Tuesday, October 22, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

రక్షణలో స్వామి ఔదార్యం: ఇక ఇపుడు రక్షణలో స్వామి ఔదార్యమును చూద్దాం. అంటే తెలుసుకుందాం. అసలు రక్షణే ఔదార్యము కదా! అన్నీ నేను చూచుకుంటున్నాను అని అంటున్న మనం రక్షణ ఆయనకు వదిలేస్తున్నాము. మనము చేయలేని పనులు ఆయనను చేయమంటున్నాము. అసలు మనం చేయగల పనేదైనా ఉందా? మనకు కావలసినదాన్ని ఆయన దయ లేకుండా సాధించుకోగలమా? ఆయన దయవలన పొందిన దానిని మనకు మనముగా రక్షించుకోగలమా? మళ్ళీ ఆయన దయే కావాలి. ‘యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై’ అంటుంది వేదం. అనగా పరమాత్మ బ్రహ్మను సృష్టించి అతను సృష్టి చేయుటకు సాధనంగా అతనికి వేదములను ప్రసాదించాడు. ఈ వేదములను ముందు పెట్టుకొని జగత్సృష్టిని చేయమని చెప్పాడు. అంటే వేదములలో సకల జగత్‌ సృష్టి విధానము దాగివున్నదన్న మాట. ఈనాటివారు ఏముంది వేదాలలో అంటున్నారు. అసలు అలా అన్నవారు వేదాలను అధ్యయనం చేశారా? ఒక అనువాకము కనీసం ఒక్క మంత్రం చదివారా? దాన్ని చదవకుండా దాన్ని చూడకుండా ఏముంది అందులో అంటున్నా స్వామి క్షమిస్తున్నారు. ఇది ఔదార్యం కాదా!

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement