‘తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తితే’ అని. ‘తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వతా’ అనుచున్నారు. అనగా నిరంతరము నాయందే మనసు లగ్నము చేసి ప్రీతిపూర్వకముగా నన్ను సేవించువారికి నన్ను చేరుటకు ఉపయోగించు బుద్ధిని కూర్చెదను. అటువంటివారిని దయ చూపుటకు వారికి అజ్ఞానము వలన కలుగు తమస్సును అనగా చీకటిని ప్రకాశించు జ్ఞానదీపముతో నశింపచేసెదను. అందువలన ధర్మమును ఆచరించినవానికి ఉత్తరోత్తర శ్రేయఃప్రదాయకమైన బుద్ధిని కలిగించి వృద్ధిలోనికి తీసుకొనిపోవుట రక్షించుటయే. అధర్మమును చేసినవారిని ఆ అధర్మబుద్ధి మరల కలుగకుండుటకు చేసినదానికి శిక్ష విధించి వానిలో అధర్మప్రవృత్తిని సంకల్పమును తొలగించి ధర్మప్రవృత్తి కలిగించుట కూడా రక్షణయే, దయాకార్యమే. అందువలన పుణ్యము అనగా భగవంతుని ఆజ్ఞారూపమైన శాస్త్రమును అనుసరించి ప్రవర్తించుట. పాపము అనగా భగవంతుని ఆజ్ఞారూపమైన శాస్త్రమును ఉల్లంఘించుట అని తెలియవలయును.
ఇచట ఇంకొక సందేహము కలుగును. ఇక్కడ ఇంతవరకు చెప్పినదానితో భగవానుడు తన శాసనరూపమైన శాస్త్రమునుల్లంఘించుట వలన అతని స్వాతంత్య్రమునకు భంగము కలుగుట లేదు అని సిద్ధాంతమును చేసియున్నారు. అట్లే మనము ఆచరించు కర్మలు భగవదారాధనారూపముగా ఆచరించినపుడు ఫలప్రదములు అగును అని శాస్త్రసిద్ధము కావున మరి ఆయా కర్మలకు స్వర్గనరకాది లోకప్రాప్తి, అచట ఫలభోగము అనునవి కుదురవలయును అనినచో ఈ సకల జగత్తునకు పరబ్రహ్మ మాత్రమే కారణము అనునది పైన చెప్పిన హేతువులచే సిద్ధించుచున్నది.
(సశేషం)