‘దృష్ట్యా ఖాదన్తిదే వాస్తు
సంకల్పేన మహర్షయః
తిష్ఠన్ చరన్తి మహిషాః
ఉపవిశ్యతు మానవాః’
అనునది స్కాందపురాణము. దేవతలు చూపుతోనే భక్షించెదరు. మహర్షులు సంకల్పముతోనే భక్షించెదరు. దున్నపోతులు నిలబడి తింటాయి. మానవులు కూర్చొని తింటారు అని అర్థము. దేవతలు మనవలె పదార్థాలు వడ్డించుకొని కలుపుకొని భుజించరు. అట్లు దేవతలు భుజించినచో ఇక మానవులకు, ఇతర ప్రాణులకు తినటానికి ఏమీ మిగలవు. మనం అన్ని సిద్ధము చేసి భగవంతుని ముందు పెడ్తే ఆ భగవంతుడు ఒక్కసారి చూస్తాడు. చూపుతోటే తింటాడు. తృప్తి పొందుతాడు. భారతీయ ధర్మశాస్త్రము సర్పాలను కూడా దేవతలే అని చెప్పినది. అందుకే పుట్ట ముందర పాలు పెట్టడం, పుట్టలో పాలు పొయ్యటము. సర్పాలు చూచి తృప్తి పొందుతాయి. చూడటమే వాటికి భక్షణము. అందుకే ఆరగింపు చేయుటలో అంతరార్థమిదియే. ఇక మహర్షులు సంకల్పముతోనే భక్షించెదరు. మనము కథలు చదువుతుంటాము. వింటుంటాము. వెయ్యేళ్ళకోసారి, నూరేండ్లకోసారి ఋషులు తపస్సు ఆపి భుజిస్తుంటారు. నూరేండ్లు ఆహారము లేకుండా ఎలా బ్రతుకుతారు? ఇవన్నీ కట్టుకథలు అని అంటుంటారు. వారు తపస్సులోనే ప్రతి రోజూ ఒక సమయములో నేను ఫలానా పండ్లను భుజించుచున్నాను అని సంకల్పించుకొంటారు. ఆ సంకల్పంతోనే వారికి ఆ ఆహారము అందుతుంది. అలా ఒక వంద సంవత్సరాలో, వేయి సంవత్సరాలో అయిన తరువాత ఋషులు తమ మానవత్వాన్ని తలచుకొని ఒక రోజు సామాన్య మానవులలాగా అన్ని పదార్థాలు వడ్డించుకొని చక్కగా కూర్చొని తింటారు. అన్నింటి కంటే గొప్ప శక్తి సంకల్పానిదే కదా! మన సంకల్పమును అనుసరించియే మనం ఆయా కార్యక్రమములను ఆచరిస్తూ ఉంటాము. సంకల్పబలము ఎంత దృఢంగా ఉంటే పనులు అంత ఫలవంతములౌతాయి. అలా ఋషులు సంకల్పంతో భుజిస్తుంటారు.
(సశేషం)