అర్జునునకు, ఉద్ధవునకు ఇంకా చాలా సందర్భాలలో చాలామందికి ధర్మోపదేశం చేయుట ఉపదేష్టృత్వము. మనం ప్రవర్తనను ప్రవర్తింపచేయుట ప్రవర్తకత్వము అనుమంతృత్వము. ఉదాసీనముగా ఉండేది ఉపేక్షకత్వము. అయితే భగవానుడు పుణ్యపాపములకు ప్రయోజయిత కాడు. మనము ఆచరిస్తుంటే మొదట ఉపేక్షతో ఉండును. మనము కాదని నాకదే కావాలి. నేనిలా చేస్తాను. నీవు సహకరించు అని ప్రార్థిస్తే అనుమతిస్తాడు. ఇది అనుమంతృత్వము. దొంగతనము చేసేవారు గుడికి పోయి తమ దొంగతనం సఫలం కావాలని భగవంతుని ప్రార్థిస్తారు. అధర్మం చేసేవారు ప్రార్థిస్తారు. ధర్మం చేసేవారు ప్రార్థిస్తారు. స్వామి ఇచట ప్రవర్తకుడు కాడు. ఉపేక్షకుడు కాడు. మన ప్రార్థనను ఆమోదిస్తాడు. ఇది అనుమంతృత్వము. పసిపిల్లలు మంకుపట్టు పట్టి నాకింకా కావాలి. నేనిలాగే ఆడుకుంటాను అంటే తల్లిదండ్రులు అనుమతిస్తారు కదా. ఇది అనుమంతృత్వము. మనము ఒక పనిచేయటానికి ప్రవర్తించినపుడు స్వామి ఆ పనికి విఘ్నమును కలిగిస్తాడు. దానికర్థము నీవా పని చేయొద్దు అని. అయితే పెద్దలు చెపుతుంటారు. ఒక పనికి అదేపనిగా విఘ్నాలు కలిగితే లేదా మొదటనే విఘ్నాలు కలిగితే భగవంతునికి ఇష్టం లేదు. అనుమతి లేదు. ఆ పని మానేయమని అంటారు. అయినా వినకుండా కొనసాగించమని నిర్బంధిస్తే అపుడు ఫలము అనుభవించేది నీవే కదా. నీ ఇష్టం అంటూ ఆమోదిస్తారు.
(సశేషం)