Thursday, December 12, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక జీవులు ఆ భగవంతుడిచ్చిన శక్తితో భగవంతుడిచ్చిన ఇంద్రియములతో శరీరముతో అతని సహకారాన్ని అండగా తీసుకొని శక్తిసామర్థ్యాలను శరీరావయవాలను అతనిచ్చినదానిని తీసుకొని, అతనిచ్చిన ధర్మశాస్త్రాన్ని మాత్రము విడిచి తన ఇచ్ఛానుగుణముగా ప్రవర్తించుచున్నారు. శాస్త్రమును వదులుట ఒక పాపము, ఎవరి నియమములు నాకెందుకు? నా మనసునకు నచ్చినది చేస్తాను అనటానికి కూడా నియమాలలో నేనేది తినాలో మీరు చెప్తారా? మీరు చెప్పినదానిని నేనెందుకు తినాలి? మీ ఉపదేశాలు నాకెందుకు అని నేనే కర్తను, భోక్తను అంటూ చేసే పనులు పాపములు. తాను ఆచరించునపుడు ఎవరి సలహాలు వద్దు. ఆచరించి అగాధమైన అష్టకష్టాల పాలై దేవుడా సాయం చెయ్యి, కాపాడు, నాకు అండగా ఉండు అని ప్రార్థించి కర్మలకు అంటే పాపాలకు ఫలితాలనిస్తే దేవుణ్ణి నిందించటం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. అందులో తన ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించేవాడు, పుణ్యములను చేయువాడు, తన శాసనాన్ని అనగా శాస్త్రాన్ని కాదని శాస్త్రం వద్దు, చేయరాదు అన్నవాటిని చేసినవాడు, పాపములను చేయువాడు. తన శాసనాన్ని అనుసరించేవాడిని స్వామి తెలుసుకొని అతనికి ధర్మార్థ కామమోక్షములను ప్రసాదిస్తూ అతని వృద్ధికి దోహదపడును. ఇక శాసనమును అనగా శాస్త్రమునుల్లంఘించి తనకు నచ్చినదానిని తాను కోరుకున్నదానిని చేయువానిని అధర్మమును, అనర్థమును, దుష్కామములను, సంసారమును వృద్ధిచేయును. అందువలన పరమాత్మకు కాని, జీవునికి కాని స్వాతంత్య్రము లేదు అను అవకాశమే లేదు. అంతా స్వాతంత్య్రము పరమాత్మకే. జీవునకు పూర్వజన్మ కర్మను, ఫలములను అనుభవించుటకు, దానికి తగిన కర్మలను ఆచరించుటకు జీవులకు స్వాతంత్య్రము నిచ్చును. జీవులకు స్వాతంత్య్రము నిచ్చుట అనుకున్నదానిని చేయుటకు అనుమతించుట కూడా పూర్వజన్మ కర్మవాసనా పరంపర వలన కలుగునదే. పరమాత్మ దయానిధి. దయ అనగా స్వార్థాపేక్ష లేకుండగా పరుల దుఃఖమును సహించజాలకుండుట. పరుల దుఃఖమును తొలగించుట. ఈ పరమాత్మ దయ తన శాసనమును లంఘించి అనగా కాదని ప్రవర్తించువానిపై కూడా ఉండును. కాని వానిపై దయ చూపి వానికి కలుగు దుఃఖాలను తొలగించినచో అధర్మాన్ని భగవానుడు ప్రోత్సహించినవాడే అగును. అవి పరమాత్మ గుణములలో చేరవు. తప్పు చేసినవానిని శిక్షించుట కూడా దయయే. ఇంకా చెప్పాలంటే శిక్షించుటే దయ. కత్తి తీసుకోవద్దంటే తీసుకుంటే చేయికి గాయమౌతుంది. ఆ గాయం వద్దన్నవాడు చేయడు. కత్తే చేస్తుంది. అట్లే అధర్మము ఆచరిస్తే ఆ అధర్మమే చేసినవానిని బాధిస్తుంది. ఊహించని విపత్తులను కలిగిస్తుంది. అక్కడ శాస్త్రమే తన విధిని తాను చేస్తుంది. అలా ఒకటికి రెండుమార్లు చేయి తెగితే ఇక వాడు కత్తి తీసుకొమ్మన్నా తీసుకోడు. అధర్మాన్ని అనగా పాపాన్ని ఆచరిస్తే ఇలా బాధలు కలుగుతాయి అని అనుభవపూర్వకంగా తెలిస్తే ఇక వాడు ఆ తప్పులను అంటే పాపాలను చేయడు. అయితే ఈనాటి కాలంలో అధర్మాలను, అన్యాయాలను ఆచరించేవారికే అన్ని సుఖసంతోషాలుంటున్నాయి. వారిని పరమాత్మ శిక్షించటం లేదు అనుకోకండి.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement