Wednesday, January 1, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక్కడ జీవుడు పరమాత్మ ప్రదానము చేసిన శక్తి కలవాడై అతను అనుగ్రహించిన దేహము ఇంద్రియములు కలవాడై ఆ పరమాత్మనే ఆధారముగా చేసుకొని స్వయముగా తానే స్వేచ్ఛానుగుణముగా పుణ్యాపుణ్యకర్మలను ఆచరించును. దేహము పరమాత్మ ఇచ్చినదే. కన్ను ముక్కూ చెవులు మొదలగు ఇంద్రియములు పరమాత్మ ప్రసాదించినవే. ఆ దేహమునకు ఇంద్రియములకు ఆయా కర్మలను చేయు శక్తి ఈశ్వరుడు ప్రసాదించినది. ఏ ఇంద్రియమును దేనికై ఉపయోగించుకోవాలి అని ఆలోచించే బుద్ధి ఈశ్వరుడు ప్రసాదించినదే. ఈ పని చేయవలయును, ఈ పని చేయకూడదు అని సంకల్పించు మనస్సు భగవానుడిచ్చినదే. ఇట్లు భగవానుడు ప్రసాదించిన సాధనములతో తనకు నచ్చినవాటిని చేయటము న్యాయమా? భగవానుడు చెప్పినవాటిని చేయుట న్యాయమా? అన్నీ నీనుండి తీసుకుంటాను. నాకు నచ్చినది చేస్తాను అన్నా స్వామి వెంటనే శిక్షించకుండగా ఉపేక్షించుట గుణమా? దోషమా? దయాకార్యము కాదా! అందులో తాను ఇచ్చినవాటితో తాను చెప్పిన శాస్త్రమును చదివి ధర్మమును భగవానుని ఆజ్ఞను తెలుసుకొని తదనుగుణముగా ప్రవర్తించువారికి ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించి వృద్ధిని పొందింపచేయును. మనము చేయుచున్న పనులను అనుమతించునది అతనే, ఈ పనులను చేయుము, ఈ పనులను చేయకుము అని నియమించునది అతనే. అన్నిటిని అన్ని శక్తులను ప్రసాదించువాడు అతనే. అందరినీ ధరించువాడు అతనే. దేహేంద్రియములను ప్రసాదించినవాడు అతనే. అందువలన అంతా ఆ పరమాత్మాధీనమే. కావున కార్యములను ఆచరించు శక్తులను కూడా ఆ పరమాత్మే ప్రసాదించును. మంచిపని చేయువారికి ఆ శక్తిని, చెడుపని చేయువారికి ఆ శక్తిని ఇచ్చువాడు ఆ పరమాత్మయే. అతను కేవలము సాక్షి.ఉపేక్షకుడు, అనుమంత ప్రేరకుడు. అతనికి దేనితో సంబంధము లేదు. అన్నిటిని, అందరిని ప్రవర్తింపచేయువాడు అతనే.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement