‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అనినారు. అనగా సాధుజనరక్షణకు, దుష్టజనశిక్షణకు అయోధ్యలో ఉంటే సాధుజనరక్షణ అవుతుందేమో కాని దుష్టజనశిక్షణ కాదు. తన అయోధ్యలో రాజ్యపాలన చేస్తూ ఉంటే లంకలో రావణాసురుడు, కిష్కింధలో వాలి హాయిగా అధర్మాన్ని వృద్ధిపొందించుచూ ఉంటారు. అంటే తాను అడవికి వెళ్ళాలి. దానికి ఉపకరించిన మొదటి పావు మందర. స్వామిసేవకై వచ్చిన దేవదాసి. ఇంకొంచెం లోతుగా చూడాలంటే పరమాత్మ యోగమాయయే నాలుగు రూపాలలో అవతరించినదని పద్మపురాణము, బ్రహ్మాండపురాణము, బ్రహ్మవైవర్త పురాణము చెప్పుచున్నవి. ఒకటి తాటక, రెండు మందర, మూడు కైక, నాలుగు శూర్పణఖ, నాలుగు యోగమాయ రూపాలే. ఈ నాలుగు లేకుంటే రాముడు అయోధ్య దాటడు. తాటక తానున్న అడవిలోనికి ఋషులను రానీయుట లేదు. ఒక్క ఋషులే కాదు, ఏమియు వచ్చుటకు వీలులేదు. అట్లు వస్తే తన కడుపులోనికి వెళ్ళాల్సిందే. ఆ తాటక పుత్రులే మారీచ సుబాహులు. వారి ద్వారా ఋషుల యజ్ఞాలు భంగం చేయబడుతున్నాయి. ఋషులు తమ ఆశ్రమాలలో యజ్ఞయాగాదులు చేసుకుంటుంటే వీరికొచ్చిన నష్టమేమిటి? తమ పని తాము చేసుకుంటున్నారు. ఎవరినీ బాధించుట లేదు. కాని యజ్ఞయాగాదుల వలన దైవశక్తి వర్థిల్లుతుంటే, ఆసురశక్తి అనగా రాక్షసభావాలు క్షీణిస్తాయి. అంటే ఆ యజ్ఞధూమం తమవైపు పారితే, ఆ మంత్రాలు, ఆహూతులు, స్వాహాకారాలు తమ చెవిలో పడితే తమలోని ఆసురశక్తులు, అధర్మపు ఆలోచనలు, శక్తులు క్రమంగా క్షీణిస్తాయి. వారు కూడా ఋషుల భావనలో పడుతారు. మారీచుడు రాముని బాణము తగిలి సముద్రములో పడి ఋషుల శక్తుల ప్రభావంతో ఋషిజీవనము గడుపుచున్నాడు. తమ శక్తి క్షీణించ తమ నివాసాలు, తమ బలగాలు, తమ ఆలోచనలలోనే ఉండాలనుకుంటారు. మంచివారు చెడు తమవైపు రాకూడదనుకున్నట్లుగా చెడ్డవారు తమవైపు మంచివారు రాకూడదు అనుకుంటారు. ఇపుడు జరుగుచున్నది అదే. నీతినిజాయితీ, ధర్మము, న్యాయము, సత్యము, అహింస అంటున్నవారిదే తప్పుగా చిత్రిస్తున్నారు. తమ లక్ష్యానికి అడ్డువచ్చేవారందరూ చెడ్డవారు, తమ లక్ష్యానికి సహకరించేవారు మంచివారు. ఇది ఈనాటి మంచిచెడు వ్యవస్థ. పుణ్యపాప వ్యవస్థ. దీని బీజం ఆనాడు తాటక రాముడు రావటానికి మరీచ సుబాహువులను పుత్రులను ఋషులపైకి ఉసిగొల్పినది. దానివలన విశ్వామిత్రుడు రామసహాయాన్ని అర్థించటానికి, తాటక సహకరించినది. ఆమె పని అయిపోయినది కావున ఇక ఆ పాత్ర ఉండవలసిన పనిలేదు. అందుకే రాముడు ముందు తాటకను వధించాడు. ఇందులో ఇంకొక రాజనీతి ఉన్నది. ధర్మసూక్ష్మమున్నది. తాటకను చంపకుండా మరీచ సుబాహువులను చంపితే తాటక మళ్ళీ పుత్రులను ఉత్పత్తి చేసి, మళ్ళీ ఋషులపైకి పంపుతుంది. అందుకే మొదట తాటకను రాక్షసజన్మభూమిని వధించి తరువాత మరీచ సుబాహువులను దూరం చేశారు. ఇందులో ఒక సుబాహువునే వధించారు. మారీచుడు ముందు ముందు రావణవధకు సహకరించవలసిన పని ఉన్నది. మారీచుడు లేకుంటే సీతాపహరణము జరుగదు. ఇట్లు పరోక్షముగా పరంపరగా సీతాపహరణమునకు తాటక అవతరించినది. సహకరించినది.
(సశేషం)