Thursday, January 2, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక్కడ పుణ్యపాపములలో జీవునికి ప్రవృత్తి ఆ పుణ్యమునకో, పాపమునకో అనుగుణమైన ఇచ్ఛతోనే. ఇచ్ఛ కలగాలంటే జ్ఞానం కలగాలి. జీవునకు జ్ఞానమును ప్రసాదించువాడు భగవంతుడే. ఆ జ్ఞానము ఇచ్ఛను కలిగించును. ఇచ్ఛ ప్రయత్నము చేయును. ఆ ప్రయత్నము సఫలమో, విఫలమో నిర్ణయించేది భగవానుడే. ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది పుణ్యము, ఇది పాపము అని శాస్త్రము చెపుతుంది. శాస్త్రాధ్యయనము వలన సద్గురు బోధ వలన పెద్దల ఉపదేశముల వలన ధర్మాధర్మ జ్ఞానము కలుగుతుంది. అట్లు జ్ఞానము కలిగిన తరువాత ప్రవృత్తి ధర్మవిషయములోనా? అధర్మ విషయములోనా? అది ఇచ్ఛానుగుణము. భగవంతుడిచ్చిన ఇంద్రియములను తృప్తి పరచాలంటే అధర్మప్రవృత్తిలో ఇచ్ఛ గలుగును. ఇంద్రియములను ఇచ్చిన భగవంతుని తృప్తి పరచాలంటే ధర్మమార్గ ప్రవృత్తిలో ఇచ్ఛ కలుగుతుంది. ఇంద్రియములు, శరీరములు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవు. ఈ రోజున కోరిన ఇంద్రియములే మరొక రోజు నాకొద్దు అని విసరివేయును. ఇచ్ఛ క్షణానికొక రీతిగా మారిపోతుంది. అట్లు మారుతూ పోయే ఇంద్రియాలను తృప్తి పరచే ప్రయత్నం చేయటం కంటే ఆ ఇంద్రియాలను ప్రసాదించిన సనాతనుడు, శాశ్వతుడు, సత్యస్వరూపుడు, నిత్యస్వరూపుడు అయిన పరమాత్మను తృప్తి పరచే ప్రయత్నమే పుణ్యము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement