ఈ సంసారమును సృజించినవాడు పరమాత్మయే, పాపములను, పుణ్యములను సృజించినవాడు భగవానుడే అనగా నిర్దేశించినవాడు భగవానుడు. శరీరమును ఇంద్రియములను ఇచ్చి, వాటితో ఆయా పనులను చేయించువాడు భగవానుడే అని కదా వేదశాస్త్రాలు చెపుతున్నాయి. అయితే ఆ భగవానుడు పరమ దయానిధి అని కదా చెప్పినారు. ఇట్లు దయాళువైన భగవంతుడు సంసారులను అహితకర్మలయందు అనగా పాపకర్మములయందు ఎట్లు ప్రవర్తింపచేస్తున్నాడు? ప్రవర్తింప చేయుచున్నవాడు భగవంతుడే అని చెప్పినాడు కదా. అయినపుడు భగవంతుడే పాపకర్మలయందు అహితకర్మలయందు ఎట్లు ప్రవర్తింపచేయుచున్నాడు. అంటే ఆతను చేయించుట లేదు. ఆ జీవులు పూర్వజన్మలో చేసిన ఆయా కర్మల వలననే పరమాత్మ ఆయా బుద్ధిని ఇచ్చుచున్నాడు. అట్లు ప్రవర్తింపచేయుచున్నాడు అనగా కర్మలను బట్టే పరమాత్మ ప్రాణులను ప్రవర్తింపచేసినచో జీవుల వలె భగవంతుడు కూడా కర్మ పరతంత్రుడే కావలయును కదా! భగవంతుడు స్వతంత్రుడైనచో జీవులతో మంచిపనులే చేయించాలి. చెడు పనులు చేయించకూడదు. చెడు బుద్ధులు కలిగించకూడదు. అతను అనగా భగవానుడు ఒకరిని ద్వేషించి చెడుపనులను చేయించడు. ఒకరిని ప్రేమించి మంచి పనులను చేయించడు.
అతను భగవానుడు అనగా జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులను ఆరు గుణములు పరిపూర్ణముగా కలవాడు. అతను పురుషోత్తముడు. తాను పొందవలసినవి ఏవీ లేనినాడు తనకే కావాలనుకుంటే మనకెలా ఇస్తాడు? అందుకే పొందవలసినవాటిని అన్నిటిని పొందినవాడు సర్వజ్ఞుడు. అన్నీ తెలిసినవాడు అనగా ఎవరికి ఏ ఫలములను యే రీతిగా ఈయాలో, వారు ఏ కర్మలను చేయుచున్నారో, ఏమి తలచి యేమి చేస్తున్నారో, సృష్టి ఎలా చేయాలో, రక్షణ ఎలా చేయాలో సంహారము ఎపుడు చేయాలో తెలిసినవాడు. జగమంతా అతని ఇచ్ఛతో ప్రవర్తించుచున్నది అనినచో అంతా తన ఇచ్ఛాధీనమైతే జ్యోతిష్టోమాది యాగములు పుణ్యములు, బ్రహ్మ హత్య, వేదనింద, అసత్యభాషణము పాపము అని ఎలా అంటారు. ఆయన ఇచ్ఛతో పాపము పుణ్యముగా, పుణ్యము పాపముగా మారవచ్చును కదా! అనగా మళ్ళీ మళ్ళీ మారకుండా, మార్చకుండా సృష్టి సమయములోనే ఇవి పుణ్యకర్మలు, ఇవి పాపకర్మలు అనగా ఇవి మంచిపనులు, ఇవి చెడుపనులు అని కర్మలను రెండు విధములుగా విభజించాడు. ఇక అవి శాసనములు. అట్లు శాసనము చేసినదే శాస్త్రము. వ్యక్తినిబట్టి పాపపుణ్యములు మారవు. ఒక వ్యవస్థను ఏర్పరచినారు. అలాంటి వాటిని స్వీకరించుటకు బుద్ధిని, మనసును ప్రసాదించాడు. ఆ పనులు చేయటానికి దేహములను, ఇంద్రియములను ఇచ్చాడు. మంచిపనులను చేయాలి, ఇతరములను చేయకూడదు అని నియమనశక్తిని కూడా వారికి భగవానుడు ఇచ్చినాడు.
(సశేషం)