ఇట్లు అనాది పుణ్యపాప వ్యవస్థ ఏర్పరచుట అతని స్వాతంత్య్రమే కదా. ఇక మనము చేసుకొన్నట్లు రాజ్యాంగసవరణలు అక్కడ ఉండవు. ఒకసారి వ్యవస్థ చేసినాడు. సకల చరాచర జగత్తులోని సకల వ్యక్తులు, సకల వస్తువులు, వృక్షములు, శిలలు ఈ వ్యవస్థకు కట్టుబడి ఉంటాయి. వృక్షములు వాటికి అందవలసిన ఆహారాన్ని అందిస్తే చక్కగా పెరిగి పూలు, కాయలు, పండ్లు, గృహనిర్మాణాదులకు, కుర్చీలు, మంచాలు మొదలగువాటికి చెక్కను అందజేస్తాయి. భగవంతుడేర్పరిచిన వ్యవస్థనే సకల జగత్తు అనుసరిస్తుంది. భగవంతుడు కూడా ఆ వ్యవస్థను అనుసరిస్తాడు, అతిక్రమించడు. వ్యవస్థ అంటేనే రక్షణ సృష్టి విధానము. తాను ఏర్పరచిన వ్యవస్థను తాను మార్చినా అతిక్రమించినా అది వ్యవస్థయే కాదు. స్వాతంత్య్రము అంటే యధేష్టముగా ప్రవర్తించుట కాదు. యధేష్టముగా నీతినియమాలు, అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తించటం, విశృంఖలత్వము, దురుసుతనము అవ్యవస్థ అంటారు. వారెలా ఉండాలో, ఉంటారో కూడా స్వామి వివరించారు. వాటిని తెలుపుటకే హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు, రావణకుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు విశృంఖలత్వమును, దానివలన కలిగే ఫలితమును చూపటానికి వచ్చినారు. పరమాత్ముడికి చక్కని వ్యవస్థను ఏర్పరచుట, దాన్ని ఆచరింపచేయుట, ఆచరించనివారిని శిక్షించుట, ఆచరించినవారిని రక్షించుట ్ ఇది పరమాత్మ స్వాతంత్య్రము అంటే.
తాను కూడా తన నియమాలను దాటితే తాను కూడా శిక్షను అనుభవించాడు. తులసి విషయములో, భృగువు విషయములు, అతనికి శాపాన్ని కలిగించాయి. కౌరవులను దుష్టులుగా సంహరించిన తరువాత గాంధారి శపించినది. పరమాత్మ సంకల్పమే వారి నోట శాపముగా వెలువడిరది. రామావతారంలో కొన్ని, కృష్ణావతారంలో కొన్ని ఆ శాపాలను అనుభవించాడు. ధర్మవిషయంలో భగవంతుడు కూడా మినహాయింపు కాదు అని చెప్పినాడు. అలా తాను కూడా అనుసరించటమే, ఇతరులను అనుసరింపచేయటమే పరమాత్మ స్వాతంత్య్రానికి నిదర్శనము. తానే గీతలో చెప్పాడు. ‘ఉత్సీదీయురిమా లోకా న కుర్యాం కర్మ చేదహం, సంకరస్య చ కర్తాస్యా ముపహన్యాయమాః ప్రజాః’ అనినారు. నేను కర్మలనాచరించకుంటే ఈ ప్రజలు భ్రష్టులౌతారు. వర్ణసంకరము, గుణసంకరము, ధర్మసంకరమేర్పడును. వీరినందరిని నేనే చంపినవాడనౌతాను అన్నాడు. అందువలన పుణ్యపాపకర్మలను అనుసరించి అనగా తాను ఏర్పరిచిన వ్యవస్థను అనుసరించి పుణ్యమును చేసినవారికి శ్రేయస్సు, పాపమును చేసినవారికి నరకమును ప్రసాదించుట స్వాతంత్య్రమునకు భంగము కాదు. అనాది పుణ్యపాప వ్యవస్థ కూడా పరమాత్మ యొక్క అనాది స్వాతంత్య్ర అధీనమే అన్నారు. పుణ్యపాప వ్యవస్థ భగవానుడే ఏర్పరిచే ఆయా పుణ్యపాప రూప కర్మలలో ప్రాణులు ప్రవర్తించుట కూడా పరమాత్మ ఇచ్ఛాధీనమే కదా! పరమాత్మ ఇచ్ఛానుగుణముగా ప్రవర్తించిన జీవులకు పుణ్యపాపములేమిటి, స్వర్గనరకములేమిటి?
(సశేషం)