Sunday, December 29, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

రాజులు తప్పు చేసినవారిని శిక్షించుట అనునది అక్కడ రాజులు కూడా శాస్త్రవశ్యులైన జీవులే. తప్పు చేసినవారు శాస్త్రవశ్య జీవులే కావున అది తప్పదు. ఇక్కడ శిక్షించు పరమాత్మ శాస్త్రవశ్యుడు కాదు కదా! రాజు దండిరచవలసినవారిని దండిరచనిచో రాజు శాస్త్రాతిక్రమణముతో నరకమును పొందును. కాని భగవంతుడు శాస్త్రవశ్యుడు కాడు. అతనికి దోషము అంటదు అంటే దోషము భగవంతునికి అంటదు. కాని దోషము చేయనివానికి చేయాలి అనే ప్రేరణ కలిగించును. శాస్త్రమును ప్రవర్తింపచేసిన భగవానుడే శాస్త్రమును అనుసరించనిచో ఇంకా మాకు శాస్త్రమెందుకు అని ఇతరులు కూడా శాస్త్రమును అనుసరించకపోవుదురు. అందువలన భగవంతుడు శాస్త్రవశ్యుడు కాకున్ననూ శాస్త్రవశ్యులైన జీవులను శాస్త్రవశ్యునిలా ఉండుటకు తాను ప్రవర్తింపచేసిన శాస్త్రమును తాను కూడా అనుసరించవలయును. ఆ మాటయే గీతలో భగవానుడు స్వయముగా చెప్పియున్నాడు. ‘ఉత్సీదీయురిమే లోకాః న కుర్యాం కర్మచేదహ’ అని. నేను కర్మను చేయనిచో ఈ లోకము చెడిపోవును అనుచున్నాడు. ‘మమవర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః’ అని కూడా చెపుతున్నారు. మనుష్యులు అందరూ నా దారినే అనుసరించెదరు అనుచున్నారు. కావున జీవులను శాస్త్రోక్తముగా ప్రవర్తింపచేయుట కొరకు తాను కూడా శాస్త్రమును అనుసరించియే తీరవలయును. రాజులు తప్పు చేసినవారిని క్షమించుట కూడా శాస్త్రవశ్య ప్రక్రియయే కదా! అనగా నేరముల స్వరూప స్వభావములనుబట్టి నేరమును చేసినవారిని కొంత శిక్షించి, కొంత క్షమించి వారిని నిష్కల్మషులను చేయును భగవంతుడు. ఇదంతా భగవానుని ఔదార్యమే కదా! అందువలన నిగ్రహించుట గుణము నిగ్రహించకపోవుట దోషము అగును. అందువలన అనుమతించుట దోషము ప్రేరేపించుట దోషము అనుటకు అవకాశము లేదు. అవి కూడా సందర్భమును బట్టి నిగ్రహించకపోవుట కూడా గుణము కావచ్చును.
నివారించగల సామర్థ్యము ఉన్న ఈశ్వరుడు ఉపేక్షించుట దోషము కాదా! అక్కడ ఈశ్వరుడు ఉపేక్షించడు. అచట వారిచే శాస్త్రమున ప్రవర్తింపచేసి సామాన్యముగా అహితకరమైన కార్యములనుండి నివర్తింపచేయుచుండును. మరి అయిననూ జీవుడు అట్లే అహితములయందు ప్రవర్తించుచున్నపుడు నివారించకుండా ఉండుట ఆ రూపములో ఉపేక్షించుట భగవానుని స్వాతంత్య్రమును తెలియజేయును. అటువంటి స్వాతంత్య్రము దోషము కాదా అనగా అది దోషము కాదు. కొన్ని పనులు ఎంతటివారైనా నివారించితే మానరు. ఆ పని మీద దానివలన వారు అనుకున్న ఫలితము మీద వారికున్న కాంక్ష అటువంటిది. అటువంటపుడు వారు చేసిన పనికి వారు కోరుకున్న ఫలితము రాదు. దానికి విపరీతమైన ఫలితము కలుగుతుంది అని చెప్పితే వారికి అర్థము కాదు. అటువంటపుడు ఆ దుష్ఫలితమును వారు అనుభవించితేనే తెలుస్తుంది. అందుకే ఒకసారి వారికి ఆ ఫలితాన్ని రుచి చూపుతారు. అపుడు వారు సహజంగా మానుతారు. అందువలన ఈ ఉపేక్షకత్వం జీవులు బాగుపడాలి అను వాత్సల్యము చేతనే చేయును కావున అది దోషము కాదు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement