Thursday, January 9, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇట్లు మీరు చెప్పుచున్ననూ ప్రధానమునకు ప్రవృత్తి సంభవించదు అను మా మాట అట్లే ఉన్నది. ఎందుకనగా ఇచట మీరు చెప్పిన దృష్టాన్తమున పంగునకు అనగా కుంటివానికి గమనశక్తి లేకున్ననూ దారిని చూడగలుగును. చూచిన దారిని గుడ్డివానికి వివరించగలుగును. ఇట్లు మనము వేలమందిని చూచుచున్నాము. గ్రుడ్డివాడు కూడా చైతన్యము కలవాడే, కుంటివాడు చెప్పిన మార్గవివరములను అర్థము చేసుకొనగలడు. అయస్కాంతమణి ఇనుము సమీపమునకు వెళ్ళగలుగుచున్నది లేదా ఇనుమును తనవద్దకు తీసుకొనగల శక్తి ఉన్నది. మీరు చూపిన దృష్టాన్తమున ఇద్దరికి చైతన్యము సక్రియత్వమున్నది. కావున ఒకరి సహకారమును ఇంకొకరు తీసుకొని ప్రవర్తించుట సంభవమే. కాని ఇచట మీ సిద్ధాంతము ప్రకారము పురుషుడు నిష్క్రియుడు అని చెప్పియున్నారు. అనగా స్పందనముతోపాటు ఏ క్రియలు లేనివాడు అని చెప్పి ఉన్నారు. కావున పురుషునిలో ఎటువంటి వికారములు సంభవించుటకు అవకాశము లేదు. అందువలన పురుషుని సన్నిధానము వలన ప్రకృతి సృష్ట్యాదులలో ప్రవర్తింపజాలదు. ఒకవేళ మీరన్నట్లుగా సన్నిధానమాత్రమున సృష్ట్యాదులలో ప్రవర్తించవచ్చును అనినచో ప్రకృతి పురుష సన్నిధానము అన్నివేళలా ఉండునది కావున అన్నివేళలా సృష్టి జరుగుచుండవలయును. అదట్లు జరుగదు అనినచో అనగా ప్రకృతి పురుషులు సన్నిధిలో వుండరు అనినచో ప్రకృతి నుండి విముక్తియే పురుషునికి ముక్తి కావున అందరూ నిత్యముక్తులు కావలయును. అనగా ఇక పురుషునికి సంసారబంధమే ఉండకపోవలసివచ్చును. ఎపుడు కలిసియే ఉందురు అనినచో ముక్తి లేకుండా పోవును. అందువలన పురుష సన్నిధానము వలన ప్రకృతియే సృష్ట్యాదులలో ప్రవర్తించును అను మాట అసంగతము.

Advertisement

తాజా వార్తలు

Advertisement