ఇంద్రియాలను తృప్తిపరిచే ప్రయత్నమే పాపము. ఇక్కడ కూడా ఒక చిన్న రహస్యమున్నది. ధర్మమార్గములో ఇంద్రియాలకు తృప్తి కలిగించుటయే పుణ్యము. నాలుక రుచిని కోరుతుంది. అందులో ఇవి తినదగినవి, ఇవి తినదగనివి అని ధర్మశాస్త్రము చెపుతుంది. ధర్మశాస్త్రము తినదగినవాటిని తిని ఇంద్రియములకు తృప్తి కలిగించటము పుణ్యమే అవుతుంది. ఇంకా ధర్మశాస్త్రము ఆమోదించిన వస్తువులను కూడా అనుభవించే ముందు భగవంతునికి అర్పించి స్వామీ! ఇవి నీవు ప్రసాదించినవే. నీ అనుగ్రహంతో పొంది, నీకే అర్పించి నీవు స్వీకరించి, ఇంకా చెప్పాలంటే అనుభవించి మిగిల్చినవాటిని స్వీకరించటం భగవత్ప్రసాదాన్ని స్వీకరించటమే అవుతుంది. అంటే భగవంతుడు ఇచ్చిన ఇంద్రియములను భగవంతుడు ఇచ్చిన భోగ్య పదార్థములతో భగవంతునికి అర్పించి కృతజ్ఞతను ప్రకటించి భగవంతుడు ఆమోదించినవాటిని ఇంద్రియాలకు అందించటం ఇంద్రియాలకు తృప్తి కలిగించటమే కదా! మనం ఇంట్లో చేసుకొనే పదార్థాల కంటే దేవాలయంలో పులిహోర, దధ్యోదనము, శర్కరపొంగలి, క్షీరాన్నము, మినపవడలు ఎంత రుచిగా ఉంటాయో తెలుసు కదా! ఆ రుచి ఇంట్లో వాటికి ఎందుకు రాదు? భగవంతుడు ఆరగించగా మిగిలినదానికి ఆ రుచి అలవడుతుంది. అందుకే తిరుపతి లడ్డూలను ఇతర దేవాలయాలలో లడ్డూలను, వడలను డబ్బులిచ్చి కొనుక్కుని మరీ తింటాము. ఇది ఇంద్రియములకు తృప్తి కాదా? మళ్ళీ ఇక్కడ కొందరి ఆక్షేపాలు. దేవుడు తింటాడా, దేవుడు తింటే మనకు మిగులుతుందా అని. అంతేకాదు నాగులచవితి, నాగులపంచమి రోజులలో సర్పములకు పాలు పోస్తుంటే పాములు పాలు తాగుతాయా? వాటికి పెదవులు లేవు. పెదవులు లేనివి త్రాగలేవు అని ఆక్షేపణ చేస్తుంటారు. తామనుకున్నదే శాస్త్రము, తమకు తెలిసినదే ధర్మము అని వితండవాదము చేస్తారు. ఇది మహర్షులు చెప్పినది. మహర్షు కంటే మనకు ఎక్కువ తెలుసు అనుకోవటము, మన కంటే మహర్షులకు తక్కువ తెలుసు అనే భావనలో ఉండి ఈ వాదనలను చేస్తుంటారు. కాని అట్లు వాదించేవారికి ధర్మశాస్త్రము తెలియదు. ధర్మశాస్త్రము తెలియకుండా తాము మాట్లాడేది శాస్త్రీయము అంటారు. ధర్మశాస్త్రమును తెలిసినవారి మాటలను సిద్ధాంతాలను అశాస్త్రీయములు అంటారు. ఇది మరో వింత.
(సశేషం)