ధర్మము – అధర్మము
పుణ్యము – పాపము
అన్ని శాస్త్రములు అనగా శ్రుతి స్మృతులు భగవానుని ఆజ్ఞారూపములు. భగవానుని ఆజ్ఞారూపమైన శాస్త్రములలో చెప్పిన ధర్మాన్ని ఆచరించుట పుణ్యము. ధర్మాన్ని ఉల్లంఘించి అధర్మాన్ని ఆచరించుట, ఆచరించినవానిని అభినందించుట, ప్రోత్సహించుట పాపము అని మనము ఇదివరకే తెలుసుకొనియున్నాము. జీవునికి కరచరణాది అవయవములను, శరీరమును, మనసును, బుద్ధిని ఇచ్చి, వాటితో ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఏవి చేయకూడదో, చేస్తే కలిగే దుష్ఫలితాలెలా ఉంటాయో తెలిపే శాస్త్రాలు అనగా వేదములను, స్మృతులను మనకు అందించారు. వేదములు శాస్త్రములు అనగా మానవ రాజ్యాంగములు. సకల మానవ సంక్షేమము శాంతిసౌభాగ్యములతో కూడుకొనిన జీవనాన్ని అందించేది మానవ రాజ్యాంగము. దానిలో కూడా సంకుచితదృష్టితో వక్రవ్యాఖ్యానాలు, విమర్శలు చేసి వాటిని ధిక్కరిస్తుంటే చేజేతులా నరకమును కొనితెచ్చుకుంటుంటే అపారమైన దయగల పరమాత్మ తానే స్వయముగా మనకోసం భూమిమీద అవతరించి ధర్మమంటే ఏమిటో తెలుపుచూ, ఆ ధర్మాన్ని తాను ఆచరించుచు ఆచరించనివారు పొందే దుష్ఫలితములను చూపి, గీత మొదలగు ధర్మశాస్త్రములను తాను బోధించి, వ్యాస భీష్మ మార్కండేయ అగస్త్య పరాశర శుక వైశంపాయనాదులతో బోధింపచేసియున్నారు. ఆ సమయంలో ఉన్నవారు స్వామి దివ్యస్వరూపమును తెలిసినవారు, తత్త్వము తెలిసినవారు, స్వామి ఉపదేశమును గ్రహించి అట్లు ఆచరించి, తరించియున్నారు. అయినా అటువంటివారు చాలా కొద్దిమంది మాత్రమే. ధర్మము ఆత్మకు యోగక్షేమములను కలిగిస్తుంది. అధర్మము శరీరమునకు తాత్కాలికముగా సౌకర్యమును కలిగిస్తుంది. కొన్ని భుజించుచున్నపుడు బాగుంటాయి. భుజించిన తరువాత దాని దుష్ఫతితములు అనుభవించి అలా చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటాము. తాత్కాలిక శారీరక సౌకర్యము దానితో మనసునకు తృప్తిని కలిగించేది అధర్మము. తరువాత శరీరానికి అనారోగ్యము, మనసునకు అంతేలేని దుఃఖము కలుగుతుంది. ఇట్లు తాత్కాలిక సంతృప్తి కొరకు అధర్మమును ఆచరించి, శరీరానికి, మనసునకు అంతులేని అశాంతిని కలిగించవద్దని ధర్మముమీద మనసు పెట్టి ఒక క్షణము పరికిస్తే మీకు అర్థమౌతుంది అంటాయి స్వామి అవతారములు. అయితే స్వామి అవతరించిన కాలములో లేనివారికి స్వామి అవతారగాథలు ఆయా అవతారములలో ఉపదేశములు ఎట్లు తెలియాలి అని పరమ దయామూర్తి అయిన స్వామి తన అవతారగాథలను ఆయా అవతారాలలో తాను చేసిన ఉపదేశములను తన రూపాంతరములైన ఋషుల ఉపదేశములను అందరికీ అందించుటకు స్వామి పురాణ ఇతిహాస రూపములలో అవతరించియున్నారు. పురాణములు, ఇతిహాసములు భగవానుని వాఙ్మయావతారములే అని తెలియవలయును. అన్నిటిని అలా ఉంచి అందరికీ బాగా నోటిలో నానుతున్న భారత భాగవత రామాయణములు శ్రీమన్నారాయణ స్వరూపములే అని వేనోళ్ళ కొనియాడబడినవి. పరమాత్మే భారతముగా అవతరించెను అనునది అభియుక్తోక్తి. అంతేకాదు భారతమును చెప్పిన వేదవ్యాస భగవానుడు సాక్షాన్నారాయణుడే అంటుంది విష్ణుపురాణము.
(సశేషం)