మనం కోరి ప్రార్థిస్తే మన కర్మకు అనుగుణముగా ప్రసాదిస్తాడు. ఆపద ఆయనే, సంపద ఆయనే ఇస్తాడు. విధి రెండు కాళ్ళు తీసేస్తే ధైర్యంతో కట్టెకాళ్ళతో విధినెదిరించి బ్రతుకును గడుపుచున్నాడు అని పెద్ద వార్తలు. రెండు కాళ్ళు విధి తీసేస్తే కట్టెకాళ్ళు మాత్రం విధి ఇచ్చినవి కావా? కొద్దిగా ఆలోచించాలి. ఆయన మన మిత్రుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ ఆయనే. ఆయనను పూజించేది, సేవించేది ఆయన ఔదార్యము చూచే. నామరూపాలు లేని ఆత్మకు కరచరణాది అవయవాదులను మనుష్య దేవ పశు పక్షి రూపాదులను ప్రసాదించి కర్మానుగుణంగా ఫలితాల్నిస్తూ మనని కర్మలను చేయమని చెప్పటానికి మనకోసం తానే వచ్చి మన మధ్యలో తిరుగుచు మన కర్మలు అతిగా బాధించుచున్న అతను ఉదారుడు కాడా? ఇట్లు సకల క్షేత్రజ్ఞులకు కరచరణాది అవయవములనిచ్చి వాటితో చేయవలసిన పనులను, చేయగూడని పనులను తెలుపుటకు స్వశాసన రూపముగా శాస్త్రమును అవతరింపచేసినవాడు ఉదారుడు కాడా! అంతేకాదు తన శాస్త్రాన్ని అనగా శాసనాన్ని ఆచరిస్తున్నాడా లేదా అని మనకు అంతరాత్మగా ఆయనే లోన ప్రవేశించి మనం కొద్దిగా ప్రార్థిస్తే పెద్దగా సహకరించేవాడు ఉదారుడు కాడా? అడుగడుగునా ఇలా చేయరాదు. ఇలా చేయవలయును అని అంతర్యామిగా ప్రేరణను కలిగించుచునే ఉంటాడు.
(సశేషం)