ఇల్లు వాకిలి, భార్యాపిల్లలు, సంపదలు, భోగాలు కోరేవారు అమాయకులు, అజ్ఞానులు అంటుంది వేదము. ఇలా ఎన్ని రోజులు కాదు కాదు ఎన్ని జన్మలు, కాదు ఎన్ని కోట్ల జన్మలు చార్జి చేసుకుంటుంటారు? ఒకసారి చేసుకుంటే ఎప్పటికీ ఉండే చార్జి పరమాత్మ ఆరాధన. ఉపనిషత్తులు జీవుని దేవతలకు అన్నము, భోగ్యము అంటాయి. అన్నము అంటే జీవుని తినుట కాదు, తినుట వలన కలిగేది తృప్తి. జీవులు తమకు సేవచేస్తే వారికి తృప్తి కలుగుతుంది. ఈ లోకములో యజ్ఞయాగాది పుణ్యకర్మలను ఆచరిస్తే వారి సేవకు సంతోషించి వారికి వర్షములు, పాడిపంటలు, ధనధాన్యములు ప్రసాదిస్తారు. వాటిలో మళ్ళీ పుణ్యకార్యములు చేస్తే మళ్ళీ ఇస్తుంటారు. ఇలా చేస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటారు. చేయలేదు, ఈయరు. వర్క్ చేస్తేనే వేతనము. నో వర్క్ నో పే. అది పుణ్యము అంటే. ఇలా ఇంకా గొప్ప యజ్ఞములు చేస్తే తమ లోకాలకు రప్పించుకుంటారు. అనగా స్వర్గము, వరుణలోకము, చంద్రలోకము, కుబేరలోకము, వాయులోకము… ఇలా అక్కడ అన్ని భోగాలు ఇస్తారు. తమతో సమానంగా సుఖభోగాలను ఇస్తారు. అవి అనుభవించుకుంటూ, వారికి సేవ చేస్తుండాలి. అందుకే ఇలా తమను సేవిస్తుంటే దేవతలు సంతోషించి తృప్తిని పొందుతారు. ఇలా తృప్తి కలిగించేది అన్నమే కావున జీవులు దేవతలకు అన్నము, భోజనము అన్నారు.
ఇంకా చెప్పాలంటే ‘యజ్జీయోపశుర్యధా’ అంటుంది వేదము. పశువు పాలిస్తుంది. దుక్కి దున్నుతుంది. నీరు పెడ్తుంది. బండి లాగుతుంది. దాన్ని యజమాని ఆహారము, ఆవాసము ఇచ్చి బాగా చూసుకుంటాడు. అది చేసే సేవకు సంతోషిస్తాడు. అట్లే మనము చేసే సేవకు దేవతలు సంతోషిస్తారు. ఫలితాన్నిస్తారు. ఇంకా పశువే మేలు అంటారు. ఎవరు తనను పోషిస్తున్నారో వారిని ఒక్కరిని మాత్రమే సేవిస్తాయి. పక్కవారిని కన్నెత్తి కూడా చూడవు. చాలా పశువులు ఒక్కరినే సేవిస్తాయి. కాని ఒక్క మనిషి చాలామంది మనుషులను, చాలామంది దేవతలను కూడా ఆరాధిస్తారు. భక్త్యాత్వనన్యయా అనన్య భక్తితో ఒక్కరినే దైవాన్ని ఆరాధించాలి. అప్పుడే ఉత్తమ ఫలితాన్ని పొందుతారని భగవానుడు భగవద్గీతలో ఇతర పురాణాలలో అంతగా చెప్పినా అది మన చెవికెక్కదు.ఆపదలో ఉన్నపుడే దైవం గుర్తొస్తాడు. ఆ గుర్తు కూడా ఆపద తొలగించటానికే. అపుడు ఏదేనొక పేరు ఎవరు చెపితే, ఏ పూజ చెపితే ఆ పూజ చేస్తారు. తన ఆపద పోవాలి అంతే. అయినా యే దైవమైనా ఆపద తొలగిస్తాడు కదా! ఇందరినెందుకు ఒకేసారి ఆరాధించాలి అంటే తాను మొదట పూజించిన దైవం మీద నమ్మకం లేదనే ఇంకొక దైవాన్ని ఆరాధిస్తారు. భక్తి కంటే ముందు విశ్వాసం నింపాలి. నమ్మకంతో కొలిస్తే చెట్టుకాని, గుట్ట కాని, పాము కాని, మృగము కాని అభీష్టాన్నిస్తుంది. అంతా దైవమే కదా! అంతా దైవస్వరూపమే. మనము పేరు మార్చినా, రూపము మార్చినా ఆ దైవశక్తినే ఆరాధిస్తున్నాము. నీవే రూపుతో, ఏ పేరుతో ఆరాధిస్తే ఆ రూపుతోనే, ఆ పేరుతోనే తానుండి మీరు చేసే ఆరాధనలను అందుకుంటాడు. అంతేకాదు ఆ రూపుగల దైవము యందే మీకు భక్తిశ్రద్ధలను కలిగిస్తానని ఆ స్వామియే గీతలో చెప్పియున్నాడు.
(సశేషం)