అంతేకాదు సాంఖ్యశాస్త్రమున ప్రధానమునకు అనగా ప్రకృతికి ప్రయోజనము పురుషానుభవము. అది కానినాడు అపవర్గము అనగా పురుషుడు ప్రకృతిని అనుభవించుటకు దూరమైననాడు అపవర్గమే అని ఇట్లు రెండు ప్రయోజనములను చెప్పియున్నారు. ఇపుడు మీరు చెప్పిన రీతిలో ఆ రెండు సంభవించవు. మీ మతమున పురుషుడు చైతన్యమాత్రము కలవాడు, నిష్క్రియుడు, నిర్వికల్పుడు, అట్లే నిర్మలుడు కావుననే పురుషుడు నిత్యముక్తస్వరూపుడు అయినపుడు ఆ పురుషునికి ప్రకృతి దర్శనమను ఉపభోగము లేదా ప్రకృతి వియోగరూపమైన అపవర్గము కూడా సంభవించదు. ఒకవేళ మీరు ప్రకృతి సన్నిధిలో ఉండుట వలన పురుషునికే ప్రకృతి పరిణామము అనగా సుఖదుఃఖములే కదా. ప్రకృతిలో కలుగు పరిణామమే పురుషుని సుఖదుఃఖములకు కారణము. అంతే కదా! ఒక్కసారి ప్రకృతి అతిశీతలమైనా దుఃఖము, అతి ఉష్ణమైనా దుఃఖము. సమశీతోష్ణమైనచో సుఖము. వేసవిలో వర్షము పడితే సుఖము. చలికాలములో ఎండ కాస్తే సుఖము. ఇవన్నీ ప్రకృతి పరిణామములు కదా. ఈ పరిణామములు సత్త్వ రజ స్తమోగుణముల హెచ్చుతగ్గుల వలన కలుగుచుండును. మన శరీరము పాంచభౌతికము కావున శరీరము ప్రకృతియే కదా. సత్త్వ రజ స్తమో గుణములే కఫ వాత పిత్తము అను దోషములుగా శరీరమున ప్రవేశించును. కఫమెక్కువైతే జలుబు, వాతమెక్కువైతే కీళ్ళనొప్పులు, కాళ్ళ నొప్పులు, పిత్తమెక్కువైతే జీర్ణకోశ సమస్యలు ఏర్పడును. ఇవన్నీ దుఃఖమునే కలిగించును. మనము నియమబద్ధ జీవనమును అవలంబిస్తే ప్రకృతి పరిణామము సుఖమును కలిగించును. కమ్మని భోజనం చేస్తే సుఖము. ఆ భోజనమే అరుగకుంటే దుఃఖము. ఇట్లు ప్రకృతి పరిణామరూపములు సుఖదుఃఖములు కలుగుచున్నవి అని ప్రకృతి సన్నిధానము ఎప్పుడూ వుండును. కావున నిత్యభోగము కావలసివచ్చును. అది లేదు అంటే నిత్యముక్తి కావలసివచ్చును. అందువలన పురుషుడు నిష్క్రియుడైనచో అనుభవించుట కుదురదు. అనుభవించుటకు కోరిక కావలయును. కోరిక కలుగాలంటే జ్ఞానము కావలయును. ఆహారము తీసుకుంటే ఆకలి పోతుంది అని తెలిస్తే కదా ఆహారము తీసుకోవలయును అను కోరిక కలిగేది. కావున జ్ఞానము లేనిదే ఇచ్ఛాప్రయత్నములు కుదురవు. ఆ జ్ఞానము జడమైన ప్రకృతికి ఉండదు. పురుషునికే జ్ఞానముండును. జ్ఞానమున్న పురుషుడు నిష్క్రియుడు కాజాలడు. పురుషుడు క్రియావంతుడు అంటేనే ప్రకృతిని అనుభవించుటనే, ప్రకృతిని అనుభవించుటలో ప్రకృతి ఆకర్షణకు గురై శరీరాన్ని, వాతావరణాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాడు. అందువలన ప్రకృతిని ఎంతవరకు ఏ రూపములో అనుభవించాలని చెప్పినవే ధర్మశాస్త్రములు. ఆ శాస్త్రమును అనుసరించుట పుణ్యము. దానిని కాదని తాత్కాలికమైన సుఖము కొరకు ఆరాటపడుట పాపము. ఇట్లు శాస్త్రము మన పుణ్యపాపములను తెలుసుకొని భగవదాజ్ఞను పాటించుచూ భగవంతుడిచ్చిన శరీరమును ఇంద్రియములను భగవంతుని సేవలోనే వినియోగించుచు భగవంతుని కృపకు పాత్రుడై సంసారబంధమును తొలగించుకొని భగవంతుని సన్నిధి చేరుటయే జీవుని కర్తవ్యము అని అన్ని శాస్త్రములు ఉద్ఘోషించుచున్నవి.
(సశేషం)