జీవులు తమ ఇచ్ఛానుసారముగా చేస్తే కదా సుఖాది అనుభవము భగవంతుని ఇష్టానుగుణముగా ఆయన నడిపించినట్లు నడిచినపుడు పాపపుణ్యాలు మనకెందుకు స్వర్గనరకాలు మనకెందుకు అని ఒక శంక కలుగును. అంతేకాదు కొందరికి అత్యంత కఠినమైన కష్టాలను, నరకాన్ని ప్రసాదించుట వలన ఆయన దయలేనివాడగును కదా. అనగా మంచి చెడు, పుణ్యములు పాపములు అని కర్మలను రెండు విధములుగా ఏర్పరచి వాటిని తెలుసుకొని ఏది మంచో, ఏది చెడో, ఏది పుణ్యమో, ఏది పాపమో తెలుసుకునే బుద్ధిని ప్రసాదించాడు. ఆచరించటానికి శరీరాన్ని, కరణ చరణాది అవయవాలను, సంకల్పించే మనసును ప్రసాదించాడు. మనస్సును, బుద్ధిని నియమించు శక్తిని ప్రసాదించి అయినా తెలియజాలరని తన ఆజ్ఞను తెలిపే శాస్త్రమును కూడా అందించి స్వయముగా వచ్చి బోధించి, ఆ శాస్త్రమును స్వీకరించుటకు అంతఃకరణమును ప్రసాదించి, అందులో అంతరాత్మగా తాను ప్రవేశించి, మనము స్వీకరించి, ఆచరించుచున్నదానిని అనుమంతగా అనగా ఆమోదించువానిగా ఉంటున్నాడు. అయినపుడు మనము శాస్త్రమును అనగా భగవానుని ఆజ్ఞను స్వీకరించక మంచిని, ధర్మాన్ని, పుణ్యాన్ని విడిచి, పాపాన్ని, అధర్మాన్ని, అసాధువృత్తాన్ని స్వీకరించితే తాను చెప్పినదానిని వినలేదు కావున శిక్షిస్తున్నాడు.
ఇందులో భగవానుని అపరాధమేముంది తనకు కలిగిన సంతానమును తల్లిదండ్రులు చక్కగా పెంచి, చక్కని ప్రవర్తనను, శాస్త్రమును నేర్పి, విద్యాబుద్ధులు నేర్పి, సంపదను, ఇల్లును, భూమిని, పొలమును ఇచ్చి అనగా తన ఆస్తిని ఇచ్చినపుడు తండ్రి ఇచ్చిన సంపదతో, ధనాదులతో యజ్ఞాదులను చేసినా, విషయచాపల్యముతో మదిరా కాంతా ద్యూతాదులతో ప్రవర్తించినచో ఆ దోషము తల్లిదండ్రులది కానట్లుగా తానిచ్చిన శాస్త్రమును దేహబుద్ధి మనస్సులను తీసుకొని వాటితో ధర్మమార్గమున కాక అధర్మమార్గమున ప్రవర్తించినచో భగవంతునిదా నేరము. భగవంతుడు దయలేనివాడా! ఇంత గొప్ప ఔదార్యము కలవాడు కావుననే ఇన్ని ఇచ్చినాడు. తాను వెంట ఉన్నాడు. మంచి చెడు చెప్పటానికి గురువులను, మిత్రులను పంపినాడు. పుత్రుడు సంపదను దుర్వ్యయము చేసినా తండ్రి ఆస్తిని పాడుచేశాడు అనే అంటారు. పుత్రుడు చెడుదారిలో నడిచినా ఆ తండ్రి ఎంత ఉదారుడు, ఇంత సంపద ఇస్తే వీడే పాడుచేస్తున్నాడు అంటారు. ఇక్కడ కూడా అట్లే భగవంతుడు ఎంత దయామయుడు! ఇంతటి ఉదారుడు ఇన్ని ఇస్తే వీడే వాటిని దుర్వ్యయం చేసి కష్టాలను, దుఃఖాలను కొనితెచ్చుకుంటున్నాడు అంటారు కదా!
(సశేషం)