Thursday, November 28, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ


ఇక మత్స్యావతారంలో బ్రహ్మ పోగొట్టుకున్న వేదాలను తెచ్చి ఇచ్చిన ఔదార్యాన్ని తలుచుకున్నాము. ఇక ప్రధానమైన అవతారము కూర్మావతారము. దేవతలు రాక్షసులు మమ్ములను చంపుతున్నారు. చావు లేకుండా చూడు అని అడిగారు. స్వామి నవ్వుకున్నారు. చావు లేకపోవటమే అసలైన బాధ. శరీరముంటే కదా బాధలు, ఆనందాలు, ప్రియములు, అప్రియములు. అసలు శరీరమే లేకుంటే బాధలెక్కడివి? చావు లేకుంటే రాక్షసులు కొడుతున్న దెబ్బలను మౌనంగా భరించాలి. అంటే దేవతలు బాధలనే కోరుతున్నారు. అందుకే స్వామి నవ్వి శరీరంతోపాటు రాజ్యము, చావు లేకుండా భోగాలు, ఐశ్వర్యాలు ఉండేలా, లక్ష్మీదేవి కటాక్షం కలిగేలా క్షీరసాగరమధనం చేయించాడు. క్షీరసాగరమధనం లక్ష్మి కోసమే స్వామి చేయించాడు. అమృతం తరువాతి ప్రయోజనం అని ప్రసిద్ధిలో ఉంది. అది పూర్తిగా అసంగతమేమీ కాదు. కాని లక్ష్మి తన కోసం కాదు. లక్ష్మీ స్వయంవరం జరిగినా, లక్ష్మి ఆవిర్భవించినా లక్ష్మీకటాక్షం మూడు లోకాలపై పడటానికే అలా చేశాడు. దుర్వాస శాపం లక్ష్మీదేవి మూడు లోకాలకు అదృశ్యం అవుతుంది. మూడు లోకాలపై ఆమె కటాక్షం ఉండదు అని మాత్రమే శాపం. అంతే కాని లక్ష్మి పూర్తిగా అదృశ్యం కమ్మని కాదు. నారాయణునికి కూడా లక్ష్మి అదృశ్యం కాదు. కాజాలదు. లక్ష్మీదేవికి అనేక పురాణాలలో ఇతిహాసాలలో ‘నిత్యానపాయినీ’ అని పేరు. అనగా శ్రీమన్నారాయణుని ఎపుడూ అనగా ఒక క్షణం కూడా విడిచి ఉండదు. స్వామి వక్షస్థలంలో మూడు లోకాలకు కనపడకుండా అదృశ్యురాలిగా ఉంది. లక్ష్మీకటాక్షాన్ని కోల్పోయిన దేవతలు రాజ్యభ్రష్టులయ్యారు. రాక్షసులతో పరాజయం పాలయ్యారు. మరణం లేకుండా ఉండాలి అని స్వామిని ప్రార్థించారు. కాని అడిగినదే ఇస్తే స్వామి ఉదారుడు ఎలా అవుతాడు? రాజ్యం లేక, సంపద లేక ఒక ఆయుష్యం మాత్రమే ఇస్తే దుర్భరదారిద్య్రంతో దీర్ఘాయుష్యం ఎంత అనర్థమో స్వామికి తెలుసు కదా! అందుకే వారిపై దూర్వాసశాపం వలన కోల్పోయిన లక్ష్మీకటాక్షం పడటానికి లక్ష్మి దృశ్యం కావటానికి క్షీరసాగర మధనం చేయించాడు. నిస్వార్థంగా చేసి కూడా తన కోసమే తన భార్య తనకు దక్కటానికే క్షీరసాగరమధనం చేయించాడని ప్రచారం చేసి మూడు లోకాలకు లక్ష్మీకటాక్షాన్ని కలిగించాడు. అందరికీ కనపడేలా తన వక్షస్థలంలో చూపాడు. స్వార్థం కోసమే పనులు చేస్తూ పరులను ఉద్ధరించటానికే ప్రచారం చేసుకుంటున్నవారు చాలామంది ఉంటారు, ఉన్నారు. కాని పరోపకారం చేస్తూ స్వార్థం కోసమే ఇలా చేశాను అని ప్రచారం ఎందరు చేసుకుంటారు? ప్రచారం చేస్తే ఎందరు సహిస్తారు? అలా సహించటం కంటే తాను స్వార్థపరుడను అనిపించుకుంటూ మూడు లోకాలకు, ముక్కోటి దేవతలకు కష్టాలు తొలగించి, రాజ్యము, అమృతం ప్రసాదించాడు. ఇంతకన్నా ఔదార్యం ఎక్కడ ఉంటుంది. వారికోసం స్వామి ఎంత శ్రమపడ్డాడు. మందర పర్వతం దేవతలు, రాక్షసులు కూడా కలిపి లేపలేక అవస్థ పడుతుంటే గరుడునితో మోయించి సముద్రంలో పడవేయించాడు. శంకరునికి చెప్పి వాసుకిని వారికి ఇచ్చాడు. పర్వతం మునుగుతుంటే తాను కూర్మమై ఆ పర్వతాన్ని వీపుమీద ధరించాడు. పర్వతం ఒక ప్రక్క ఒరుగుతుంటే పైన తాను కూర్చొని ఒరగకుండా ఆపాడు. దేవతలు ప్రార్థిస్తే దేవతలలో తాను చేరాడు. రాక్షసులు అశక్తులైతే వారిలోనూ తాను చేరాడు. ఇంతమంది లాగుతుంటే పర్వతంతో రాపిడికి తట్టుకోలేకుంటే వాసుకిలో తాను అయ్యాడు. పర్వతం తట్టుకోకుంటే పర్వతంలో తానయాడు. ఇలా పర్వతంపైనా, పర్వతం క్రిందా, పర్వతంలో, వాసుకిలో, దేవతలలో, రాక్షసులలో, మరల దేవతల ముందు, రాక్షసుల ముందు ఇన్ని రూపాలు అనగా అష్టమూర్తి తానై మధనభారమంతా తాను మోశాడు. విషమొస్తే తాను త్రాగలేడా? అన్నీ తానైతే ఎలా శంకరునికి భాగం ఈయాలి కదా! అగ్రపూజ అని పేరుపెట్టి సముద్రంలో మొదటి పంట అనగా మొదలు పుట్టినదానిని ఆయనకు అర్పించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇలా కూర్మావతారమంతా ఔదార్యానికి పరాకాష్ఠ. ఆ అవతారం అంతటితో అయిపోలేదు. తానే ధన్వంతరిగా అవతరించి అమృతభాండాన్ని తీసుకొనివచ్చాడు. రాక్షసులు అపహరిస్తుంటే చూస్తూ కూర్చున్నాడు. వారు కూడా కష్టపడ్డారు కదా! వారికీ ఫలితం అందినది అన్న తృప్తి కలిగించాలి కదా! అందుకే చూస్తూ ఊరుకున్నాడు. ఇదీ ఔదార్యమే. తాను పురుషోత్తముడై కూడా మోహినీరూపంలో ఆవిర్భవించి (అవతరించి) రాక్షసుల మనస్సును రంజింపచేసి అమృతం తీసుకొని దేవతలకిచ్చాడు. ఇదంతా యేమంటారు? ఔదార్యం కాదా! ఒక్క కూర్మావతారంలో ధన్వంతరి, మోహినీ అవతారాలు జోడిరచి అమృతం అడిగితే స్వర్గరాజ్యాన్ని కూడా ఇచ్చిన స్వామి ఔదార్యం ఏ శ్రుతులు వర్ణించగలవు? అందుకే శ్రుతి ‘యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ’ అని అన్నది. శ్రుతులు కూడా ఆ పరమాత్మ గుణజాతాన్ని చెప్పజాలక అసలు అతన్ని చేరజాలక వెనుతిరుగుచున్నాయి అనుచున్నారు.
(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement