Monday, October 21, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ప్రతి ప్రాణికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరము సమానముగానే ఉంటాయి. కాని అవి చేసే పనిలో తేడా ఉంటుంది. దేవతల జ్ఞానము దివ్యము. మానవుల జ్ఞానము ప్రాకృతము. వివేకము ఇద్దరికీ ఉంటుంది. పశువులకు, పక్షులకు ఆహార నిద్రా భయం సంతానము కొరకే బుద్ధిని, మనస్సును ఇచ్చాడు. భగవంతుడు తన ఉదరములో ఉన్న ఆత్మలకు శరీర ఇంద్రియములను జోడిరచటం ఔదార్యమే కదా! సాధుజనులు కత్తిని కూరగాయలను, పండ్లను కోయటానికి ఉపయోగిస్తారు. దుష్టజనులు అదే కత్తిని ప్రాణిహింసకు ఉపయోగిస్తారు. సాధనము ఒకేలాగ ఉంటుంది. ధరించినవారు, అవయవాలు ఒకేలాగ ఉండును. ఉపయోగించు బుద్ధి వేరుగా ఉంటుంది. ఈ బుద్ధిని, ఆ బుద్ధిని ఇచ్చినవాడు భగవంతుడే. ఇది పక్షపాతము కాదా అంటారేమో! కన్నతల్లి రోగమున్న పిల్లవానికి ఒక విధమైన ఆహారమును, ఆరోగ్యమున్నవానికి ఇంకొక ఆహారమును ఇచ్చుట పక్షపాతమంటామా? అట్లే అహంకారము అందరికీ ఉంటుంది. ప్రతి ప్రాణికి స్వార్థముంటుంది. అహంకారముంటేనే స్వార్థం ఉంటుంది. నేను అన్న తరువాతనే నాది అనేది. ఇది ప్రకృతి సహజము. కాని అందులో కొందరిలో ఎక్కువ, కొందరిలో తక్కువ ఉంటుంది. ఉంటుందా, భగవంతుడిస్తాడా అంటే ఆయనే ఇస్తాడు. ఇట్లు ఇచ్చుట మరి ఔదార్యమే కదా! కాని కొందరికి ఒక విధముగా, ఇంకొందరికి ఇంకొక విధముగా ఇచ్చుట పక్షపాతము కాదా అనగా అసలే కాదు అంటాడు. మీరు చేసుకున్నదానినే మీకు ఇస్తాను. మట్టితో కుండలు చేసినవానికి మట్టికుండలు, బంగారముతో చేస్తే బంగారుకుండలు కదా. నీవు చేసుకున్న కర్మకు తగినంత నీకిస్తాను. అందరూ కలెక్టర్లు కాలేరు, ఐఎఎస్‌ చదవాలి. అట్లే మనము చేసుకున్న కర్మే మన సర్టిఫికెట్‌. ఆ కర్మకు అనుగుణముగా బుద్ధిని ఇచ్చుట భగవంతుని ఔదార్యము. అందుకే ‘బుద్ధిః కర్మానుసారిణీ’ అని ఆర్యోక్తి. ఆ కర్మ కూడా ఆయనే చేయిస్తాడు కదా. ఆయన చేయించి మనకు శిక్ష యేమిటి అని మరో ప్రశ్న. పరమాత్మ బుద్ధిని ఇచ్చాడు తెలుసుకోవటానికి, వేదశాస్త్రాలను ఇచ్చాడు అవి చదివి ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ‘హర్తుం తమః సదసతీ చ వివేక్తు మీశః మానం ప్రదీపమివకారుణి కొదదాతి’ అంటారు. బుద్ధిని ఇచ్చి ప్రవర్తనను అలవరచుకోవటానికి శాస్త్రము ఇచ్చాడు. నీవు దేన్ని నిర్ణయించుకున్నా స్వామి దాన్నే ఆమోదిస్తాడు. నేను చెప్పినదానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. నా మాట వినలేదు అని కోపించడు. అతడు అడిగినది ఇస్తాడు. ఇదీ ఔదార్యమంటే. నా మాట వింటేనే ఇస్తాను అనడు. వినకున్నా ఇస్తాడు. ఇదీ ఔదార్యమంటే. అయితే తప్పుగా అడిగినందుకు అతనిలో ఆ తప్పుడు బుద్ధి పోగొట్టటానికి దానికి ఫలితరూపములో శిక్ష కూడా ఇస్తాడు. శిక్ష ఇచ్చి తప్పును సరిదిద్దడం ఔదార్యము కాదా! దొంగ నా పని అంటే దొంగతనము విజయవంతం కావాలని భగవంతుని ప్రార్థిస్తాడు. దొర నా సంపద కాపాడమని ప్రార్థిస్తాడు. ఇద్దరి కోరిక తీరుస్తాడు. దొంగతనం విజయవంతం చేస్తాడు. దొంగతనానికి శిక్ష వేస్తాడు. దొర సంపద కాపాడ్తాడు. ఆ సంపదతో దానధర్మాలు చేయిస్తాడు. అంటే మన కోరిక తీర్చటం ఔదార్యమే. తప్పు కోరినందుకు తెలియటానికి శిక్ష ఔదార్యమే. ఇది సృష్టిలో పరమాత్మ చూపిన ఔదార్యమును తెలుసుకున్నాము. ప్రళయములో ఔదార్యాన్ని తెలుసుకున్నాము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement