Monday, October 21, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక రక్షణలో అతను చూపిన ఔదార్యాన్ని తెలుసుకుందాము.
ఇంతవరకు సృష్టి ప్రళయములలో పరమాత్మ ఔదార్యమును స్మరించుకొన్నాము. పరమాత్మ నామము, పరమాత్మ రూపము, పరమాత్మ వాహనములు, ఆయుధములు, అనంత కళ్యాణగుణములు, అవతారములు ఇట్లు పరమాత్మకు సంబంధించినవాటిని వేటిని స్మరించినా అశుభములు తొలగి శుభాలు కలుగుతాయి. ఇలా ‘నామరూపయాన ఆయుధానినః’ అంటుంది శ్రీమద్భాగవతం. అసలు జీవులకు ఈ అవకాశం కలిగించినది పరమాత్మే కదా! ఇలా నాకు సంబంధించినవాటిని వేటిని స్మరించినా, దర్శించినా, కీర్తించినా అన్ని అశుభములు తొలగి శుభములు కలుగుతాయి అని పరమాత్మ జీవులకు అవకాశము కల్పించటం పరమాత్మ ఔదార్యము కదా. ఆయన నామరూపయాన అనగా వాహనములను, ఆయుధములను, కథలను చెప్పుకుంటే ఆయనకేమి లాభమో ఆలోచించండి. జీవులకైతే కీర్తి కలుగుతుంది. కీర్తితోటి ఐశ్వర్యము అనగా అధికారము, సంపదలు, పరిచారకులు, ఇతర వనరులు కలుగుతాయి. కాని ఆయనకు కీర్తి కావాలా? లక్ష్మీపతికి కొత్త సంపదలు కావాలా? అఖిల జగత్కారణం,అఖిల జగదీశ్వరునకు కొత్తగా అధికారం కావాలా? మనకు ఉపకారము కలగాలి అని చేసిన తప్పులు, వాటివలన కలిగే నరకములు తొలగాలని లక్ష్మీపతి అని కీర్తిస్తే సంపదలు కలుగుతాయని మనకు సంసారములో పడి ఆయనను మరిచిపోయి భార్యా పుత్ర మిత్ర బంధు సంపత్‌ అధికారముల కొరకు అర్రులు చాస్తూ అంతా మేమే, అంతా మాదే, మేము అనుకున్నదానిని దేనినైనా సాధించగలం అన్న అహంతో, ఆశతో, అభిలాషతో, కోరికతో ఆయననే మరిచిపోతున్నాము. మన ప్రయత్నం విఫలం అయి ఆపదలు ఎదురైతే ‘అయ్యో దేవుడా!’ అని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించగానే తొలగిస్తున్నాడు. అయినా మనకు జ్ఞానము కలుగుట లేదు. తలవగానే తొలగిస్తున్నాడు కదా! ఆపదలు కలిగిన తరువాత స్మరించుట కన్నా ఆపదలు కలుగక ముందే అంటే ప్రతిదినం అవకాశాన్ని కల్పించుకొని ఆయనను, ఆయన కథలను స్మరిస్తే అసలు ఆపదలు రానేరావు కదా! కాని మనం ఆపదలు కలిగితేనే స్మరిస్తున్నాము. అయినా ఇంతకాలం గుర్తుకు రాలేదా, ఈ రోజు గుర్తొచ్చిందా అని అనకుండా ఎపుడు తలచినా నేను ఉన్నాను అంటూ రక్షిస్తున్నాడు. ఇంత కంటే ఔదార్యం ఎక్కడుంటుంది? ఇది సామాన్యంగా పరమాత్మ ఔదార్యమును గూర్చి తలుచుకున్నాము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement