకు దైవసంకల్పముతో ఆరోహించినది. అక్కడనుండి కౌసల్యా అంతఃపురములో జరుగుచున్న కోలాహలమును ఉత్సవ సంరంభములను చూచ పక్కవారి ద్వారా విషయమును తెలుసుకొని కైకవద్దకు వెళ్ళి కాగల కార్యమును ముగించినది. ఆ ఒక్క రాత్రి మందర భవనము పైభాగమునకు ఆరోహించకపోతే మరునాటి రామపట్టాభిషేకమును ఆపగలవారే లేరు. మందర చూడాలి, కైకకు బోధించాలి, కైక మనసులో అసూయా బీజాలు నాటాలి. ఇదంతా ఎవరో చేయలేరు. అపుడు ఆ రాత్రి గడిస్తే రామాయణం అయోధ్యాకాండతో రామపట్టాభిషేకంతో ముగియాలి. అందుకే భగవానుడే సంకల్పించి మందర మనసులో భవనమును అధిరోహించాలి అనే సంకల్పం కలిగించాడు. అంటే యాదృచ్ఛయా మందర భవనమును అధరోహించినది.
(సశేషం)