Thursday, December 12, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఒక్కొక్క యుగం ఒక్కొక్క గుణానికి నిలయం. కృతయుగం పూర్తిగా సత్త్వగుణం. ధర్మం నాలుగు పాదాలతో పరిపూర్ణంగా ప్రవర్తిస్తుంది. అంటే ఆ యుగం సత్త్వగుణం ఉన్నవాళ్ళే, పుణ్యమును చేసినవాళ్ళే, చేయువాళ్ళే పరమాత్మ సంకల్పంతో పుడ్తారు. త్రేతాయుగంలో ధర్మం మూడొంతులు, ఒక వంతు అధర్మం చేసేవాళ్ళు అంటే సత్త్వగుణం 75%, తమోగుణం 25% వంతులుంటుంది. లేదా సత్త్వగుణం 50%, రజోగుణం 25%, తమోగుణం 25% ఆచరించేవారు పుడ్తారు. ద్వాపరయుగంలో రజోగుణం 50%, తమోగుణం 25%, సత్త్వగుణం 25% ఆచరించేవారు పుడ్తారు. ఇక కలియుగం తమోగుణ ప్రాధాన్యం కలది. అంటే 75% తమోగుణం, 12.5 రజోగుణం, 12.5% సత్త్వగుణం కలవారు పుడ్తారు. కలి అంటే సర్వసాధన బాధకుడు అంటుంది భాగవతం. యుగాలను గుణాలకు అప్పగించాడు భగవానుడు. ఆయా గుణాలు కలవారుగా పుట్టవలసినవారు ఆ యుగాలలో పుడ్తారు. కలియుగంలో ధర్మం ఒక పాదం, అధర్మం మూడు పాదాలతో ఉంటుంది. భగవంతుడు ఈ యుగాన్ని కలికి ఇచ్చాడు. కలి అంటే పాపం, అధర్మం. అటువంటివారే కలియుగంలో పుడతారు. పరమాత్మ జరుగుచున్నదానిని దగ్గర ఉండి చూస్తూ సహిస్తుంటాడు అంటుంది భాగవతం. ‘అతస్తు పుండరీకాక్షం సహతే నికటే స్థితః’ అంటారు. అయినా అధర్మమును చేసినవారికి శిక్షలు, దుఃఖము కలుగుతూనే ఉంటాయి. కాని వారు అవి ఇటువంటి వాటికి సహజం అనుకుంటారు కాని శిక్షగా తలచరు. అది వారి తమోగుణ ప్రభావం. ఉన్నదానికి విపర్యయముగా అనగా వ్యతిరేకముగా తలచుటే తమోగుణం పని. అధర్మాన్ని ధర్మమని, అన్యాయాన్ని న్యాయమని తలచుటే వారి స్వభావము. ఎదుటివారిని బాధించుటే వారి ధర్మము. అది వారి పూర్వజన్మ కర్మవాసనా ప్రభావము. అటువంటివారిని తగిన సమయంలో స్వామి శిక్షిస్తూనే ఉంటాడు. అటువంటివారిని కూడా దయ తలచటం దయా గుణము కాజాలదు. అసామర్థ్యమే అవుతుంది. అందుకే వారిని మంచిదారికి తెచ్చుటకు శిక్షించుట కూడా దయాకార్యమే. అట్లు కానినాడు అనగా తప్పు చేసినవారిని శిక్షించటం దయాగుణము కాకున,్న వారిని దారికి తెచ్చుట దయ కానినాడు శత్రువులను యుద్ధములో సంహరించుట కూడా దోషము కావలసివచ్చును. అందుకే పరమాత్మ తన శాసనములను ఉల్లంఘించువారి ప్రయత్నములను నివర్తింపచేయుటకే పరమాత్మ ఆయా కల్పములలో ఆయా అవతారములను ధరించి ధర్మబోధ చేసి ఇది పాపము, ఇది పుణ్యము, ఇది ధర్మము, ఇది అధర్మము అని బోధించుచు అధర్మమును, పాపమును ఆచరించినవారిని శిక్షించుచు, అధర్మాచరణకు, పాపాచరణకు ఫలితం ఇట్లు ఉంటుంది అని తెలియజేస్తూ ధర్మమును, పుణ్యమును ఆచరించువారిని అన్నిటికి తాను అండగా ఉండి, రక్షిస్తూ ధర్మాత్ములకు ఇలాంటి ఉత్తమ ఫలము కలుగుతుంది అని బోధిస్తూ ఉంటాడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement