Sunday, December 22, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

పుణ్యపాపములు
కావున ఇట్లు భగవానుడు పుణ్యపాపములకు ప్రయోజయిత కాజాలడు. అనగా పుణ్యపాపములను చేయుటకు తాను ప్రోత్సహించడు. పుణ్యములను పాపములను మనము చేయుచుంటే ఉదాసీనముగా ఉంటాడు. ఇక మనం ఇలాగే చేయాలని నా కోరిక నీవు ఆమోదించు అనుగ్రహించు అని ప్రార్థిస్తే స్వామి నవ్వుకుంటాడు. ఏమి అడగాలో, ఎలా అడగాలో కూడా తెలియనివాడు అనుకుంటాడు. అనుగ్రహిస్తే అనుగ్రహించదలచుకుంటే పాపములను ఆమోదించకూడదు. పుణ్యములను కూడా ఆమోదించకూడదు. పుణ్యములను ఆమోదించకపోవటమేమిటి అంటావా, పుణ్యకార్యములు అనగా యజ్ఞయాగాదులు, దానధర్మాలు, చెరువులు, బావులు త్రవ్వించుట, సత్రాలు కట్టించుట ఇవి అన్నీ స్వామి చెప్పినవే, శాస్త్రములు విధించినవే. అయితే ఇవన్నీ కొందరు దేవతలు సంతోషించటానికి, దానికి వారిచ్చే ఫలాన్ని పొందటానికి మాత్రమే పనికొస్తాయి కాని ఆత్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి పనికిరావు.
మనము యజ్ఞయాగాలు, దానధర్మాలు చేసి ఇంద్ర వరుణ అగ్ని యమ నిర్‌ఋతి మొదలగు దేవతలను సంతోషింపచేస్తాము. ప్రతి దేవత ఒక్కొక్క ఫలమునిస్తాడు. ఊర్వశిని సేవిస్తే అందమైన భార్య లభిస్తుంది. నలకూబరుని సేవిస్తే అందమైన భర్త లభిస్తాడు. అగ్నిహోత్రుని ఆరాధిస్తే సంపదలు వస్తాయి. శంకరుని ఆరాధిస్తే జ్ఞానము కలుగుతుంది. విశ్వకర్మను ఆరాధిస్తే మంచి ఇల్లు లభిస్తుంది. ఇవన్నీ పుణ్యకర్మలే. కాని స్వర్గ మర్త్య పాతాళలోకములు, ధనధాన్యాలు లభిస్తాయి. కాని ఇవేవీ ఉండేవి కావు. కొంతకాలముండి పుణ్యమైపోగానే అంతరిస్తాయి. మళ్ళీ చేస్తే మళ్ళీ కలుగుతుంది. అంటే ఎప్పటికపుడు చార్జి చేసుకుంటుండాలి. చార్జి అయిపోతే పనిచేయదు కదా! ఇలా పుణ్యానికి, పాపానికి టైమ్‌ లిమిట్‌ ఉన్నది. టైమ్‌ లిమిట్‌ లేనిది పరమాత్మ ఆరాధన. అదియే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. దాంతో ఎపుడూ పరమాత్మ తన దగ్గరే ఉంచుకుంటాడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement