లేనిదానిని కానిదానిని సంకల్పించనివాడు తాను సంకల్పించుచున్నాడు అంటే అది జరిగి తీరుతుంది. అనంత విశ్వమును సృజించాలని సంకల్పించి సృజించినవాడు, ‘బహుస్యాం ప్రజాయేయ’ అని కదా ఆ భగవానుని సంకల్పము. అలా ఈ ప్రపంచమును సృజించినవాడు, జీవుల కర్మలకనుగుణముగా ఫలములను కూడా పెద్దగా ప్రయత్నము, ఆయాసము లేకుండగా తన మాహాత్మ్యమునకు అనుగుణముగా లీలయందు ప్రవర్తించువాడు అయినా తన ఔదార్యమును చాటుటకు జీవులకు ఈ పనులు మంచివి, ఈ పనులు చెడ్డవి అని కర్మలను రెండు విధములుగా విభాగము చేసి ఆ కర్మలను తెలుసుకొనుటకు బుద్ధిని ప్రసాదించి, కర్మలను ఆచరించాలి అని సంకల్పించుటకు మనస్సును ప్రసాదించి ఆచరించవలసిన ఆచరించాలనుకున్న పనులను చేయుటకు కావలసి హస్త, పాదాది అవయవాలను త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములను, జ్ఞానేంద్రియములను, వాక్ పాణి పాద పాయు ఉపస్థలను, కర్మలను ప్రసాదించి ఆయా ఇంద్రియములతో ఆయా కర్మలను చేయుటకు, మానుటకు అనగానే అనుకున్నదానిని చేయుటకు, వద్దనుకున్నదానిని మానుటకు కావలసిన నియమనశక్తిని సామాన్యముగా అందరికీ అందించి, తాను శాసనరూపముగా వేదశాస్త్రములను అందరికీ అందించి, అట్లు అందించిన వేదశాస్త్రమును అధ్యయనము చేయుటకు యోగ్యులైన గురువులను అందించి గురువుల ద్వారా తన ఆజ్ఞారూపమైన శాస్త్రములను ఉపదేశించి, అట్లు ఉపదేశించినదానిని గ్రహించుటకు అంతరాత్మగా తానే ప్రతి ప్రాణిలో ప్రవేశించి ఉంటూ ప్రతి క్షణము ఇవి చేయదగినవి, ఇవి చేయరానివిగా అంతరాత్మరూపములో ప్రబోధించి, అయినా జీవుడు చేయదలచుకున్నదానిని అనుమంతగా ఆమోదించేవానిగా నీవు ఆచరిస్తే ఆ ఫలితం నీవే అనుభవించాలి. నామీద నింద వేయొద్దు అంటూ ప్రతి క్షణం హెచ్చరించుచు చాలావాటిని నియమించుచున్నాడు. ఇదంతా ఔదార్యం కాదా! ఇంత చేసి చక్కని ధర్మమార్గాన్ని పూలలాగా ధర్మాలను పరిచిన దారిని ఏర్పరచగా ఆ దారిని వదిలి అధర్మాలనే ముళ్ళు పరిచిన దారి ఎన్నుకుంటే కలిగిన ఫలితాలకు ఆ భగవంతుని నిందిస్తే కూడా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటున్నాడు.
(సశేషం)