‘యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధ యార్చితుం ఇచ్ఛతి
తస్య తస్యా చలాం శ్రద్ధాం తామేవ దధామ్యహమ్’ అని.
అందుకే ఏదైనా ఒక పేరుమీద ఒక రూపుమీద దైవ ధ్యానం చేసి ఆరాధించండి. ఆ స్వామి తప్పక కటాక్షిస్తాడు. ఆండాళ్ అనగా గోదాదేవి అర్చామూర్తిని అనగా విగ్రహాన్నే దైవంగా విశ్వసించి నిష్ఠతో భక్తిశ్రద్ధలతో ఆరాధించినది. ఆ స్వామిని చేరుకున్నది. దైవము అంటే జీవుల పుణ్యపాపములను పరిశీలించి వాటికి తగిన ఫలితాన్నిచ్చేవాడే అని ఎవరినీ బాధించేవాడు కాదు, సాధించేవాడు కాడు. చాలామంది పామరులు, కొందరు కవులు, పండితులు కూడా భగవంతుడు సాధిస్తున్నాడు, కక్ష సాధిస్తున్నాడు అని మాట్లాడుతుంటారు. కక్ష పగసాధన యెపుడుంటుంది. మీవలన అతనికి అపకారమో, హానియో జరిగితే కదా! అతనికి రావలసినదానికి, కావలసినదానిని మీరు తీసుకుంటేనో కలుగుతుంది. ఆ పరమాత్మకు హాని చేయగలరా? హాని అంటే యేమిటి? శరీరమునకు, శరీరమునకు సంబంధించినవారికి చేటు కలిగించటం అంటే మనసును బాధించటం, ఆ శరీరానికి బాధ కలిగించే అంటే గాయం చేయాలి. గాయం బాధ అనేది పాంచభౌతికమైన శరీరమునకు మాత్రమే సంభవము.
ప్రకృతిలోని పంచభూతాలు కొన్ని చోట్ల ఎక్కువ మోతాదులో ఉంటాయి. మరికొన్ని చోట్ల తక్కువ మోతాదులో ఉంటాయి. మాంసములో పృథివీ భాగమెక్కువ ఉంటుంది. రక్తములో జలము భాగమెక్కువ ఉంటుంది. మాంసాన్ని ఖండిరచటమో, రక్తాన్ని క్షీణింపచేయటమో, కన్ను ముక్కు కాలో తీసేయటమో కదా చేయాలి. లేక మన బంధువులకు ఇలాంటి హానిని కలిగించటము. మరి ఆ భగవంతునికే మనకుండే ప్రాకృత శరీరము లేదు. కర్మల వలన వచ్చేది ప్రాకృత శరీరము. ఆయన ఏ కర్మలు, ఫలములు కోరి చేయడు. జగచ్ఛాసనము కూడా ధర్మమని చేస్తాడు, ఫలము కోరి కాదు. ఆయనకుండేది అప్రాకృత దివ్యదేహము. అది ఇదమిత్థంగా ఉండదు. కోరుకున్న రూపును, కోరుకున్నపుడే తీసుకుంటాడు. ఈ శరీరమే లేదు కావున శరీరము కొరకు, శరీరము వలన వచ్చే బంధువులూ ఉండరు కదా! అంతేకదా! శరీరం కోసం వచ్చేది భార్య. శరీరం వలన వచ్చేవారు బంధువులు, మరి శరీరము లేక, బంధువులు లేనివారికి మిత్రులు ఎందుకుంటారు? వీరెవరూ లేనివానికి కోరికలెందుకుంటాయి. కోరికలు, ఆశలు తనకోసమో, తన మంచికోసమే కదా! ఆయనకివేవీ లేనపుడు శత్రువులు, మిత్రులు అనే భావన కాని, పగ వగ అనే భావన కాని ఎందుకుంటాయి.
(సశేషం)