శాస్త్రం విధించిన కర్మ ధర్మము. శాస్త్రము నిషేధించిన కర్మ అధర్మము. ధర్మము పుణ్యము. అధర్మము పాపము. అట్లు అధర్మమైన పాపకర్మలను ఆచరించువారిని దుఃఖమును అనుభవించు జన్మలను ఇస్తాను అన్నారు. ‘ఆసురీ యోనిషు’ అన్నారు. చూడుడు. ‘తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాప్యజస్రమశుభం ఆసురీష్వేవ యోనిషు’ అనినాడు స్వామి. నేను చెప్పిన ధర్మశాస్త్రములను, ధర్మశాస్త్రములను చెప్పిన నన్ను ద్వేషించేవారిని, క్రూరులను, నరాధములను అసుర జాతులలో పుట్టించెదను. అసురజాతి అంటే తామస రాజస గుణములు విజృంభించే స్వభావము కల జాతులలో అవి ఎక్కువగా ఉన్న ప్రదేశములో అటువంటివారు ఎక్కువగా ఉన్నచోటను వీరిని పుట్టిస్తాను అని స్వామి స్పష్టముగా చెప్పియున్నారు. భగవానుడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు తానుగా పొందవలసిన కోరికలేమీ లేనివాడు, సకల చరాచర జీవుల కోరికలను వారి వారి కర్మల ఫలానుభవరూపముగా అందించేవాడు, అన్నీ తెలిసినవాడు అనగా ఎపుడు ఎవరికి ఎక్కడ ఏ రూపముగా ఫలములను ప్రసాదించాలో, ఎవరికి ఈయవద్దో, ఎవరెవరు ఏమేమి కోరుచున్నాడో తెలిసినవాడు, సకల చరాచర జగత్తును శాసించువాడు. ప్రతివారిలో అంతర్యామిగా ఉండి అందరినీ శాసించేవాడు, ‘అంతః ప్రవిష్ట శ్శాస్తా జనీనాం’ అంటుంది వేదము. సత్యసంకల్పుడు, తాను సంకల్పించుకున్నది నిరంతరము అన్నిచోట్ల ఉండునది, అందరిలో ఫలమును, బలమును కలిగించునది.
(సశేషం)