Tuesday, January 7, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ప్రకృతి జడము. అది ప్రాజ్ఞుడైన పరమాత్మచేత అధిష్ఠించబడనిచో పరిస్పన్దప్రవృత్తి కూడా సంభవించదు అనగా గడ్డిపరక కదలవలయునన్నా దానిలో పరమాత్మ అధిష్ఠించియే కదిలించవలయును, కాని స్వయముగా తనకు తానుగా గడ్డిపరక కదలజాలదు అని ఇంతవరకు చెప్పియున్నారు. కాని ప్రాజ్ఞుని అపేక్ష లేకుండగనే ప్రకృతిలో పరిణామ ప్రవృత్తి సంభవించవచ్చును. అట్లు లోకమున కనపడుచున్నది. ధేనువు, మహిషి (గేదె), మేక మొదలగు జంతువులు భుజించిన తృణపిణ్యాక జలాదులు ఏ అపేక్ష లేకుండగానే తమకు తామే స్వయముగా క్షీరాదులుగా పరిణమించుట కనపడుచున్నది. కావున ప్రకృతి కూడా స్వయముగా జగదాకారముగా పరిణమింపవచ్చును. అపుడు బ్రహ్మకారణత్వము బ్రహ్మ నియమించుట, శాసనము చేయుట, పుణ్యపాపవ్యవస్థ ఇది అంతయు అవసరము లేదు కదా. ప్రకృతియే ఇంద్రియములను ఆకర్షించును. ఆ విషయములను అనుభవించుటకు ఇంద్రియములు మనస్సును, బుద్ధిని ప్రేరేపించును. అవి అనుభవింపచేయును. ఇక ఇక్కడ పాపపుణ్య వ్యవస్థలో స్వర్గనరకాలు లోకముల అవసరమే లేదు అని శంకించగా చెప్పుచున్నారు. ఇట్లు చెప్పుట కుదురదు. ప్రాజ్ఞుడు అధిష్ఠించకుండగా తృణాదులు క్షీరాదులుగా పరిణమించుట కుదురదు కావున నీవు చెప్పిన దృష్టాన్తము కుదురదు. ఎట్లు కుదురదు అనగా ధేను మహిష్యాదికము ఉపయోగించిన తృణాదులు మాత్రమే క్షీరాది ఆకారముగా పరిణమించుచున్నవి కాని వృషభము, మహిషాదులు ఉపయోగించిన తృణాదులు క్షీరాదిగా పరిణమించుట లేదే! ఒకవేళ భుజించిన తృణాదులు క్షీరములుగా మారినచో వృషభములు మొదలగునవి భుజించిననూ క్షీరములుగా పరిణమించవలయును. అంతెందుకు మానవులలో కూడా ఆడవారు భుజించిన ఆహారాదులే పాలుగా మారుచున్నవి. ఇంకొక విషయము అన్నివేళలా తీసుకొన్న ఆహారము పాలుగా మారుట లేదు. గర్భము దాల్చినపుడు పుట్టబోవు శిశువుకు ఆహారము కొరకు పరమాత్మయే స్త్రీ తీసుకున్న ఆహారంలో కొంతభాగాన్ని పాలుగా మార్చుచున్నాడు. అనగా అట్లు పాలుగా మారుటకు కావలసిన ఉపకరణములను స్త్రీ దేహములో ఏర్పరచి అవి ఆ సమయము వచ్చినపుడే పనిచేయునట్లుగా వ్యవస్థ యేర్పరిచి ఆ వ్యవస్థతో ఆ సమయంలో పరమాత్మయే అధిష్ఠించి అట్లు పాలుగా మార్చుచున్నాడు. కావున ఆ తృణాదులు కూడా పరమాత్మాధిష్ఠితమైనపుడే క్షీరాదులుగా మారుచున్నవి అని అంగీకరించవలయును. అట్లు కానినాడు ప్రతి ప్రాణి తీసుకొనిన ఆహారము అన్ని సమయములలో పాలుగా మారవలసి వచ్చును. కావున అక్కడ తృణాదులు కూడా ప్రాజ్ఞునిచే అధిష్ఠించబడినవే అని చెప్పవలయును. కావున జగత్కారణము పరబ్రహ్మయే. అతని సంకల్పమువలననే సకల జగత్తు ఏర్పడుచున్నది, ప్రవర్తించుచున్నది అని.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement