Saturday, January 18, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఆ దృశ్యము అయిపోయినది. ఇక నేరుగా రంగంలోనికి మందర దిగినది. అపుడు మందర అలా బోధించకుంటే రాముడు అడవికి వెళ్ళడు. అందుకే తాను చేయగలిగిన పని కైకను ఉసిగొల్పటం. అందుకు తాను పూర్తిగా తన ధర్మము నిర్వహించినది. రావణవధకు సహకరించినది. ఇక కైక అన్ని అపనిందలు, అన్ని దూషణలు,అపవాదులు భరించి రాముని అడవికి పంపటంలో కృతకృత్యురాలైంది. దశరథుడు శపించాడు. సుమంత్రుడు దూషించాడు. వసిష్ఠుడు నిందించాడు. తరువాత భరతుడు నిందించాడు. అన్నిటిని భరించినది. భగవంతుని సేవలో ఇవన్నీ సంప్రాప్తిస్తుంటాయి. భక్తులకు నీలాపనిందలు తప్పవు. దూషణలు, అపవాదులు తప్పవు. ఈనాడు కూడా భక్తులకు చివరికి భగవంతునికి, భగవంతుని ఆలయాలకు అపచారాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇది మూడవది. ఇక అరణ్యములో సీతారామ లక్ష్మణులు ప్రవేశించి 13 సంవత్సరాలు గడిపారు ఇంకొక సంవత్సరమైతే తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. వారలా వెళ్ళగలిగితే రామాయణం అరణ్యకాండతో ముగియాలి. అందుకే అగస్త్యమహర్షి రాముని పంచవటిలో నివసించమన్నాడు. జటాయువు సహకరిస్తాడన్నాడు. ఇదంతా దైవవ్యూహం. ఇంకా చెప్పాలంటే రామలీల. పంచవటి జనస్థానానికి ఖరదూషణ నివాసానికి దగ్గర ఉన్నది. అగస్త్యుడు చెప్పాడు తన ఆశ్రమానికి అయిదు యోజనములు అంటే 60 కిలోమీటర్లు. అక్కడనుండి 40 కిలోమీటర్లు జనస్థానం. పంచవటికి రెండు కిలోమీటర్లు జటాయువున్న న్యగ్రోధము అంటే మఱ్ఱిచెట్టు. ఇక ఇపుడు శూర్పణఖ కర్తవ్యము. ఇపుడు శూర్పణఖ రాకుంటే రావణుడు క్షేమంగా తమ దుష్టపాలన కొనసాగిస్తుంటాడు. మంచివారి మంచిపనికి అడ్డు తగలటమే దుష్టుల దౌష్ట్యానికి చరమగీతం పాడుతుంది. అందుకే శూర్పణఖ మొత్తం కార్యక్రమం చక్కపెట్టింది. తాను ప్రేమించటం, భంగపడటం, దుష్టులు కూడా స్వార్థం కోసం భగవంతుని ప్రేమిస్తారు. స్వార్థం కోసం భగవంతుని ప్రేమించేవారు రాక్షసభావాలే ఉన్నవారు అంటారు వాల్మీకి శూర్పణఖ రామునితో పేచీ పెట్టుకొని ముక్కు చెవులు గాయపరచుకొని ఖరదూషణాదులను రెచ్చగొట్టి, వారు వధించబడిన తరువాత ఆ వార్త రావణునికి చెప్పి సీతా సౌందర్యమును వర్ణించి, రావణునికి ఆశ కలిగించి సీతాపహరణమును విజయవంతముగా పూర్తిచేసి రామావతార ప్రయోజనాన్ని సఫలం చేసినది శూర్పణఖయే. అందుకే వాల్మీకి శూర్పణఖా ప్రవేశాన్ని ‘రాక్షసీకాబదా జగామ యాదృచ్ఛయా’ అని శూర్పణఖా ప్రాధాన్యాన్ని వివరించారు. ఇచట వాల్మీకి యాదృచ్ఛయా అని ఒక పదమును ప్రయోగించియున్నారు. వాల్మీకి ప్రతిపదాన్ని చాలా అర్థవంతముగా విశాలమైన తాత్పర్యముతో ప్రయోగించుతారు. 24 వేల శ్లోకాలున్న రామాయణములో యదృచ్ఛయా అను పదమును నాలుగైదు మార్లే వాల్మీకి ప్రయోగించియున్నారు. అనగా ఆ పదమునకు అర్థము ఎంత విలువైనదో, ఎంత గంభీరమైనదో తెలియవలయును. సామాన్యముగా యదృచ్ఛా అనగానే అకస్మాత్తుగా, అనుకోకుండా, హఠాత్తుగా అని అర్థము చెప్పుకుంటాము. అకస్మాత్తుగా అనగా దేనివలన కూడా కానది, అనుకోకుండా అనగా మనమెవరమూ అనుకోకుండా తలచకుండా జరిగినదానిని యదృచ్ఛయా అంటారు. ఇంకొంచెము లోతుగా ఆలోచించి అర్థము చేసుకుంటే ఎవరి వలన కాకుండా అసలు పనియే జరుగదు. ఎవరో ఒకరు అనుకోకుండా పని జరుగదు. ఒక పని జరుగాలంటే ఎవరో ఒకరు అనుకోవాలి. యేదో ఒక కారణము ఉండితీరాలి. కారణము లేనది కార్యము జరుగటానికి వీల్లేదు. మనము అనుకోలేదు మనవలన కాలేదు. అంటే మనకంటే అనగా జీవుల కంటే ఇతరుడు అనుకోవాలి. అనగా పరమాత్మ సంకల్పముచే పని జరుగుతుంది. మనము అనుకున్నా పరమాత్మ సంకల్పము లేకుంటే ఏ కార్యము జరుగదు. అందువలన యాదృచ్ఛా శబ్దమునకు యస్య ఇచ్ఛా అని వ్యుత్పత్తి చెప్పి యత్‌ శబ్దము వలన తెలియబడు పరమాత్మ ఇచ్ఛకు యదృచ్ఛా అనునది వాచకము. అనగా మానవ ప్రయత్నము జరుగుటకు అవకాశము లేనపుడు కావలసిన కార్యమును భగవంతుడే స్వయముగా జరిపించును. అదిగో అపుడు వాల్మీకి యదృచ్ఛా శబ్దమును వాడుచున్నారు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement