ఇక దున్నపోతులు నిలబడి తింటుంటాయి. అనగా పశువులకు కూర్చొని తినే అవకాశము లేదు. పశువులకు అన్నీ ఒక చోట కూర్చుకొని వడ్డించుకొనే అవకాశము లేదు. గడ్డి, గరకు ఇతర పదార్థములు ఆయా ప్రాంతాలలో ఉంటాయి. అవి నిలబడి ముందుకు నడుస్తూ దొరికిన చోట దొరికినదాన్ని తింటుంటాయి. అనకూడదేమో కాని ఈనాడు మానవులు కూడా నిలబడే తింటున్నారు. వారు కూడా ఒక చోట భుజించలేరు. ఒక చోట పండ్లు, ఒక చోట స్వీట్లు, ఒక చోట ఐస్‌క్రీము, ఒక చోట అన్నము, కూరగాయలు పేర్చి ఉంచుతున్నారు. వారు ప్లేటు చేతితో పట్టుకొని అలా నిలబడి నడుచుకుంటూ అక్కడక్కడ దొరికినవాటిని తీసుకొని పెట్టుకొని తింటుంటారు. దానికే బఫే అంటున్నాము. కాని అది బఫెల్లో పని. ఇలా తినటము కూడా అధర్మమే. పాపమే. తినే పదార్థము మీద మనసు పెట్టకుండా కబుర్లు చెప్పుకొంటూ పదిమందితోపాటు మనమే వడ్డించుకొని అలా నడుస్తూ నిలబడి తినటము ఎవరి పని? అందులో తృప్తి ఉందా? సంతోషమున్నదా?
శుభ్రంగా కూర్చోపెట్టి పచ్చని అరటి ఆకులో నెయ్యితో మొదలుపెట్టి తీపి, పప్పు, కూర, చట్నీ, పులుసు, పెరుగు, భక్ష్యాలు, లడ్డూలు తీసుకొచ్చి ఒక్కొక్కరిని అడిగి కొసరి కొసరి వడ్డిస్తుంటే చేసే భోజనము మానవుల భోజనము. నీకేం కావాలో వడ్డించుకో, ఎంత కావాలో వడ్డించుకో, తింటే నీ ఇష్టం, తినకుంటే నీ ఇష్టం అనేది ఈనాటి విందు. కూర్చుని భోజనం చేస్తుండాలి. భోజన ప్రారంభంలో హరినామస్మరణ, భోజన మధ్యలో హరినామస్మరణ, భోజనాంతరములో హరినామస్మరణ. అలా అందరూ పంక్తిలో కూర్చొని ఒక పద్ధతి ప్రకారం తృప్తిగా భుజించాలి. పంక్తిలోనివారు అందరూ భుజించిన తరువాతనే అందరూ అయినది అన్న తరువాతనే అందరూ ఒక్కసారే లేచి వెళ్ళి దగ్గరలో ఉన్న చెట్ల వద్ద చేతులు, కాళ్ళు కడుక్కుంటారు. ఆ నీళ్ళతో చెట్లు బ్రతుకుతాయి. చిగురిస్తాయి. పంక్తిలో యే ఒక్కరు భుజించుచున్నా అయినవారందరూ అతని కోసం ఆగుతారు. ఒకరు తింటుండగా ఇంకొకరు పరిషేచనము పట్టి లేస్తే, పట్టకుండానో లేస్తే, ఆ తింటున్నవారు లేచినవాని ఎంగిలిని తింటున్నారు అని శాస్త్రము చెప్పుతుంది. భోజనము చేయుటలో ఇంత ప్రక్రియ ఉంది. ఇది ధర్మశాస్త్రము. ఇలా భోజనం చేస్తే ధర్మము, పుణ్యము, ఇంద్రియ తృప్తి అంటే కమ్మని భోజనముతో ఇహము, ధర్మపద్ధతితో పరము రెండూ లభిస్తాయి. ఇది భగవంతుడిచ్చిన ఇంద్రియములను, భగవంతుడు ఇచ్చిన పదార్థములతో భగవంతుడు చెప్పిన శాస్త్ర మర్యాదను అనుసరించి అనుభవించి ఇటు మన ఇంద్రియాలకు, శరీరమునకు తృప్తి కలిగించి, ధర్మమును ఆచరించుట వలన భగవంతునకు తృప్తి కలిగించుట.
(సశేషం)