అనగా ఇచట మరియొక్క ఆక్షేపమును చేయుచున్నారు. మీరు చెప్పినట్లు చైతన్యము మాత్రము కల పురుషుడు ఏ క్రియ చేయజాలనివాడు. ప్రధానము జ్ఞానము లేనిది. కావున దానికి సంకల్పశక్తి, దృష్టిశక్తి లేదు. అయిననూ పురుషుడు సన్నిధిలో ఉన్నపుడు అచేతనమైన ప్రకృతి కూడా ప్రవర్తించును. అట్లు మనము చూచుచున్నాము. కుంటివాడు నడువజాలడు. కాని కన్నులున్నవి కాన చూడగలడు. అటువంటి కుంటివాడు దగ్గర ఉన్నపుడు అతన్ని ఆధారము చేసుకొని అతని చైతన్యము యొక్క సహకారముతో కన్నులు లేనివాడు నడకలో ప్రవర్తించును. అయస్కాంతము సన్నిధిలో ఉంటే ఇనుము కూడా చలనమును పొందుచున్నది. కావున చలనాదులు లేనివి, చలనాదులున్నవారి సహకారముతో ప్రవర్తించుచున్నవి. కావున ప్రకృతి పురుష సంయోగము వలన జగత్ సృష్టి జరుగవచ్చును. పరమాత్మ సంకల్పము పనిలేదు అని మరియొక ఆక్షేపము. ఈ విషయమునే సాంఖ్యశాస్త్రము ‘పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం యథా ప్రధానస్య పంగ్వన్ధవదు భయోరపి సంయోగః తత్కృతస్సర్గః’ అని పురుషునికి ప్రధానమను ప్రకృతి అనుభవము కొరకు కైవల్యము కొరకు పురుషుని సన్నిధానము వలన ప్రధానము అనగా ప్రకృతి సృష్ట్యాదితో ప్రవర్తించును కావున పరమాత్మ సంకల్పముతో పనిలేదు అనగా సమాధానమును చెప్పుచున్నారు.
(సశేషం)