Friday, December 20, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

భగవంతుడు దేహ ఇంద్రియాదులను అందరికీ ఇస్తున్నాడు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఈయకుండా ఉంటే పక్షపాతం అనాలి. పుణ్యము చేసినవానికి, పాపము చేసినవానికి సమానముగానే దేహ ఇంద్రియాదులను ప్రసాదిస్తున్నాడు. ఇది ఔదార్యము కాదా? అయితే కొందరికి కొన్ని ఇంద్రియాలు, కొన్ని అవయవాలు లేకుండా సృష్టిస్తున్నాడు కదా అంటే అక్కడ పరమాత్మ చేసేదేమీ లేదు. మనము చేసిన కర్మలకు తగినరీతిగా దేహేంద్రియాలను ప్రసాదిస్తాడు. ‘వాచికైః పక్షి మృగతాం దైహికైః పాషాణరూపం శరీరజైః కర్మదోషైః యాతి స్థావరతాం నరః’ అంటారు పెద్దలు. అనగా వాక్కుతో పాపములను చేస్తే అనగా అకారణంగా కాని, సకారణంగా కాని ఇతరులను దూషించినా, నిందించినా అనగా వాక్కును దోషములకు వినియోగిస్తే అలాంటివారిని ఆ వాక్కు లేకుండా అనగా మాట్లాడగల శక్తి లేని పక్షులు, మృగములు, పశువులుగా సృష్టిస్తాడు. శరీరముతో తప్పు చేస్తే దేహ స్పృహ లేని పాషాణములు అనగా రాళ్ళు, కొండలుగా సృష్టిస్తాడు. ఇక మనస్సుకు, శరీరసంబంధముగా తప్పు చేస్తే పిశాచములుగా, వృక్షములుగా సృష్టిస్తాడు. మన కష్టాలకు, మన బాధలకు మన కర్మలే కారణము కాని భగవంతుడు దయలేనివాడు కాడు.
మనము చేసిన కర్మల వలననే మనకు కష్టాలు, బాధలు అంటే మనతో ఆ కర్మలను అంతరాత్మగా ఉండి చేయించేవాడు ఆ భగవంతుడే కదా! అతను మనం అధర్మాన్ని చేస్తున్నపుడు వారించవచ్చును కదా! ఆ భగవంతుడు సర్వశక్తుడు కదా! వారించగల సమర్థుడే కదా! సామర్థ్యము ఉండి కూడా వారించకపోవుట దోషము కాదా అని మరియొక ఆక్షేపణము. కాని అది సరిిైునది కాదు. భగవానునికి మూడు ధర్మములు లేదా స్వరూపములున్నవి. ఉపేక్షకత్వము, ప్రయోజయితృత్వము, అనుమన్తృత్వం అని. మనము చేస్తున్నదానిని చూస్తూ ఔననక, కాదనక ఉంటాడు. దాన్నేఉపేక్షకత్వమంటారు. కర్మలలో ప్రవర్తించనివారిని ప్రవర్తింపచేయుట ప్రయోజయితృత్వము. ఈ ప్రవర్తకత్వము కూడా ఆజ్ఞాపయితృత్వము, అర్థయితృత్వము, ఉపదేష్టృత్వమని మూడు విధములు. అనగా ఇలా చేయండి, ఇలా చేయకండి, సత్యం వద ధర్మం చర అని ఆజ్ఞాపించుట ఆజ్ఞాపయితృత్వము. ‘నకలంజం భిక్షయేత్‌, న పరదారాన్‌ గచ్ఛేత్‌’ అని చేయకూడని పనులను ఇవి చేయరాదు అని ఆజ్ఞాపించును. ధర్మాన్ని చెపుతున్నాను. మీ కోసం నేనే స్వయంగా అవతరించి ఏమి చేయాలో, ఏమి చేయొద్దో చెప్పుచున్నాను. అలా చేసి సంసార దుఃఖాన్ని తొలగించుకోండి అని అర్థిస్తాడు. ఇది అర్థయితృత్వము. ఇక ఉపదేష్టృత్వం అర్జునునికి చేసిన గీతోపదేశం వంటి ధర్మోపదేశం చేయుట.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement