Thursday, December 12, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ధర్మమార్గరతులైన పాండవులకు అనుక్షణం వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. అధర్మాన్ని ఆచరించే కౌరవులకు కూడా అనుక్షణం వెంటనే ఉన్నాడు. వారి ఆశలను, ఆశయాలను భంగపరచటానికి అట్లైననూ ఏ బలము అనగా భీష్మ ద్రోణ కర్ణ కృపాశ్వత్థామాది అతిరథ మహారథుల సాయము అండగా ఉన్ననూ కౌరవుల ఒక్క ప్రయత్నము ఫలించలేదు. భగవంతుని అండ ఉన్నవారికి అపకారము చేసినా అది ఉపకారముగా, శ్రేయోదాయకముగా మారుతుంది. ద్యూతములో ఓడిరచి అరణ్యవాసం చేయించారు. కాని పాండవులకు అరణ్యవాసం సకల సిద్ధులను కలిగించినది. మహానుభావుల, మహర్షుల దర్శనము కలిగింది. ఒక మహర్షిని దర్శించితే ‘ఆయుర్యశో బలం తేజః సంపత్‌ జ్ఞానం తథా సుఖం సిద్ధిశ్చైవాష్టసిద్ధ్యంతి’ అంటుంది పద్మపురాణము. ఒక భగవద్భక్తుని దర్శించితే ఆయుష్యము, కీర్తి, బలము, తేజస్సు, సంపత్తు, జ్ఞానము, సుఖము, సిద్ధులు కలుగుతాయి.
ఒక మహానుభావునికి అపకారము చేస్తే ‘హన్తి సర్వాణి పుణ్యాని పుంసాం మహదతిక్రమః’ అంటుంది భాగవతం. మహానుభావులను అవమానపరిస్తే సకల శ్రేయస్సులు, సకల పుణ్యములు నశిస్తాయి. శుభాలు తొలగి, అశుభాలు కలుగుతాయి. ద్యూతంలో గెలిచారు. యుద్ధములో ఓడారు. అడవులలో ఉన్న పాండవులు ఆనందంతో ఉన్నారు. నగరంలో, రాజ్యంలో ఉన్న దుర్యోధనుడు నిద్ర లేని రాత్రులను గడిపాడు. ఆలోచించండి బాధించినవాడు నిద్రకు దూరమయ్యాడు. బాధించబడినవారు కంటినిండా నిద్రపోయారు. హంసతూలికా తల్పాలు నిద్రను ఈయలేవు. కటిక నేల, ఆకులు, అడవులు హాయిగా నిద్రను ఇచ్చాయి. అడవిలో క్రూరమృగాలు పాండవులను బాధించలేదు. నగరంలో మానవులు బాధించారు. పాపాత్ములు క్రూరమృగాల కంటే క్రూరులు అని భారతం పాఠం చెపుతుంది.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement