Sunday, January 12, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

కృష్ణద్వైపాయనం వ్యాసం
విద్ధి నారాయణం ప్రభుమ్‌
కోహ్యన్యో భువి మైత్రేయ
మహాభారత కృద్భవేత’ అని.
కృష్ణద్వైపాయన వ్యాసభగవానుడు సాక్షాత్‌ నారాయణుడే అని తెలియుము. నారాయణుడు కాక మరెవ్వరూ మహాభారతమును రచించగలరు అంటారు పరాశర భగవానులు. అసలు వ్యాసభగవానుని వంశవృక్షము చాలా మహత్తు కలది. శ్రీమన్నారాయణుడు, అతని నాభికమలము నుండి బ్రహ్మ, బ్రహ్మనుండి వసిష్ఠుమహర్షి, వసిష్ఠ మహర్షి వలన శక్తి, శక్తి వలన పరాశరమహర్షి, పరాశర మహర్షి వలన వ్యాసభగవానుడు. వ్యాసభగవానుని వలన శుకయోగీంద్రుడు. ఇది వ్యాస వంశవృక్షము. ఈ విషయమే ‘వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్‌ పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌’ అనునది వ్యాసస్తుతి. నారాయణుడే ఆయా రూపములలో వచ్చిఉన్నాడు. ఆ నారాయణుడే కృష్ణునిగా అవతరించినాడు. ఆ కృష్ణుని కథను చెప్పటానికి ఆ నారాయణుడే వ్యాసభగవానునిగా అవతరించినారు. భగవానుని చరిత్రను దాని లోతుపాతులను భగవానుడు తప్ప మరెవ్వరు చెప్పగలరు? అందుకే వ్యాసభగవానుడంటే నారాయణుడు. కృష్ణభగవానుడంటే నారాయణుడే. నారాయణుని అవతారము ధర్మరక్షణ కొరకు, ధర్మసంస్థాపన కొరకే. శ్రీరామచంద్రుని ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని మారీచుడు రాక్షసుడు రామునిచేత నాలుగు మార్లు దెబ్బలు తిన్నవాడు అయినా రాముని రూపుదాల్చిన ధర్మము అని రావణాసురునికి తెలిపినాడు. అంతేకాదు, సాధువు సత్యపరాక్రముడు, అతని బలము సత్యమే. అతని శక్తి సాధువు. ఇది మారీచుడు చేసిన స్తుతి. శ్రీరాముని శత్రువులు కూడా అందులో అతని వలన అపకారమును పొందినవారు కూడా స్తుతించినారు. ధర్మమునాచరించనివారు కూడా ధర్మమును ఆచరించుచున్నవారిని చూచినచో స్తుతించక మానరు. జోహారు చెప్పక మానరు. ఇందుకు ఉదాహరణ శూర్పణఖయే. శూర్పణఖ రాముని సౌందర్యమును చూచి మోహించినది. అతన్ని భర్తగా పొందాలని కోరుకున్నది. దానికొరకు సీతను భక్షించి అడ్డు తొలగించుకుంటానన్నది. ఇది ఈనాడూ ఉన్నది. ఆనాడూ ఉన్నది. తాను చేయు పని అధర్మమైనా దానిని అడ్డగించినవారిని అంతము చేయాలి అనగా తనకు అడ్డువచ్చినవారిని అంతము చేయాలి. అది ఈనాడు మారలేదు. అపుడు లక్ష్మణుని ద్వారా ముక్కు చెవులు ఖండిరచబడి తన అన్న అయిన ఖరుని వద్దకు వెళ్ళినది. ఖరుడు కోపముతో ఎవరా ధర్మము లేనివాడు, మూర్ఖుడు నా చెల్లెలిని ఇంతటి అవమానము చేసినవాడు అని ప్రశ్నించినాడు. విషయమును సంపూర్ణముగా తెలియకనే తన చెల్లెలు ఏమి చేసినది, ఎందుకు ముక్కు చెవులు కోసినాడు పూర్వాపరములు తెలియకనే రాముని గురించి ఇచ్ఛానుసారముగా మాట్లాడినాడు. అది చూడలేదు కాబట్టి. చూస్తే అలా మాట్లాడేవాడు కాడు. ఎవరిది ధర్మము, ఎవరిది అధర్మము అను విచారము లేదు. తన చెల్లెలికి హాని కలిగించినవాడు అధర్మాత్ముడు, తాము అధర్మము చేసినా దానిని కాదనరాదు, అడ్డు తగలరాదు. అధర్మమును అడ్డగించినవారే అధర్మము నాచరించినవారి దృష్టిలో అధర్మాత్ములు. ఇలాంటి గుణములు ఆనాటి కాలములో కొందరిలోనే ఉండేవి. ఇపుడు ఇవే సర్వసాధారణములు. అయితే శూర్పణఖ మాత్రము తనకు అపకారమును చేసిన రామలక్ష్మణులను స్తుతించినది. చూడుడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement