Thursday, January 16, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

‘తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షీ చీరకృష్ణాజినాంబరే
ఫలమూలాశ్రినౌ దాంతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
పుత్రౌ దశరథస్యాస్తా తాపసీ బ్రహ్మచారిణౌ.’

అని స్తోత్రము చేసినది. యువకులు, రూపము కలవారు, సుకుమారులు, అట్లని బలహీనులు కాదు. మహాబలసంపన్నులు. ఈ విషయము ఆమెకెట్లు తెలియును అనగా వేయి యేనుగుల బలమును శూర్పణఖ ఋషుల వరము వలన పొందినది. అటువంటి తనను ఒక్క లక్ష్మణుడు ఒంటిచేత్తో ఆపి రెండోచేత్తో ముక్కుచెవులు కోశాడంటే మరి మహాబలము కలవారే. పద్మములవంటి విశాలమైన నేత్రములు కలవారే. నారచీరలు, జింక చర్మమును ధరించినవారు, ఫలములను, మూలములను భక్షించువారు, మనోనిగ్రహము కలవారు, తాను అంత అందమైన రూపమును ధరించి వెళ్ళినా తనపై కన్ను వేయలేదు. కావున మనోనిగ్రహము కలవారు. తపస్సంపన్నులు, బ్రహ్మచారులు, దశరథుని పుత్రులు, అన్నదమ్ములు వారు రామలక్ష్మణులు. జనస్థానమున ఈ ప్రదేశమున నివసించుచున్నారు. చూచారా! తనకు అపకారము చేసినవారిని తన కోరికను తిరస్కరించినవారిని ఎంత ప్రేమతో, భక్తితో స్తుతించినదో! అది ధర్మబలము. ధర్మము నాచరించువానికి అధర్మాత్ములు కూడా సహకరించెదరు. రామాయణమును చదివినవారెందరు మందరను, కైకను, శూర్పణఖను, మారీచుని, వాలిని దుష్టులుగా ద్వేషించుచున్నారు? వారు కూడా తన స్వభావముతో ధర్మరక్షణ చేయుటకు రామునికి సహకరించినారు. రామాయణమును మనకు తోచినరీతిలో అర్థము చేసుకొనరాదు. పెద్దల ద్వారా అందులోని రహస్యములను తెలుసుకొనవలయును. కేవలము కథగానే చూడరాదు. రాముడు శ్రీమన్నారాయణుడే. దేవతలు అందరూ ప్రార్థించగా దుష్టులను సంహరించుటకు నరునిగా అవతరించాడు. అసలు రాముడొచ్చినది అయోధ్యను పాలన చేయుటకు కాదు. సకల జగత్తును పాలన చేయుటకు స్వామి అవతారము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement