Wednesday, January 8, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇట్లు పుణ్యపాపములను తెలుసుకొని భగవానుని ఆజ్ఞారూపమైన శాస్త్రమును తెలుసుకొని శాస్త్రము చెప్పిన రీతిలో ఇంద్రియములకు, మనస్సునకు, బుద్ధికి తృప్తి కలిగించుట ధర్మము. ధర్మమార్గమున తృప్తి కలిగించుకొనుట అలవరుచుకొనినచో ఆశ, అభిలాషలు తగ్గుతాయి. అధర్మాన్ని ఆచరించుటకు ప్రధాన కారణము ఆశ, అభిలాషయే. ఆ ఆశను ధర్మానుగుణముగా కలిగించుకొనుట ఇంద్రియనిగ్రహమౌతుంది. వీధిలో ఉన్నపుడు ఆకలైతే ప్రక్కనున్న హోటల్లో తినుట అధర్మము. ఎందరు తినగా మిగిలినదో అది, ఆ ప్లేట్లు ఎంత జాగ్రత్తగా శుభ్రపరిచారో, ఆ కూరలు నేటివా, నిన్నటివా? వడ్డించేవారు ఎంత శుభ్రత పాటిస్తారు? పాటించినట్లు కనపడుతారు? ఇవేవీ పట్టించుకోకుండా ఆకలి తీర్చుకొనుట, కడుపు నింపుకొనుటే ప్రధానమనుకుంటే అధర్మము. అదే కొంత నిగ్రహము కలిగి ఇంటికి వచ్చి అమ్మనో, భార్యనో చేసిన వంటను అది మనకోసం చేసినదే, మనకన్నా ముందు మన కుటుంబసభ్యులు మాత్రమే తింటారు. వేడిగా, శుచిగా, రుచిగా భార్య చేతివంటకు ఏ హోటల్‌లో రుచి సాటి వస్తుంది? హోటల్లో డ్యూటీగా వడ్డిస్తారు. భార్య కాని, తల్లి కాని ప్రేమతో, ఆప్యాయతతో వడ్డిస్తారు. దగ్గర కూర్చొని కమ్మని కబుర్లు చెపుతూ భార్య భోజనం పెడ్తుంది. హోటల్లో మనం నాలుగుసార్లు పిలిస్తే కాని సర్వర్‌ రాడు. ఒక్కసారి ఇంటి భోజనం, హోటల్‌ భోజనంలోని తేడా చూడండి. హోటల్‌ భోజనంలో ఆర్భాటం, ఆడంబరం, షో కపడుతాయి. మసాలాలతో రుచులు చూపుతారు. భార్య చేతిలోని మసాలాకు సాటి వచ్చేదేది? ధర్మమును కొద్దిగా పాటిద్దామనుకుంటే ఇన్ని లాభాలు. మీకు తృప్తి, భార్యాపిల్లలకు మీ ప్రవర్తనతో తృప్తి. ఉద్యోగస్తులు కూడా ఆఫీసుకు భార్య సిద్ధము చేసిన భోజనాన్ని తీసుకొనిపోయి తింటే శుచి, రుచి లభిస్తాయి. కొద్దిగా ఓపిక కావాలి. నిగ్రహం కావాలి. తొందరపాటు తాత్కాలికావేశాన్ని ఆపుకోవాలి. నేను ఆహారములో, వ్యవహారములో ధర్మమునే అనుసరిస్తాను అని ఒక దృఢమైన ప్రతిజ్ఞ తీసుకుంటే ఆ ప్రతిజ్ఞ మిమ్ములను హెచ్చరిస్తుంటుంది. ఇది అలవాటైతే ఇందులోని తృప్తి ఎందులోనూ రాదు. ఇట్లు ఒక పని చేయునపుడు ఒక క్షణము ఆలోచించి, తోచకుంటే భగవానుని ప్రార్థించాలి. భగవాన్‌, నన్ను ధర్మమార్గమునందే ప్రవర్తింపచేయుము అని. తప్పకుండా భగవంతుడు ప్రవర్తింపచేస్తాడు. అడగకున్నా ప్రవర్తింపచేయువాడు భగవానుడే. నేనిలాగే చేస్తాను. నాకిందులో విజయం ప్రసాదించు అంటే అందులోను విజయాన్ని అందిస్తాడు. తరువాత ఆ కర్మ ఫలాన్ని అనుభవింపమని అందిస్తాడు. మనం ఇదివరకే చెప్పుకున్నాము భగవంతుడు అనుమంత అని. అనగా అంగీకరిస్తాడు అని. భగవంతుడు అనుమన్త నియంతగా, ధారకునిగా, సామాన్యముగా దేహమును, ఇంద్రియములను ఇచ్చినవానిగా, అతనిచ్చినవన్నీ అతని ఆధీనములే కావున ఆ దేహేంద్రియములకు శక్తి ఇచ్చినవాడు కూడా అతనే. పుణ్యపాపములతో ప్రవృత్తి అనగా దానికి అనుగుణమైన ఇచ్ఛ, అనుగుణమైన జ్ఞానము. ఆ విషయమున జ్ఞానము లేనిచో కోరిక కలుగదు కదా. కోరిక కలిగితేనే ప్రవృత్తి కలుగును. జ్ఞానము కలిగిన తరువాత కోరిక కలుగుటకు మధ్య ధర్మవిచారము చేయాలి. అపుడు ధర్మబద్ధమైన అభిలాష కలుగుతుంది. ఇచట జ్ఞానము జ్ఞానానుగుణ ఇచ్ఛ కూడా జీవుని అధీనమే. భగవంతుడు కేవలము ఉపేక్షకుడు కదా. పరమాత్మ యొక్క ఉపేక్షకత్వము కూడా పరమాత్మకున్న స్వాతంత్య్రానుగుణమే, స్వేచ్ఛానుగుణమే అని తెలియవలయును. అయిననూ పరమాత్మ కర్మానుగుణముగా ఫలమును ప్రసాదించినట్లైతే పరమాత్మ స్వాతంత్య్రమునకు భంగము కలుగును. స్వాతంత్య్రమునకు భంగము కలుగదు. అది పరమాత్మ ఇచ్ఛానుగుణమే అయినచో పరమాత్మ నిర్దయుడు అనుకోవలసి వచ్చును. పరమాత్మ ఫలమును ప్రసాదించుటకు ఇతర కారణమేది లేనపుడు తన ఇచ్ఛానుగుణమే అయినపుడు అందరికీ సుఖసంతోషాలు ఈయవచ్చును కదా. అట్లు కాక కొందరికి దుఃఖాలు, బాధలు, వ్యాధులు ప్రసాదించుట నిర్దయత్వమును తెలుపదా అనగా తాను ఇట్లు ప్రవర్తించవలయును, ఇది ధర్మము. ఇట్లు ప్రవర్తించకూడదు, ఇది అధర్మము అని కర్తవ్యాకర్త విషయమున తన శాసనరూపముగా శాస్త్రమును అందించి ఉన్నాడు. తన శాసనరూపమైన శాస్త్రమును అనువర్తించువానికి ధర్మార్థకామ మోక్షములతో కూర్చును. తన శాసనమును అతిక్రమించినవానికి ధర్మార్థములకు విరుద్ధమైనవాటిని కూర్చును. ఇచట కర్మ అంటే భగవానుని ఆజ్ఞానుసారము లేక భగవానుని ఆజ్ఞ ధిక్కరణ అని అర్థము. తన ఆజ్ఞను ఉల్లంఘించినవానిని శిక్షించుట అనగా అట్లు శిక్షించి, రక్షించుట, ఆజ్ఞను అనుసరించినవానిని అభ్యుదయ నిశ్శ్రేయసములు ప్రసాదించుట తన స్వాతంత్య్రమునకు అనుగుణమే కాని విరుద్ధము కాదు కదా. ఇచట స్వాతంత్య్రాది వైకల్యము అనగా అదొక్కటే కాదు, దయావైకల్యము అనగా దయ లేకపోవుట, అందరిలో సమదృష్టి లేకపోవుట, కొందరికి ఫలములిచ్చుట, కొందరికీయకపోవుట అను దోషములు ప్రాప్తించును. కాని ఇక్కడ అట్లు లేదు. ఈ కర్మ చేసినవానికి ఈ ఫలము ఇచ్చెదను అని భగవానుడు ధర్మశాస్త్రరూపముగా తన సంకల్పము ప్రకటించుచున్నాడు. అదియే శిక్షాస్మృతియంతా భగవానుని సంకల్పమే. అయితే తన సంకల్పానుగుణముగా ప్రవర్తించుట స్వాతంత్య్రమే కాని స్వాతంత్య్రమునకు భంగము కాదు కదా. స్వాతంత్య్రము సర్వవిధములుగా పరమాత్మయందు పుష్కలముగా ఉన్నది. అపరాధిని శిక్షించు రాజునకు, అపరాధము చేయనివానిని రక్షించు రాజునకు స్వాతంత్య్రము లేదు అనజాలము కదా. భగవంతునికి కూడా ఇదే విధానము అనుసరించబడును. అయితే శాసనమును అతిక్రమించువానిని శిక్షించుటలో స్వామి నిర్దయత్వము ప్రసక్తమగును కదా అనగా మొదట దయ అంటే యేమిటో తెలియుడు అనుచున్నారు భగవద్రామానుజులు. ‘దయాహి నామ స్వార్థనిరపేక్షాపర దుఃఖ అసహిష్ణుత’ అనుచున్నారు. అనగా స్వార్థమును అపేక్షించకుండా పరుల దుఃఖములను సహించజాలకుండుట. చాలామంది తన లాభమును, ప్రయోజనమును చూచుకొనుచు ఆ లాభమును పొందుటకు ఎదుటివారి దుఃఖాన్ని తొలగించాలని ప్రయత్నిస్తారు. అది వ్యాపారమే కాని దయ కాదు. తన స్వార్థమేమాత్రము లేకుండా ఎదుటివారి దుఃఖాన్ని సహించజాలకుండుట దయ అనుచున్నారు. ఇటువంటి దయను తన శాసనమును అతిక్రమించినవానిపై కూడా చూపితే అది స్వామికి గుణమును కలిగించదు. దోషమునే కలిగించును. తన శాసనమును ధిక్కరించినవానిని కూడా దయ చూపితే ఇక శాసనమెందుకు? శాస్త్రమెందుకు? అపుడు ధర్మశాస్త్రము వ్యర్థము కావలసివచ్చును. దోషమును అనగా తన శాసనమును అతిక్రమించినవానిని శిక్షించుటయే ఇక్కడ స్వామికి గుణమే. అట్లు అధర్మమును ఆచరించినవానిని శిక్షించి, వానిని అధర్మమువలన కలుగు పాపమునుండి కాపాడుట రక్షణే అవుతుంది కాని శిక్ష కాదు. కావున అధర్మాత్ముని శిక్షించి, రక్షించుట నిజమైన పరదుఃఖ అసహిష్ణుత అనగా నిజమైన దయ అన్నమాట. ఇచట తనవలన వేతనాదులను తీసుకొని తమకు సేవ చేయుచున్నవారికి యేమైనా ఆపద కలిగినచో స్వామి ఆ ఆపదను తొలగించుట అతనికి ఆపద కలిగితే తన సేవకు అడ్డంకి యేర్పడుతుంది అని ఆ ఆపదను తొలగించుట దయ అనిపించుకోదు. తన సేవకు అడ్డు తొలగించుకొనుచున్నాడు కావున స్వార్థమే అవుతుంది. యజమాని కర్తవ్యములోనే చేరుతుంది. ఇచట పరమాత్మ శిక్షించుట అనగా తన శాసనమును అతిక్రమించవలయునని సంకల్పించి ఆ సంకల్పానుగుణముగా అతను చేయు ప్రయత్నమును అనగా ప్రవృత్తిని అడ్డంకి కలిగించి ఆ ప్రయత్నమును నివర్తింపజేసి, అనాది అనన్తములైన కల్పములలో సంపాదించుకొనిన సహింప శక్యము కాని అనన్తమైన అపరాధములను అంగీకరించక దానికి ప్రాయశ్చిత్తరూప పరిహారములను అనగా దుఃఖములను, శిక్షలను, వ్యాధులను ప్రసాదించి అతని పాపనివృత్తి చేసి అటువంటివానికి నిరతిశయమైన సుఖమును వృద్ధిచేయుటకొరకు స్వామి చేయు ప్రయత్నము దయాకార్యమే అగును కాని నిర్దయకార్యము కాదు. ఈ విషయమును భగవానుడు స్వయంగా గీతలో ఇట్లు చెప్పియున్నాడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement